
ఖానాపూర్(ఉట్నూర్), వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం మానుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హితవు పలికారు. అదివారం ఉట్నూర్ లోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇంద్రవెల్లి సభ విజయానికి కృషి చేసిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో భాగంగా ఎన్నో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తే మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ చార్జి జాన్సన్ నాయక్ తోపాటు కొందరు నాయకులు పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పదేండ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని సవాల్ విసిరారు. ఇంద్రవెల్లి స్మృతి వనానికి సీఎం కోటి రూపాయలు కేటాయించి శంకుస్థాపన చేస్తే కొందరు నాయకులు మాత్రం స్తూపం వద్దకు చెప్పులతో వచ్చారని ఆరోపిస్తూ శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టడాన్ని అయన తీవ్రంగా ఖండించారు.
స్తూపం వద్దకు సీఎంతో పాటు మంత్రులెవరూ చెప్పులు వేసుకొని వెళ్లలేదని వెల్లడించారు. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు సాయం చేయడాన్ని కొంతమంది నాయకులు తట్టుకోలేక దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఎంపై ఆరోపణలు చేసేస్థాయి జాన్సన్ నాయక్‌కు లేదని హెచ్చరించారు. వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్, ఉట్నూర్, కడెం, దస్తురాబాద్ మండలాల అధ్యక్షులు దయానంద్, అబ్దుల్ ఖయ్యుం, మల్లేశ్ యాదవ్, దుర్గం మల్లేశ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, పార్టీ ఖానాపూర్ పట్టణ అధ్యక్షుడు నిమ్మల రమేశ్, మాజీ వైస్ ఎంపీపీ తోట సత్యం తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.