
వనపర్తి, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వాడే కూరగాయలు, పండ్లు సొంతంగా పెంచుకోడానికి హార్టికల్చర్ మోడల్ ను డెవలప్ చేస్తున్నామని కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. ఆధునిక పరిజ్ఞానంతో కూడిన నైపుణ్యాభివృద్ధితోనే విద్యార్థులు బంగారు భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఎక్క గ్రూప్ ఫౌండేషన్‌తో కలిసి పెద్దమందడి మండలం మోజెర్ల హార్టికల్చర్ కాలేజీలో ఏర్పాటు చేసిన కెరీర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోటీ ప్రపంచంలో నైపుణ్యంతో పాటు పర్సనల్ డెవలప్మెంట్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ప్రతి కాలేజీలో పోటీ పరీక్షలకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిపుణులతో కోచింగ్ ఏర్పాటు చేస్తామన్నారు.
మొక్కల సాంద్రత పెంచితే వేసవిలో తోటలను రక్షించవచ్చని తెలిపారు. జిల్లాలో సమస్యాత్మక భూములు ఎక్కువగా ఉన్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని భూసార పరీక్షలు చేసిన తరువాతే ఉద్యాన పంటలు పెంచుకోవాలన్నారు. హార్టికల్చర్ కాలేజీ ఆధ్వర్యంలో మామిడి, నేరేడు, దానిమ్మ, ఫిగ్, సీతాఫలం అంటు మొక్కలు ఉత్పత్తి చేసి రైతులకు అందిస్తామని తెలిపారు.
తోటల్లో నీటి కుంటల నిర్వహణతో వేసవిలో పంటలను కాపాడుకోవచ్చని చెప్పారు. ఉద్యాన ఆధారిత పరిశ్రమలు, వ్యాపారం చేసే అవకాశం ఉన్న ఉత్పత్తులపై దృష్టి సారించాలని కోరారు. వర్సిటీ రిజిస్ట్రార్ భగవాన్, అసోసియేట్ డీన్ పిడిగం సైదయ్య, ఎస్టేట్ ఆఫీసర్ నాగేశ్వర్ రెడ్డి, అడ్వైజర్ వీరాంజనేయులు, షహనాజ్, పూర్ణిమ మిశ్రా, శ్రీనివాస్, శంకర్ స్వామి, గౌతమి, విద్య, నవ్య శ్వేత, భాస్కర్ పాల్గొన్నారు.