ఉష్ణగుండాలలో శ్రీఅష్టలక్ష్మి యాగం

ఉష్ణగుండాలలో శ్రీఅష్టలక్ష్మి యాగం
  • వేదోక్తంగా అగ్నిమధనం

భద్రాచలం, వెలుగు : భద్రాచలం శివారున విలీన ఆంధ్ర ఎటపాక మండలం ఉష్ణగుండాల గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీఅష్టలక్ష్మి యాగంలో భాగంగా శుక్రవారం అగ్నిమధన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. వివిధ పుణ్యక్షేత్రాల నుంచి వచ్చిన రుత్విక్కులు తొలుత విశ్వక్షేనారాధన, పుణ్యాహవచనం చేశారు. తర్వాత అరణి (చెక్క) తీసుకుని వేదమంత్రాల నడుమ అగ్ని మధనం చేశారు. ప్రజ్వరిల్లిన అగ్ని దేవుని ఆయా హోమ గుండాలలోప్రతిష్ఠించారు. అమ్మవారి మూలమంత్రం హవనం, భక్తులతో కృష్ణాష్టకం పఠనం జరిపించారు. 

30 పాశురాల తిరుప్పావై సేవాకాలం, విన్నపాలు జరిగాయి. అగ్ని ప్రతిష్ఠ వైభవాన్ని అష్టలక్ష్మీ పీఠాధిపతి పీతాంబరం రఘునాథాచార్యులు వివరించారు. పూర్ణాహుతి, తీర్థగోష్టి నిర్వహించారు. సాయంత్రం యాగశాల ఆరాధనల్లో భాగంగా సామూహిక విష్ణుసహస్ర నామ పారాయణం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.