స్టూడెంట్ల ఆందోళనలతో దిగొచ్చిన వీసీ.. టీయూలో రోజంతా హైడ్రామా​

నిజామాబాద్, వెలుగు: వీసీ రవీందర్​గుప్తా, ఈసీ సభ్యుల మధ్య నెలకొన్న రిజిస్ట్రార్​ అపాయింట్​మెంట్​ వివాదం ఇంకా తేలలేదు. ఇంతలో వర్సిటీ హాస్టళ్లకు 9 రోజులు (జూన్​9 వరకు) హాలీడేస్ ​ఇస్తున్నట్లు గురువారం వీసీ జారీ చేసిన సర్క్యూలర్ ​దుమారం రేపింది. గవర్నమెంట్ ​జాబ్స్​కు సిద్ధమవుతున్న విద్యార్థుల హాస్టళ్లు ​వదిలి వెళ్లేది లేదంటూ వార్నింగ్ ​ఇవ్వడంతో దిగొచ్చిన వీసీ హాలీడేస్​ ప్రకటన వాపస్​ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాలతో రోజంతా యూనివర్సిటీ లో హైడ్రామా నడిచింది.

వీసీ వింత పోకడ..

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీ తీరు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. ఆయన్ను కట్టడి చేయడానికి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్​నవీన్​మిట్టల్, కార్యదర్శి వాకాటి కరుణ నేతృత్వంలో ఈసీ సభ్యులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చెక్​పవర్​రద్దు చేశారు. ఏసీబీ విచారణకు లేఖలు రాశారు. వీసీగా రవీందర్​ బాధ్యతలు తీసుకున్న ఈ రెండేళ్లలో చేసిన ప్రతీ పైసా ఖర్చుపై త్రీమెన్​ కమిటీ విచారణ నడుస్తోంది. రికార్డులన్నీ  క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అయితే తనకు వ్యతిరేకంగా జరుగుతున్న విచారణను ఆపడానికి వీసీ రెండు రోజులకో నిర్ణయం తీసుకుంటూ గందరగోళం సృష్టిస్తున్నారు.   

హాస్టళ్లకు​ సెలవులు రద్దు

వర్సిటీలోని మూడు హాస్టళ్లలో సుమారు 1300 మంది స్టూడెంట్స్ ​ఉంటారు. మే నెల మొత్తం హాస్టళ్లకు హాలీడేస్ ​ప్రకటించగా, వారు అంతకు ముందే వెళ్లిపోయారు. తర్వాత క్రమంగా ఈసీ సభ్యుల మీటింగ్ లు జరుగుతున్నాయి. టీయూలో సౌకర్యాలపై చర్చ జరగాలన్న ఉద్ధేశంతో వీసీ స్వయంగా సెలవులను కుదించి, మే 18 నుంచి హాస్టళ్లను ప్రారంభించారు. కాంపిటేటివ్​ ఎగ్జామ్స్​కు ప్రిపేరయ్యే వారికోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వీసీ అప్పట్లో ప్రకటించారు.

రిపేర్లంటూ సర్క్యూలర్​

రీస్టార్ట్​అయిన హాస్టళ్లకు రిపేర్లు అవసరమని, జూన్​ 9 వరకు క్లోజ్​ చేస్తున్నట్లు గురువారం వీసీ ఉత్తర్వులు జారీ చేశారు. సెలవులు ఉన్నప్పుడు చేయాల్సిన రిపేర్లు ఇప్పుడు చేయడమేంటని విద్యార్థులు ఫైర్​ అయ్యారు. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్​ఏర్పాట్లు వర్సిటీ పక్షాన చేయించిన వీసీ రవీందర్, రాత్రికి రూమ్​లు ఖాళీ చేసి వెళ్లాలని హుకుం జారీ చేశారు. మూడు హాస్టళ్లలో ప్రస్తుతం 250 మంది స్టూడెంట్స్​ఉన్నారు. మేము హాస్టళ్లు ఖాళీ చేసేది లేదని, రోడ్లపై వండుకుంటామని వార్నింగ్​ ఇచ్చారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి వచ్చిన తమను వీసీ, ఈసీల మధ్య కిరికిరిలో ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వీసీ సెలవులు  రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

ఎటూ తేలని రిజిస్ట్రార్​ పంచాయితీ..

రిజిస్ట్రార్​అపాయింట్​మెంట్​పంచాయితీ ఇంకా తెగడం లేదు. గత నెల విద్యావర్ధినిని ఆ బాధ్యతల నుంచి ఈసీ తొలగించాక, వీసీ లెటర్​తో నిర్మలాదేవి వచ్చారు. ఆమె వెళ్లిపోయాక ఈసీ సభ్యులు యాదగిరిని నియమించారు.  ప్రతిగా వీసీ రవీందర్​ తరఫున కనకయ్య ఛార్జ్​ తీసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు రిజిస్ట్రార్లు వర్సిటీకి ఉన్నా ఎవరూ ఆఫీసుకు రావడంలేదు.