- మేడిగడ్డ వద్ద కట్టాలన్న ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం: వెదిరె శ్రీరామ్
- తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల లభ్యత ఉందని సీడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చింది
- అయినా నీటి లభ్యత లేదని చెప్పిందంటూ ప్రాజెక్టు సైటు మార్చారు
- 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర ఒప్పుకోలేదన్నది సాకు మాత్రమే
- మేడిగడ్డ డిజైన్లు సీడీవో ఇచ్చింది.. సీడబ్ల్యూసీకి సంబంధం లేదు
- బ్యారేజీల నిర్మాణ సమయంలో డిజైన్లను మార్చారు
- టెస్టులు చేసిన చోట కాకుండా కొత్త లొకేషన్లో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు
- తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ కోసం కట్టిన నిర్మాణాలు వాడలే.. దీంతో 11,912 కోట్లు వృథా
- కాళేశ్వరం కమిషన్ ముందు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
హైదరాబాద్, వెలుగు:తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టేందుకు కావాల్సిన నీటి లభ్యత ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) స్పష్టంగా చెప్పిందని, 165 టీఎంసీలు అక్కడ అందుబాటులో ఉన్నాయని సీడబ్ల్యూసీ లెక్కగట్టిందని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం చెప్పారు. అక్కడ వాటర్ అందుబాటులో లేదంటూ సీడబ్ల్యూసీ చెప్పిందన్న బీఆర్ఎస్ సర్కార్ వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని స్పష్టం చేశారు.
ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో గత ప్రభుత్వం నెపాన్ని సీడబ్ల్యూసీ మీదకు నెట్టేసిందని అన్నారు. 75 శాతం డిపెండబిలిటీతో తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల లభ్యత ఉందంటూ సీడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు. కానీ, వాటిని నాటి కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదని పేర్కొన్నారు. మంగళవారం కాళేశ్వరం జుడీషియల్ కమిషన్ ముందు ఆయన విచారణకు హాజరయ్యారు. ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్‌కు డిటెయిల్డ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
ఆ వివరాలను ఆయన వెల్లడించారు. 1975, 1983, 1984, 2003, 2004, 2010లలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వివిధ ఆర్డర్లలో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగానే నీటి లభ్యతను లెక్కించాల్సి ఉంటుందన్నారు. దానికి అనుగుణంగానే ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ క్లియరెన్స్ ఇస్తుందని చెప్పారు. తాము చేసిన వివిధ స్టడీల్లో అక్కడ 165 టీఎంసీల జలాల లభ్యత ఉందని తేలిందని 2015 ఫిబ్రవరి 26న లేఖ రాసిందని గుర్తు చేశారు. అంతేగాకుండా ఎగువ రాష్ట్రాల్లో 63 టీఎంసీల మిగులు జలాలు కూడా ఉంటాయని స్పష్టం చేసిందన్నారు.
అయితే, అవి భవిష్యత్‌లో కూడా ఉంటాయన్న గ్యారంటీ లేదని, ప్రాణహిత బ్యారేజీ సైట్ వద్ద ఎంత మొత్తంలో నీటిని డైవర్ట్ చేసుకోవచ్చో రివ్యూ చేసుకోవాల్సిందిగా సూచించిందన్నారు. ఎగువ రాష్ట్రాలు తమ వాటాకు మించి వాడుకునేందుకు అవకాశం లేదని, కానీ, ప్లాన్డ్ యుటిలైజేషన్ కింద వాడుకునేందుకు వీలుందన్న వ్యాప్కోస్ సంస్థ అంచనాలకు చట్టబద్ధత ఉండదని చెప్పారు. అదో కమర్షియల్ సంస్థ మాత్రమేనన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తమ హక్కులను కాపాడుకునేందుకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే సీడబ్ల్యూసీ ఈ సూచన చేసిందని ఆయన చెప్పారు. కాషన్ కోసం చెప్పిన విషయాన్ని గత సర్కారు రాద్ధాంతం చేసిందని, దాన్ని భూతద్దంలో చూపించి ప్రాజెక్ట్ సైట్‌ను మార్చిందని చెప్పారు. తద్వారా రాష్ట్ర ఖజానాపై 80 వేల కోట్ల భారాన్ని వేసిందని ఆయన తెలిపారు.
ప్రాజెక్టు డిజైన్లకు సీడబ్ల్యూసీ బాధ్యత కాదు
ప్రాజెక్టు డిజైన్లకు సీడబ్ల్యూసీకి ఎలాంటి సంబంధం ఉండదని వెదిరె శ్రీరామ్ స్పష్టం చేశారు. ఏదైనా రాష్ట్రంలో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) ఉంటే.. సదరు సీడీవోనే ప్రాజెక్టు డిజైన్లను ప్రిపేర్ చేస్తుందని, దానికి అండర్ టేకింగ్ సర్టిఫికెట్ ఇష్యూ చేస్తుందని స్పష్టం చేశారు. సర్వే, ఇన్వెస్టిగేషన్, డిజైన్, మోడలింగ్ వంటి వాటిని సీడీవోనే చేస్తుందన్నారు. డీపీఆర్ అప్రైజల్ ప్రాసెస్‌లోనే సీడీవో నుంచి కాళేశ్వరం డిజైన్లపై అండర్ టేకింగ్ సర్టిఫికెట్‌ను సబ్మిట్ చేసిందన్నారు.
అలాంటప్పుడు సీడబ్ల్యూసీకి డిజైన్లతో ఎలాంటి సంబంధమూ ఉండబోదన్నారు. దానికి సంబంధించిన ఆ సర్టిఫికెట్‌ను సీడీవో ఇచ్చిందంటూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ స్పష్టం చేసిందని, డిజైన్లతో సీడబ్ల్యూసీకి సంబంధం లేదని అడ్వైజరీ కమిటీ పేర్కొందని గుర్తు చేశారు.
అన్నారం, సుందిళ్లను మార్చారు
ఇన్వెస్టిగేషన్లు చేసి డీపీఆర్‌లు సబ్మిట్ చేశాక.. ముందు నిర్ణయించిన చోట కాకుండా వేరే చోటుకు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాన్ని తరలించారని వెదిరె శ్రీరాం చెప్పారు. కొత్త లొకేషన్లో జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లు చేయనేలేదని కమిషన్‌కు వివరించారు. లొకేషన్ మారిస్తే దానికి తగ్గట్టు టెస్టులు చేసి డిజైన్లు, డీపీఆర్లనూ మార్చాల్సి ఉంటుందని, కానీ, గత ప్రభుత్వం వాటిని విస్మరించిందని చెప్పుకొచ్చారు. ప్రాజెక్ట్ కోసం డీపీఆర్‌లో షీట్‌పైల్స్‌ను సజెస్ట్ చేశారని, కానీ, ఆ తర్వాత సీకెంట్ పైల్స్‌కు మార్చారని గుర్తు చేశారు. బ్యారేజీల ప్రాంతాల్లో షీట్‌పైల్స్ ఎందుకు పనిచేయవన్న విషయంపై సరైన వివరణ ఇవ్వలేదన్నారు. బ్యారేజీల నిర్మాణ సమయంలో సీడీవో బ్యారేజీలను పరిశీలించ లేదన్నారు.
ముంపు సాకు కాదు..
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడితే కొన్నాళ్ల పాటే వరద ఉంటుందంటూ నాటి తెలంగాణ ప్రభుత్వం పేర్కొందని, వర్షాకాలం తర్వాత అక్కడ ఫ్లడ్ ఉండకపోగా సరిపోను స్టోరేజీ కెపాసిటీ ఉండదంటూ చెప్పుకొచ్చిందని వెదిరె శ్రీరామ్ అన్నారు. ‘‘ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లను సబ్మిట్ చేసినప్పుడు సీడబ్ల్యూసీ అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకుంటుంది. అందులో భాగంగా స్టోరేజీ కెపాసిటీ గురించి కూడా అడుగుతుంది.
దానిని కూడా గత ప్రభుత్వం తప్పుగా అర్థం చేసుకుంది. కేవలం ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించేందుకు దానిని గత సర్కారు వాడుకుంది’’ అని పేర్కొన్నారు. మహారాష్ట్ర ఒప్పుకోలేదంటూ గత సర్కారు మరో సాకు చెప్పిందని వెదిరె శ్రీరాం అన్నారు. ‘‘ఏదైనా ప్రాజెక్టు కట్టేటప్పుడు ముంపు సహజం. తుమ్మిడిహెట్టి విషయంలోనూ అదే జరిగింది. 152 మీటర్ల ఎత్తుతో కడితే 4312 ఎకరాలు ముంపుకు గురవుతున్నాయని తెలంగాణ వాదించింది.
అందులో 85 శాతం (3600 ఎకరాలు) మహారాష్ట్రలోనే ఉన్నాయంది. దీంతో ఆ ఎత్తున ప్రాజెక్టును నిర్మించేందుకు మహారాష్ట్ర అంగీకరించలేదని వాదించింది. అయితే, ఇంటర్ స్టేట్ ప్రాజెక్టులకు సంబంధించి ఇలాంటివి ఎన్నో జరిగాయి. భాక్రానంగల్, తుంగభద్ర, బియాస్, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్, గండక్ సహా చాలా ఇంటర్‌స్టేట్ ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగానే భూములు ముంపునకు గురయ్యాయి. ఆయా రాష్ట్రాలు పరస్పరం చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకున్నాయి.
ఇక్కడ తుమ్మిడిహెట్టి విషయంలోనూ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో తెలంగాణ చొరవ తీసుకుని చర్చించి ఉంటే సమస్య పరిష్కారమయ్యేది. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి కేంద్రం ప్రయత్నించినా గత సర్కారు వినిపించుకోలేదు’’ అని ఆయన చెప్పారు.
రూ.11,917 కోట్లు వృథా చేశారు
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం ఉమ్మడి ఏపీలో నాటి సర్కారు రూ.11,917 కోట్లతో ప్రాజెక్టులోని పలు పనులను పూర్తి చేసిందని, వివిధ మౌలిక సదుపాయాలను కల్పించిందని వెదిరె శ్రీరామ్ గుర్తు చేశారు. కానీ, గత సర్కార్ మాత్రం దానిని వినియోగించుకోకుండా ఆ డబ్బులను వృథా చేసిందని ఆక్షేపించారు. ‘‘అంత డబ్బు పెట్టి సృష్టించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వాడుకోకుండా డబ్బును వృథా చేసింది.
తద్వారా రాష్ట్ర ఖజానాపై మరింత భారం పడేలా చేసింది. ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసింది. బాధ్యతారహితంగా వ్యవహరించింది’’ అని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో ఆయన పేర్కొన్నారు.
ఇంజనీర్లను వాళ్ల పనులు చేయనివ్వలే..
గత ప్రభుత్వం ఇంజనీర్లను వాళ్ల పనుల్ని వాళ్లను చేసుకోనివ్వలేదని వెదిరె శ్రీరామ్ చెప్పారు. ‘‘ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలన్న దానిపైనే గత ప్రభుత్వం దృష్టి పెట్టిందే తప్ప.. క్వాలిటీపై దృష్టి పెట్టలేదు. ఇంజనీర్లను వారి పనులను చేసుకోనివ్వలేదు. ప్లానింగ్, ఇన్వెస్టిగేషన్, డీపీఆర్ ప్రిపరేషన్, మోడలింగ్, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, క్వాలిటీ అష్యూరెన్స్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌లో ఏ ఒక్కటీ సరిగ్గా జరగలేదు. సరైన ఇన్వెస్టిగేషన్స్ చేయలేదు.
ప్లానింగ్, ఇన్వెస్టిగేషన్స్ విషయంలో అధికారులకు గత ప్రభుత్వం సరైన సమయం ఇవ్వలేదు. దీంతో ప్రాజెక్ట్ డిజైన్లు సరిగ్గా రాలేదు. డిజైన్ల విషయంలో సీడీవోకు కూడా కావాల్సినంత సమయం ఇవ్వలేదు. కేవలం నాలుగు నెలల టైమే ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్స్‌లో భాగంగా చాలా చోట్ల నేలకు టెస్టుల చేయాల్సి ఉంటుంది. ఆ టెస్టులు పూర్తయ్యి డిజైన్లు చేయడానికి ఎనిమిది నెలల నుంచి ఏడాది పడుతుంది.
కానీ, అంత సమయమే ఇవ్వలేదు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం జరిగేటప్పుడు కూడా డిజైన్లలో మార్పులు జరిగాయి. బ్యారేజీ మోడలింగ్‌లోనూ స్పష్టమైన లోపాలు కనిపించాయి. 2019లో బ్యారేజీలను ప్రారంభించాక ఓ అండ్ ఎంను పట్టించుకోలేదు’’ అని వివరించారు.