న్యూఢిల్లీ: వేదాంత, ఫాక్స్‌కాన్‌ల జాయింట్ వెంచర్ (జేవీ) ఇండియాలో ఏర్పాటు చేస్తున్న సెమీకండక్టర్ల ప్లాంట్ 2026–27 నుంచే రెవెన్యూ జనరేట్ చేస్తుందని ఈ జేవీ సీఈఓ డేవిడ్ రీడ్ , ఎండీ ఆకర్ష్ హెబ్బర్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరిలో ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అన్నారు. జేవీలో ఇరు కంపెనీల వాటాల విషయంలో ఎటువంటి మార్పు ఉండదని వివరించారు. రూ.1.64 లక్షల కోట్ల ను ఈ ప్లాంట్ కోసం ఇన్వెస్ట్ చేయనుండగా, ప్రభుత్వ అనుమతుల కోసం వేదాంత – ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్ ఎదురుచూస్తోంది.
‘గుజరాత్‌లో ల్యాండ్ గుర్తించాం. రానున్న కొన్ని వారాల్లో అనుమతులొస్తాయని మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. అదే జరిగితే ఎక్విప్‌మెంట్ కోసం ఆర్డర్లిస్తాం. ఇవి వచ్చేటప్పటికి ఏడాదిన్నర వరకు టైమ్ పడుతుంది. మరోవైపు జపాన్, కొరియాలోని కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నాం. దేశంలోకి సెమీకండక్టర్లు, డిస్‌ప్లే యూనిట్లు వస్తే ఈ ఎకోసిస్టమ్ 80 బిలియన్ డాలర్ల రెవెన్యూని జనరేట్ చేయగలదు’ అని ఆకర్ష్ అన్నారు.