
“వీర్ సావర్కర్” అసలు పేరు..వినాయక్ దామోదర్ సావర్కర్”. ఆయన వ్యక్తిత్వం తెలిసిన మిత్రులు ఆయన ధైర్యసాహసాలకు మెచ్చి ఇచ్చిన బిరుదు వీర్. ఈ దేశంలో వీర్ సావర్కర్‌ను ఆరాధించేవారుఉన్నారు. ఆయన భావాలతో విభేదించే వారూ ఉన్నారు. అయినా ఆయన ఒక గొప్ప దేశభక్తుడు అనే అభిప్రాయం ఉన్నది. ఆయన కవి, రచయిత, న్యాయవాది, రాజకీయవేత్త అయినా.. ఆయన ఒక ప్రముఖ జాతీయవాదిగానే గుర్తింపులోకి వచ్చారు. ఆయన కవిత్వం, సాహిత్యం చదివి భారతీయులెందరో ప్రేరణ పొంది స్వాతంత్ర్య పోరాటంలో కదం తొక్కారు. హిందువుల ఐక్యత కోసం ఆయన బాగా ఆరాటపడ్డారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలను సహితం బహిరంగంగా వ్యతిరేకించారు.
గాంధీ హత్యలో భాగం ఉందనే ఆరోపణరాగా కోర్టులో నిరపరాధిగా బయటపడ్డారు. 1 ఫిబ్రవరి 1966న “ఆత్మార్పణ” చేసుకుంటానని ప్రకటించి ఆహారం తీసుకోవడం మానేసి 26 ఫిబ్రవరి 1966న వీరమరణం పొందారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం సావర్కర్ చిత్రపటాన్ని 2003లో పార్లమెంటు ఆవరణలో ఆవిష్కరించారు. 28 మే, 1883న నాసిక్ జిల్లా భాగూర్‌లోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వినాయక్ దామోదర్ సావర్కర్ తన 12వ ఏటనే మిత్రులను ఏకం చేసి సమాజం కోసం జాతీయభావజాల ఉద్యమాన్ని నిర్మించాడు. “మిత్ర మేళా”, “ఫ్రీ ఇండియా సొసైటీ” లాంటి సంస్థలను స్థాపించి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. లాల్, బాల్, పాల్.. త్రయం ప్రేరణతో స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. సావర్కర్ చరిత్రపై పలు రకాల అభిప్రాయాలున్నా, ఆయన దేశభక్తిని మాత్రం ఎవరూ కాదనలేకపోయారు. భరత మాత ముద్దుబిడ్డగా పేరొందిన సావర్కర్ 59వ వర్ధంతి నేడు.
- బుర్ర మధుసూదన్‌రెడ్డి