ప్రియాంక గెలిస్తే..కాంగ్రెస్​కు ఇంకింత జోష్​!

ప్రియాంక గెలిస్తే..కాంగ్రెస్​కు ఇంకింత జోష్​!

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల కంటే.. దక్షిణాదిన ‘గాడ్స్ ఓన్ కంట్రీ’గా  పేరుపొందిన  కేరళలోని  వయనాడ్  లోక్ సభ  సెగ్మెంట్ ఉప ఎన్నికపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.  దేశవ్యాప్తంగా  రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది.  కాంగ్రెస్ అగ్రనేత  ప్రియాంక గాంధీ తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తుండడమే ఇందుకు కారణం. 

మలయాళీ భాషలో వయల్ అంటే ‘వరి పొలాలు’. నాడు అంటే ‘భూమి’. ‘వరి పొలాల భూమి’ కాలక్రమేణా వయనాడ్​గా మార్పు చెందింది. కర్నాటక, తమిళనాడు సరిహద్దులను విభజించే జిల్లా ఇదొక్కటే.  పశ్చిమ కనుమల్లోని  ఎత్తు పల్లపు భూముల్లో  సహజ సంపదకు నిలయం ఈ ప్రాంతం.  దక్షిణ పీఠభూమిలో దక్షిణ తీరాన ఉండగా.. హిల్ స్టేషన్లలో ఒకటిగానూ ప్రత్యేకతను కలిగి ఉంది.   

గత మే నెలలో 18వ  లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ  రెండోసారి (2019లో తొలిసారి) విజయం సాధించారు. అదేవిధంగా  యూపీలోని  రాయ్ బరేలి ఎంపీగానూ గెలుపొందారు. ఒకేసారి  రెండు స్థానాల్లో గెలవడంతో  వయనాడ్​కు  రాహుల్  రాజీనామా చేశారు.  అన్న రాహుల్​ వదులుకున్న సీటు నుంచే చెల్లి  ప్రియాంక  పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె దశాబ్దకాలానికి పైగా రాజకీయాల్లో ఉంటూ వస్తున్నా  ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి.   ప్రియాంక  పొలిటికల్ ఎంట్రీపై  సస్పెన్స్ కొనసాగుతుండగా చివరకు వయనాడ్​లో  పోటీ చేస్తూ స్పష్టత  ఇచ్చారు.

వయనాడ్​లో ప్రియాంక గెలుపు  దాదాపు ఖాయమే అని  పొలిటిల్​ ఎక్స్​పర్ట్స్​ అభిప్రాయం. ఎందుకంటే, అక్కడ మైనారిటీ ఓటర్లు అధికంగా ఉండడం కలిసొచ్చే అంశంగా చెపుతున్నారు.  అనూహ్యంగా కూడా వయనాడ్​లో  ప్రియాంక గాంధీ ఓడిపోయే అవకాశాలు కనిపించడంలేదు. మెజారిటీ  హెచ్చుతగ్గులు తప్ప ఆమె గెలుపు ఖాయమనేదే విశ్లేషకుల మాట.

 రాహుల్​గాంధీకి తోడుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి  ప్రియాంక లోక్​సభ సభ్యురాలిగా తోడైతే, కాంగ్రెస్​పార్టీ నాయకత్వం మరింత బలోపేతమయ్యే అవకాశాలుంటాయి. దేశంలో  కాంగ్రెస్​ పార్టీ  రాజకీయాలను మరింత బలంగా నడపగలిగే అవకాశాలు పెరుగుతాయి. ఇంకా చెప్పాలంటే, ప్రియాంక  అరంగేట్రం కాంగ్రెస్​ పార్టీకి మరింత మంచి భవిష్యత్తే కానుంది.

దక్షిణాదిలో మూడు తరాలుగా పోటీ

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె కోడలు సోనియాగాంధీ, ఆ తర్వాత మనవరాలు ప్రియాంక గాంధీ.. ఇలా మూడు తరాలుగా కాంగ్రెస్​ అధినాయకత్వం దక్షిణ భారత్ నుంచి పోటీ చేయడం చారిత్రాత్మకం. ఇందిరా గాంధీ 1978లో కర్నాటకలోని  చిక్‌‌ మగుళూరునుంచి,1980లో   తెలంగాణలోని  మెదక్ నుంచి పోటీ చేసి గెలుపొందారు.  మెదక్  గెలుపుతోనే  ఇందిర మూడోసారి ప్రధాని పదవిని చేపట్టారు. 1984లో ఆమె హత్యకు గురైనప్పుడు  ఇక్కడి  నుంచే  ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు.

1999లో  సోనియాగాంధీ తొలిసారిగా కర్నాటకలోని  బళ్లారి స్థానం నుంచి  లోక్ సభకు పోటీచేసి  ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.  ఆ సమయంలో సోనియాపై బీజేపీ అభ్యర్థిగా సుష్మా స్వరాజ్ పోటీచేసి ఓడిపోయారు.  మరోవైపు ఈ ఏడాది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యక్ష రాజకీయాలకు(గత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు) స్వస్తి పలకడం.. ఆమె కూతురు అరంగేట్రం చేస్తుండడం  విశేషం.  

బీజేపీ ఎంపీ క్యాండిడేట్​గా కార్పొరేటర్  

కాంగ్రెస్ పార్టీ జనరల్​ సెక్రటరీ  ప్రియాంక గాంధీ వయనాడ్​లో  ప్రతిష్టాత్మకంగా  పోటీ చేస్తుండడంతో, ఈసారి బీజేపీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.  గత  లోక్ సభ ఎన్నికల్లో  వయనాడ్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన  సురేంద్రన్ కు (ఇతనిపై 240పైగా క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి)  మరోసారి  చాన్స్  ఇవ్వలేదు.  కొత్త అభ్యర్థిగా సాధారణ మహిళ.. ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగిన న‌‌వ్య హ‌‌రిదాస్‌‌ను ఎంపిక చేశారు. 

ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె ప్రస్తుతం కొజీకోడ్  కార్పొరేషన్​లో  బీజేపీ  కౌన్సిలర్‌‌.  రాష్ట్ర  బీజేపీ  మహిళా  మోర్చా  ప్రధాన కార్యదర్శి.  2021లో  అసెంబ్లీ ఎన్నికల్లో  కొజీకోడ్  సౌత్ సెగ్మెంట్ నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ‘రాహుల్ గాంధీ తమ సమస్యలు పరిష్కరిస్తారనే నమ్మకంతో వయనాడ్ ప్రజలు ఓట్లేసి  రెండుసార్లు ఎంపీని చేశారు. కానీ, రాహుల్​ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ అదే ఫ్యామిలీ నుంచి ప్రియాంక వస్తున్నారు. ఆమె కంటే  ప్రజాప్రతినిధిగా నాకే ఎక్కువ అనుభవం ఉంది. ప్రజా జీవితంలో చాలా ఏండ్లుగా ఉంటున్నా.. నన్ను గెలిపిస్తే ప్రజల సమస్యలను పరిష్కరిస్తా’ అంటూ  నవ్య హరిదాసు  ప్రచారంలో  ముందుకెళ్తున్నారు. 

కమ్యూనిస్టుల  కంచుకోటలో  పాగా

కాంగ్రెస్ నుంచి ప్రియాంక, బీజేపీ నుంచి నవ్య హరిదాస్ పోటీపడుతుండగా.. ఇద్దరు మహిళా అభ్యర్థుల మధ్య  పోటీ ఆసక్తికరంగా మారింది.  సీపీఐ నుంచి సత్యన్ మొకేరిని పోటీ చేస్తున్నారు.  కాగా,  గత ఎన్నికల్లో సీపీఐ నుంచి మహిళా అభ్యర్థి అన్ని రాజా పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు.  కమ్యూనిస్టుల  కంచుకోట  కేరళలో  కొంతకాలంగా  బీజేపీ  పట్టుకోసం  తీవ్రంగానే  ప్రయత్నిస్తోంది.  కాంగ్రెస్ కూటమి, లేదంటే  కమ్యూనిస్టుల కూటమే  ఇక్కడ అధికారంలోకి వస్తుంటాయి.  కానీ,  బీజేపీకి  ఎప్పటికప్పుడు  ఓటమే ఎదురవుతుంది. 

అయితే, గత లోక్​సభ ఎన్నికల్లో సినీ నటుడు సురేశ్​ గోపీ బీజేపీ ఎంపీగా గెలుపొందటంతో కమలం పార్టీ బోణీ కొట్టింది. కాగా,  గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ  ‘మెట్రో మేన్ ఆఫ్ ఇండియా’ శ్రీధరన్ ను  పార్టీ  తరఫున  పోటీ చేయించి..  సీఎం క్యాండిడేట్​గా  ప్రకటించినా బీజేపీ పుంజుకోలేకపోయింది. వయనాడ్​లో మాత్రం ప్రియాంక గాంధీ గెలుపు నల్లేరుపై నడకే అని సెఫాలజిస్టుల అభిప్రాయం. 

నానమ్మ లెక్కనే మంచి వాగ్ధాటి 

తన నానమ్మ ఇందిర పోలికలను పుణికి పుచ్చుకోవడమే కాకుండా ఆమె మాదిరిగానే ప్రియాంక  మంచి వాగ్ధాటి కూడా.  తన కుటుంబాన్ని రాజకీయంగా విమర్శించే  నేతలకు అంతే దీటుగా ఆమె కౌంటర్లు సంధిస్తుంటారు. గత లోక్ సభ ఎన్నికల  ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ‘ దేశ ప్రజల సంపదను కాంగ్రెస్ చొరబాటుదారులకు కట్టబెడుతోంది. ఆఖరుకు మహిళల మంగళ సూత్రాలను కూడా కాంగ్రెస్ వదలిపెట్టడం లేదు’ అంటూ  తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.  

ఆయన  వ్యాఖ్యలపై  ప్రియాంక గాంధీ స్పందిస్తూ.. ‘కాంగ్రెస్  మీ మంగళ సూత్రాలను, బంగారాన్ని లాక్కోవాలని చూస్తోందా..?  దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎవరైనా లాక్కున్నారా? నా తల్లి సోనియా గాంధీ ఈ దేశం కోసం తన మంగళసూత్రాన్ని (తండ్రి మాజీ ప్రధాని రాజీవ్‌‌ గాంధీ  మృతిని ఉద్దేశించి) త్యాగం చేశారు. నానమ్మ ఇందిరాగాంధీ యుద్ధం కోసం బంగారు నగలు ఇచ్చేశారు’ అంటూ దీటుగా కౌంటర్ ఇవ్వడం, ఆమె రాజకీయ చురుకుదనాన్ని తెలుపుతోంది.

- వేల్పుల సురేష్, సీనియర్ జర్నలిస్ట్-