ఫియర్ మూవీ రివ్యూ.. వేదిక సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

ఫియర్ మూవీ రివ్యూ.. వేదిక సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

వేదిక లీడ్ రోల్‌లో వచ్చిన సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫియర్’. అరవింద్ కృష్ణ కీలకపాత్ర పోషించాడు. డా.హరిత గోగినేని దర్శకత్వం వహించారు. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించారు. టీజర్, ట్రైలర్‌‌ ఆకట్టుకోవడంతో పాటు, పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో 7‌‌0కి పైగా అవార్డులను అందుకోవడంతో సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. డిసెంబర్ 14న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకూ ఎంగేజ్ చేసిందో రివ్యూలో చూద్దాం. 

కథ:
సింధు, ఇందు (వేదిక) అనే కవలల చుట్టూ తిరిగే కథ ఇది. మెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సింధుతో కథ మొదలవుతుంది. ఆమెకు తన అక్క ఇందు అంటే చాలా ఇష్టం. అలాగే తన క్లాస్‌మేట్ సంపత్‌ను ఎంతగానో ప్రేమిస్తుంటుంది. అతనితో తన అక్క మాట్లాడినా కూడా చూసి తట్టుకోలేదు. అయితే చిన్నప్పటి నుంచి ఆమెను కొన్ని భయాలు వెంటాడుతుంటాయి. ఎవరికీ కనిపించని ఓ ముసుగు బూచోడు సింధుకు మాత్రమే కనిపిస్తూ తనను వెంటాడుతుంటాడు. అతని నుంచి తప్పించుకునేందుకు ఆమె అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. తన అక్క కూడా ఆమెను దూరం పెడుతుంది. తన  ఫ్రెండ్ మాత్రమే అర్థం చేసుకుంటుంది. అలా పెరిగి పెద్దయిన సింధు.. తను ప్రేమించిన  సంపత్ (అరవింద్ కృష్ణ) ఫ్యామిలీతోనే ఉంటుంది. అయితే జాబ్ వర్క్‌పై బయటకు వెళ్లిన సంపత్ కనిపించకుండా పోతాడు. అలాగే తన అక్కతో గొడవలు, తల్లిదండ్రులకు దూరంగా ఉండడం కూడా ఆమెను కుంగదీస్తాయి. దీంతో ఆమె ఒంటిరిగా ఫీలవుతూ, మానసికంగా మరింత డిస్టర్బ్ అవుతుంది. సీన్ కట్ చేస్తే.. ఆమె మెంటల్ ఆసుపత్రిలో ఉంటుంది. ఇంతకూ ఆసుపత్రికి ఆమె ఎలా వచ్చింది.. ఆమెను వెంబడిస్తోంది ఎవరు, సంపత్ ఏమయ్యాడు, తన ఈ పరిస్థితికి కారణం ఎవరు అనేది మిగిలిన కథ. 

Also Read : జైలు నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ ని చూడగానే ఏడ్చేసిన భార్య స్నేహ రెడ్డి..

ఎవరెలా నటించారంటే.?
లీడ్‌ రోల్‌ చేసిన వేదిక రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో వేరియేషన్స్ చూపిస్తూ కట్టిపడేసింది. భయం, బాధ, ఈర్శ్య, కోపం, ఆనందం లాంటి భావోద్వేగాలను అద్భుతంగా పండించింది. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసింది. ఆమెకు తల్లిదండ్రులుగా పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ పాత్రల పరిధి మేరకు నటించారు. సినిమాకు ఎంతో కీలకమైన సంపత్ పాత్రలో అరవింద్ కృష్ణ నటన ఆకట్టుకుంది. షాయాజీ షిండే, సత్య కృష్ణ, అనీష్ కురువిల్ల, సాహితి దాసరి, షాని ఇతర పాత్రల్లో కనిపించారు. ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ, అనూప్ రూబెన్స్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఎడిటింగ్‌ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్‌ మెరుగ్గా ఉన్నాయి. 

ఎలా ఉందంటే..? 
టైటిల్‌ను బట్టి ఇదొక హారర్ సినిమా అనుకోవడం కామన్. కానీ ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. ఇలాంటి సినిమాలు మన దగ్గర రావడం, వచ్చినా మెప్పించడం అరుదు. ప్రేక్షకుల అంచనాలకు అందని కథ, కథనాలతో మెప్పిస్తేనే ఈ తరహా చిత్రాలకు విజయం దక్కుతుంది. మహిళా దర్శకులు ఎక్కువగా లవ్ స్టోరీస్ లేదా ఫ్యామిలీ స్టోరీస్‌తో పరిచయం అవుతుంటారు. కానీ హరిత గోగినేని ఇలాంటి ఓ సైకలాజికల్ థ్రిల్లర్‌‌ను ఎంచుకున్నారు. ఆమె ఎంచుకున్న స్టోరీ లైన్, కాన్సెప్ట్ యూనిక్‌గా ఉన్నాయి. ప్రారంభంలో కన్ఫ్యూజింగ్‌గా మొదలైన ఈ కథ.. క్లైమాక్స్‌కు చేరేటప్పటికీ ఆలోచింపజేసేలా సాగింది. హీరోయిన్ తన ఫ్యామిలీతో కలిసి ఉండగా బాయ్ ఫ్రెండ్ దూరమవడం,  మరోవైపు మెంటల్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్, ఇంకోవైపు తనను ఎవరో వెంబడిస్తున్నారనే భయం నేపథ్యంలో వచ్చే సీన్స్ ఆసక్తితో పాటు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఫస్ట్ హాఫ్ సాగింది. లీడ్ రోల్‌కు సంబంధించి మూడు వయసుల్లో జరిగిన పరిణామాలను డిటైయిల్డ్‌గా చెప్పే ప్రయత్నం  చేశారు. తన లైఫ్‌లో ఏదో జరిగిందనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిగించడంలో జాగ్రత్త పడ్డారు. సెకండాఫ్‌లో సింధు అలా మారడానికి దారితీసిన పరిస్థితులు ఆలోచించేలా చేస్తాయి. ఆమె అలా ప్రవర్తించడానికి కారణం ఏమిటి.. ఎవరికీ కనిపించని వ్యక్తులు తనకే ఎందుకు కనిపిస్తున్నారు, ఆమె జీవితంలో అసలు ఏం జరిగింది అనే సస్పెన్స్‌ను చివరి వరకూ  సస్టేన్‌ చేయగలిగారు. అలాగే ట్విస్టులు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. దర్శకురాలు తాను అనుకున్న కథను తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యారు. 
 
రైటర్‌‌గా యూనిక్ స్టోరీలైన్‌ను ఎంచుకున్న ఆమె... ఆ కథను తెరపైకి తీసుకురావడంలో మాత్రం డైరెక్టర్‌‌గా కాస్త తడబడ్డారు.  ఎంగేజింగ్ సీన్స్, థ్రిల్లింగ్ విజువల్స్ ఉన్నప్పటికీ... స్లో నెరేషన్, రిపీట్ సీన్స్ కారణంగా కొన్ని చోట్ల బోరింగ్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ తరహా జానర్ సినిమాలకు మరింత గ్రిప్పింగ్‌, ఎంగేజింగ్‌గా కథను నడిపించడం అవసరం.  వీటితో పాటు స్క్రీన్‌ ప్లే విషయంలో ఇంకాస్త ఫోకస్ చేయాల్సింది. ఏదేమైనా ఒక కొత్త డైరెక్టర్ ఓ సీరియస్ విషయాన్ని ఇలాంటి ఓ థ్రిల్లర్ ద్వారా  చెప్పాలనుకోవడం అభినందనీయం. ప్రస్తుత పోటీ ప్రపంచం, ఉరుకులు పరుగుల జీవితంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి కేర్ తీసుకోవాలి, లేదంటే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని ఆలోచింపజేసేలా చూపించారు.