హసన్పర్తి, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ బ్రాండ్ ఇమేజ్ పెంచుదామని వీసీ కే.ప్రతాప్ రెడ్డి అన్నారు. మంగళవారం యూనివర్సిటీ సెనెట్ హాల్ లో రిజిస్ట్రార్ వి.రామచంద్రం అధ్యక్షతన రెగ్యులర్ అధ్యాపకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడేండ్లుగా రావలసిన రూ.31 కోట్లకు సంబంధించిన బడ్జెట్ ఆర్డర్ వచ్చిందని తెలిపారు. హైదరాబాద్ లో రుసా అధికారులతో జరిగే సమావేశంలో రుసా నిధులు ఫైనల్ అవుతాయన్నారు. దానితో విశ్వవిద్యాలయంలో పరిశోధన వేగవంతం అవుతుందన్నారు.
న్యాక్ ఏడబుల్ ప్లస్ యూనివర్సిటీగా తీర్చి దిద్దుదామన్నారు. అకాడమిక్ వాతావరణం పెంపు దిశగా విభాగాలల్లో సెమినార్లు నిర్వహించాలని, ఇందుకోసం ప్రతి విభాగానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఇటీవల హైదరాబాద్ లో డిటెన్షన్ విధానం పై జరిగిన సమావేశంలో తీర్మానాలు తెలిపారు. గొప్ప యూనివర్సిటీగా కాకతీయ విశ్వవిద్యాలయాన్ని కొనసాగిద్దామన్నారు. పూర్వ విద్యార్థుల సంఘాలను బలోపేతం చేయాలన్నారు. కేవలం ఆర్థిక సహకారమే కాదు, నెట్ వర్కింగ్ బిల్డింగ్ చేద్దామన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.