తెలంగాణకు చల్మన్న స్ఫూర్తి మరువలేనిది

వెదిరె చల్మారెడ్డి తెలంగాణ ఉద్యమకారుల్లో మర్చిపోలేని పేరది. ఆయనను అందరూ చల్మన్నా అని ప్రేమతో పిలిచేవారు.  శుక్రవారం తెల్లవారుజామున  చల్మన్న  ఈ లోకం విడిచి వెళ్లిపోయారనే వార్త వినగానే.. మిత్రులందరూ షాక్​ అయ్యారు. ‘తెలంగాణ సోషల్​ మీడియా ఫోరం’ మిత్రులంతా ఒకరికొకరు ఈ సమాచారం చేరవేశారు.  ఎవరూ నమ్మలేకపోయారు. చల్మన్న అందరినీ వదిలి వెళ్లిపోవడం ఎవరూ జీర్ణించుకోలేకపోయారు.  ఆయనలో ఇమిడిపోయిన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తెలియని మిత్రులు ఉండరు. మొదట్లో ఆయన వామపక్షభావం కలిగిన వ్యక్తి. తెలంగాణ మలిదశ ఉద్యమ కాలమంతా తెలంగాణే తన భావజాలంగా మార్చుకొన్న అరుదైన వ్యక్తి. ఉద్యమకాలంలో రంగారెడ్డి జిల్లా పొలిటికల్​ జేఏసీ కన్వీనర్​గా పనిచేశారు. 

తెలంగాణ వచ్చింది ప్రజల కోసమా, పాలకుల కోసమా అని బాధపడ్డారు. తెలంగాణ వచ్చాక కూడా నెరవేరని ఉద్యమ ఆకాంక్షలపై తన ఆవేదనను నిరంతరం వ్యక్తపరుస్తూ వచ్చారు. తెలంగాణకు మరో తృతీయ ఉద్యమం అనివార్యమని చల్మన్న చెప్పేవారు. ఆయన ఆశించిన రాజకీయాలు లేవని బాధపడేవారు. నాయకులు ఎదిగారు తప్ప తెలంగాణ ఎదగ లేదని ఆవేదన చెందేవారు. చల్మన్న వ్యక్తిత్వంలో ముక్కుసూటి తనం తప్ప కల్మషం ఉండేది కాదు.  భోళా మనిషి, అందరి మనిషి, నేటి రాజకీయాలను చూసి మాత్రం ఆవేశానికి గురయ్యేవాడు. వచ్చిన తెలంగాణ ఏమైతున్నదనే ఆవేదనే ఆయనలో ఎప్పుడూ కనిపించింది, వినిపించింది. వచ్చిన తెలంగాణను ‘సఫల తెలంగాణ’గా మార్చడంలో మనం చేసే కృషే 
చల్మన్నకు అసలైన నివాళి అవుతుంది.

-  తెలంగాణ సోషల్​ మీడియా ఫోరం