పాలమూరు యూనివర్సిటీలో కొత్త కోర్సులు తీసుకొస్తాం : వీసీ శ్రీనివాస్​

పాలమూరు యూనివర్సిటీలో కొత్త కోర్సులు తీసుకొస్తాం :  వీసీ శ్రీనివాస్​
  • ‘వెలుగు’ ఇంటర్వ్యూలో పీయూ కొత్త వీసీ శ్రీనివాస్​
  • స్టూండెట్లకు మినిమం ఫెసిలిటీస్​ కల్పిస్తాం
  • త్వరలో కొత్త కోర్సులు అందుబాటులోకి తెస్తాం
  • వచ్చే అకడమిక్​ ఇయర్​ నుంచి లా, ఇంజనీరింగ్​ క్లాసెస్​ స్టార్ట్​ చేస్తాం

మహబూబ్​నగర్​ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీ (పీయూ)ని పాలకులు, సిబ్బంది సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని వైస్​ చాన్స్​లర్​ శ్రీనివాస్​ తెలిపారు. పీయూ నూతన వీసీగా బాధ్యతలు తీసుకున్న ఆయనను ‘వెలుగు’ ఇంటర్వ్యూ చేసింది. 

ప్ర : సీఎం సొంత జిల్లాలోని యూనివర్సిటీ కావడం వల్ల ఒత్తిడి ఉందా?

జ : పాలమూరు జిల్లాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సీఎం ఎనుముల రేవంత్​ రెడ్డి సొంత జిల్లా కావడంతో పీయూపై 

ఆయనకు ప్రత్యేక శ్రద్ధ ఉంది. వర్సిటీని మరింత డెవలప్​ చేయాలనే ఉద్దేశంతోనే లా, ఇంజనీరింగ్​ కాలేజీలకు పర్మిషన్​లు వచ్చాయి. రాష్ట్ర సర్కారు కూడా పీయూ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంది.

ప్ర : ప్రస్తుతం మీ ముందున్న టాస్క్?

జ : నేను ఎలాంటి టాస్క్​లు నిర్దేశించుకోలేదు. నా లక్ష్యం వర్సిటీలో స్టూడెంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడమే. హాస్టల్, మెస్​కు సరిపడా బిల్డింగ్స్​ను అందుబాటులోకి తెస్తాం. స్టూడెంట్లకు కావాల్సిన మినిమం ఫెసిలిటీస్​ కల్పిస్తాం. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా నిర్వహిస్తాం. పీయూను అన్నిరంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం.

ప్ర : పీయూ డెవలప్​మెంట్​కు మీరు తీసుకునే యాక్షన్?

జ : ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులతో వర్సిటీ డెవలప్​మెంట్​ పనులు చేపడతాం. ఇంకా అవసరమయ్యే నిధుల కోసం ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేల సహకారం తీసుకుంటా.

ప్ర : లా, ఇంజనీరింగ్​ కాలేజీలకు స్థలం ఉందా?

జ : పీయూ దాదాపు 170 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇప్పటికే దాదాపు 24 ఎకరాల్లో ఔషధ మొక్కల గార్డెన్​లు ఉన్నాయి. లా, ఇంజనీరింగ్​ కాలేజీల బిల్డింగులకు స్థలాన్ని పరిశీలిస్తాం. అవసరమైతే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టి అదనంగా ల్యాండ్​ అలాట్​ చేయమని కోరతాం.

ప్ర :  ఈ కాలేజీలు ఎప్పటి నుంచి స్టార్ట్​ అవుతాయి?

జ : లా, ఇంజనీరింగ్​ కాలేజీల ఏర్పాటుకు గ్రీన్​ సిగ్నల్​ వచ్చింది. వచ్చే అకడమిక్​ ఇయర్​ వరకు బిల్డింగ్​ను పూర్తి చేస్తాం. అదే ఏడాది నుంచి తరగతులను ప్రారంభిస్తాం.

ప్ర : కొత్త కోర్సులు ఉంటాయా?

జ : గతేడాది రెండు కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. వచ్చే అకడమిక్​ ఇయర్​లో ఏమైనా కొత్త కోర్సులు తీసుకురావాలా? అనే దానిపై మీటింగ్​ పెట్టుకుంటాం. ఉన్న కోర్సులను రివైజ్​ కూడా చేస్తాం. కొత్త కోర్సులను ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు కూడా చేస్తాం.

ప్ర : కాంట్రాక్ట్​ లెక్చరర్ల​ పరిస్థితి ఏంటి? నాన్​ టీచింగ్​ సిబ్బంది కాంట్రాక్ట్​ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్​ చేస్తున్నారు? దీనిపై మీ కామెంట్?

జ : కాంట్రాక్ట్​ లెక్చరర్లను రెగ్యులరైజ్​ చేయాలని కొంత కాలంగా అడుగుతున్నారు. ఇష్యూ నా దృష్టికి వస్తే.. వాళ్లను రెగ్యులరైజ్​ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతా. నాన్  టీచింగ్ ఉద్యోగుల సమస్యలు తెలుసుకొని వీసీ పరిధిలో ఉంటే పరిష్కరిస్తాం. మా పరిధి దాటి ఉంటే గవర్నమెంట్​ అప్రూవల్ తీసుకొని సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తా.

ప్ర : పీయూకు రూ.వంద కోట్ల ఫండ్స్​ వచ్చాయి. ఆ ఫండ్స్​ దేనికి ఖర్చు చేస్తున్నారు?

జ : కొన్ని వర్సిటీలకు ఇటీవల సెంట్రల్​ నుంచి రూ.వంద కోట్లు వచ్చాయి. అందులో పాలమూరుకు కూడా ఈ ఫండ్స్​ కేటాయించారు. ఇప్పటికే చేయాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రపోజల్స్​ రెడీ చేసి ప్రభుత్వానికి పంపారు. దాని ప్రకారమే నిధులు విడుదల చేస్తారు. అందులో ఎలాంటి మార్పు ఉండదు. 

ప్ర : స్టూడెంట్లకు మీరిచ్చే సలహా?

జ :  సీఎం సహాయ సహకారాలతో పీయూలో అన్ని ఫెసిలిటీస్​ కల్పిస్తాం. స్టూడెంట్లు కూడా వాటిని యుటిలైజ్​ చేసుకోవాలి. హాస్టళ్లు, లైబ్రరీలను వినియోగించుకోవాలి. రానున్న రెండేళ్లల్లో స్టూడెంట్లు ఉన్నతంగా ఎదగాలి.