- పంచాయతీ జాగాలు అమ్మేందుకు యత్నించడంతో అడ్డుకున్నందుకు శిక్ష
- వారికి గ్రామస్తులెవరూ సహకరించొద్దని హుకుం జారీ
- పోలీసులను ఆశ్రయించిన బాధిత కుటుంబాలు
- నిజామాబాద్ జిల్లాలోని పోచంపల్లిలో ఉద్రిక్తత
నిజామాబాద్(బాల్కొండ), వెలుగు: నిజామాబాద్జిల్లాలో వీడీసీ మరో దారుణం ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాల్కొండ సెగ్మెంట్లోని వేల్పూర్ మండలం పోచంపల్లిలో పంచాయతీ భూమిని అమ్మేందుకు వీడీసీ పెద్దలు బయానా తీసుకోగా.. దాన్ని తప్పుపడుతూ అడ్డుపడిన ఆయా కుటుంబాలకు సంఘ బహిష్కరణ శిక్ష వేశారు. వారికి ఎలాంటి సహకారం అందించొద్దని హుకుం జారీ చేశారు. వారం కింద జరిగిన ఘటన జిల్లాలో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. పోచంపల్లి పంచాయతీలో మూడు చోట్ల 100, 90, 120 చదరపు గజాల చొప్పున ఖాళీ జాగాలు ఉన్నాయి.
గతంలో ఇండ్ల స్థలాలుగా చేసిన సమయంలో వీటిని కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం తీసుకొని వదిలేశారు. ఆ ఖాళీ జాగాల పక్కన ఉండే ఇంటి ఓనర్లకు వీటిని గజానికి రూ.4,500 నుంచి రూ.4,900 చొప్పున అమ్మడానికి నిర్ణయించి వీడీసీ పెద్దలు బయానా తీసుకున్నారు. ఇది తెలిసిన ఎనిమిది కుటుంబాలు తప్పుబట్టి పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీవోకు ఫిర్యాదు చేశాయి. దీంతో వీడీసీ పెద్దలు ఆగ్రహం చెందారు. పంచాయతీ పెట్టి రూ.3 లక్షల జరిమానా, మీటింగ్ఖర్చుగా మరో రూ.26 వేలు కట్టాలని ఆర్డర్ జారీ చేశారు.
వీడీసీ నిర్ణయాన్ని పాటించమని చెప్పడంతో ఆదివారం ఆయా కుటుంబాలను బహిష్కరించాయి. గ్రామస్తులు ఎవరూ మాట్లాడొద్దని, వారి పొలం పనులకు వెళ్లొద్దని డప్పు చాటింపు వేయించారు. తమ ఆదేశాలు పాటించని వ్యక్తులకు రూ.5 వేల జరిమానా విధిస్తామని వార్నింగ్ఇచ్చారు. దీంతో బాధిత కుటుంబాలు వేల్పూర్పోలీసులకు ఫిర్యాదు చేశాయి. వీడీసీ ప్రెసిడెంట్జంగిలి ముత్యం, సభ్యులు చింతలపల్లి గంగారెడ్డి, హలాల్ రమేశ్, ఆరె చిన్నయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సంజీవ్తెలిపారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.