‘ఎక్స్‘ వేదికగా హర్షసాయి బాగోతం బయటపెట్టిన వీసీ సజ్జనార్

‘ఎక్స్‘ వేదికగా హర్షసాయి బాగోతం బయటపెట్టిన వీసీ సజ్జనార్

హైదరాబాద్: కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్న బెట్టింగ్ యాప్స్పై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఉక్కుపాదం మోపారు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు వెదజల్లే కాసులకు కక్కుర్తి పడి ఆ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న ఈ సో కాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్కు కూడా సజ్జనార్ చుక్కలు చూపిస్తున్నారు.

మొన్న వైజాగ్ లోకల్ బాయ్ నాని, నిన్న భయ్యా సన్నీ యాదవ్.. ఇవాళ హర్ష సాయి బెట్టింగ్ ప్రమోషన్స్ బాగోతాన్ని వీసీ సజ్జనార్ ‘ఎక్స్’ వేదికగా బయటపెట్టారు. తప్పు చేస్తుందే కాకుండా నిస్సిగ్గుగా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడాన్ని సమర్థించుకుంటూ హర్ష సాయి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటల వీడియోను సజ్జనార్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.

ALSO READ | కృతజ్ఞత లేకుండా బతకడం వేస్ట్.. బండ్ల గణేష్ కౌంటర్ ఆయనకేనా.. ?

చేస్తున్నదే త‌ప్పు.. అదేదో సంఘ‌సేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండని కలియుగ దాన కర్ణుడిగా చెప్పుకునే హర్ష సాయి బండారాన్ని వీడియోతో సహా సజ్జనార్ బయటపెట్టారు. ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరికైనా స్వచ్ఛందంగా సాయం చేస్తే అభినందించడంలో తప్పు లేదు గానీ ఏం చేసి సంపాదించినా తప్పు లేదనే భావన నుంచి వీళ్లను ఫాలో అయ్యే యువత బయటపడాలని కొందరు నెటిజన్లు సజ్జనార్ పోస్ట్ చేసిన హర్ష సాయి వీడియో కింద కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఆన్​లైన్​ బెట్టింగ్​యాప్​లు కుటుంబాలను బలి తీసుకుంటున్నాయి. కొడుకులు చేసిన అప్పులు తల్లిదండ్రుల ప్రాణాలను బలితీసుకుంటున్న ఘటనలు సర్వసాధారణంగా మారాయి. ఇంట్లో ఒక్కరి వ్యసనం.. మొత్తం కుటుంబం పాలిట శాపంగా మారుతున్నది. మొబైల్​ఫోన్​ఓపెన్​ చేస్తే చాలు..‘‘వన్ ఎక్స్​బెట్, మెగాపరి, మోస్ట్​బెట్, పరిమ్యాచ్, 10 సీఆర్ఐసీ, మెల్​బెట్, మేట్​బెట్, 1ఎక్స్​ బెట్, బీసీ డాట్​ గేమ్​, 22  బెట్​, రాజా బెట్స్​, బెట్​ 365, స్టేక్​ డాట్​ కమ్​, డఫ్పా బెట్” లాంటి వందలాది అఫీషియల్, అన్​అఫీషియల్​ఆన్​లైన్​బెట్టింగ్​యాప్స్​ కనిపిస్తున్నాయి. యూట్యూబ్, సోషల్​మీడియా, వెబ్​సైట్లలో వంద రూపాయలు పెడితే రూ. వెయ్యి ఇస్తామంటూ బెట్టింగ్ యాప్స్​యాడ్స్​దర్శనమిస్తున్నాయి.

ఆన్లైన్​ బెట్టింగుల కోసం ఇంటి పేపర్లు, కార్లు, భూములు వంటి ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకుంటున్నారు. ఎక్కడా డబ్బులు పుట్టకపోతే లోన్​యాప్స్​లో అధిక వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నారు. ఇందులో రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు అప్పులు చేసినోళ్లు కూడా ఉన్నారు. సమయానికి అసలు, కిస్తీలు కట్టకపోవడంతో అప్పులు ఇచ్చినోళ్లు, లోన్ యాప్​ నిర్వాహకుల నుంచి వేధింపులు ఎక్కువవుతున్నాయి. ఇంట్లో వాళ్లకు చెప్తామని, చుట్టుపక్కల వాళ్లకు చెప్తామని, కోర్టులకు లాగుతామని బెదిరిస్తుండడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.