
- వార్డెన్ తమ ఫొటోలు, వీడియోలు తీశారని ఆరోపణ
ఘట్కేసర్, వెలుగు: అవుషాపూర్ వీబీఐటీ కాలేజీ విద్యార్థినులు శుక్రవారం కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. స్నాక్స్‌లో పురుగులు వచ్చాయని గురువారం వార్డెన్ రూపను నిలదీస్తే తమను ఫొటోలు, వీడియోలు తీశారని, వాటిని చీఫ్ వార్డన్ సత్యనారాయణకు పంపారని ఆరోపించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఆ ఫొటోలు, వీడియోలున్న ఫోన్ కావాలని విద్యార్థినులు పట్టుబట్టడంతో చీఫ్ వార్డెన్ ఫోన్తెప్పించి, పరిశీలించారు. అందులో విద్యార్థినులకు సంబంధించి ఎలాంటి అభ్యంతరకరమైన ఫొటోలు లేవని తెలిపారు. విద్యార్థినులతో మాట్లాడి, గొడవ సద్దుమణిగేలా చూశారు. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ పీవీ.శ్రీనివాస్ ను వివరణ కోరగా.. శుక్రవారం మధ్యాహ్నం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాలేజీ లోపలికి వచ్చి, విద్యార్థులను రెచ్చగొట్టి ఆందోళన చేయించారని తెలిపారు. రాజకీయ దురుద్దేశంతో కాలేజీని అప్రతిష్టపాలు చేయాలనే గొడవ సృష్టించారని పేర్కొన్నారు.