హైదరాబాద్ లో వీరహనుమాన్​ విజయ యాత్రకు 20 వేల మందితో భారీ బందోబస్త్ : ​సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్ లో వీరహనుమాన్​ విజయ యాత్రకు 20 వేల మందితో భారీ బందోబస్త్ : ​సీపీ సీవీ ఆనంద్
  • ఎల్లుండి గౌలిగూడ నుంచి తాడ్​బండ్​ వరకు శోభాయాత్ర 
  • దారి పొడవునా డ్రోన్లతో ప్రత్యేక నిఘా 
  • వీహెచ్​పీ, బజరంగ్ దళ్ నాయకులతో సిటీ సీపీ సమావేశం
  • యాత్రలో డీజేలకు అనుమతి లేదని స్పష్టం
  • ఐపీఎల్​ మ్యాచ్​ పేరుతో తమపై భారం మోపొద్దని రాచకొండ పోలీసులకు సూచన

బషీర్​బాగ్, వెలుగు: హనుమాన్​జయంతిని పురస్కరించుకుని ఈ నెల 12న సిటీలో నిర్వహించనున్న ‘వీర హనుమాన్ విజయయాత్ర’కు పటిష్ట బందోస్త్​ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ ​సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సీపీ అధ్యక్షతన బుధవారం కోఠి మెడికల్ కాలేజీ మీటింగ్​హాల్​లో శోభాయాత్ర సమన్వయ సమావేశం నిర్వహించారు. వీహెచ్ పీ, బజరంగ్ దళ్ నాయకులు, పోలీస్, జీహెచ్ఎంసీ, వాటర్​బోర్డు, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సీపీ ఆనంద్​మాట్లాడుతూ.. 12న ఉదయం 11 గంటలకు గౌలిగూడ రామమందిరం నుంచి విజయ యాత్ర ప్రారంభమై రాత్రి 9 గంటలలోపు సికింద్రాబాద్‌‌ తాడ్‌‌బండ్​హనుమాన్‌‌ ఆలయం వద్ద ముగుస్తుందని చెప్పారు. పుత్లిబౌలి, కోఠి, సుల్తాన్‌‌బజార్‌‌, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌‌రోడ్స్‌‌, అశోక్‌‌నగర్‌‌, గాంధీనగర్‌‌, కవాడిగూడ, బైబిల్‌‌ హౌస్‌‌, రాంగోపాల్‌‌పేట, ప్యారడైజ్‌‌ ప్రాంతాల మీదగా కొనసాగుతుందన్నారు.

ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌‌ ఆంక్షలు అమలులో ఉంటాయని, వెహికల్స్​డైవర్షన్స్​ఉంటాయని స్పష్టం చేశారు. దారిపొడవునా 17 వేల మంది సిటీ పోలీసులు, 3 వేల మంది ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బందితో పటిష్ట బందోబస్త్​ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సీసీ కెమెరాలతోపాటు డ్రోన్లతో నిఘా ఉంటుందన్నారు. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల నుంచి భక్తులు వచ్చి విజయయాత్రలో పాల్గొంటారని, మొత్తం 12.2 కిలో మీటర్ల మేర యాత్ర సాగుతుందని తెలిపారు.

కర్మన్ ఘాట్ నుంచి ర్యాలీగా వచ్చే భక్తులు గౌలిగూడలో యాత్రలో కలుస్తారన్నారు. యాత్రలో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. లౌడ్​స్పీకర్లు పెట్టుకోవచ్చు కానీ డీజేలకు అనుమతి లేదన్నారు. వర్షం పడే సూచన ఉందని, జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ఉండాలన్నారు. రాచకొండ పోలీసులు ఐపీఎల్ మ్యాచ్​పేరుతో భారం మొత్తం సిటీ పోలీసులపై పెట్టొద్దని కోరారు.

పేపర్​ షాట్స్​ వాడొద్దు: జీహెచ్ఎంసీ

వీరహనుమాన్ ​విజయయాత్రకు ఈ ఏడాదితో 21 ఏండ్లు పూర్తవుతుందని నిర్వాహకుడు శివ రాములు తెలిపారు. వీహెచ్ పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు సొంత ఖర్చుతో నిర్వహిస్తున్నారని చెప్పారు. హనుమంతుడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్రంలోని 9 చోట్ల ప్రశాంత వాతావరణంలో యాత్రలు నిర్వహించేందుకు నెల రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీసులకు పూర్తిసహకారం ఉంటుందన్నారు.

మొబైల్ టాయిలెట్స్, రోడ్ల వెంట టెంపరరీ లైట్లు ఏర్పాటు చేయాలని, చెట్ల కొమ్మలను తొలగించాలని అధికారులను కోరారు. రోడ్లకు ప్యాచ్ వర్క్స్ చేస్తున్నామని, టెంపరీ లైట్లు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నామని బల్దియా, వాటర్​బోర్డు అధికారులు తెలిపారు. యాత్రలో పేపర్ షాట్స్ వాడొద్దని, వాటి ప్లేస్​లో పూలు వాడాలని సూచించారు. పేపర్​షాట్స్​ను క్లీన్​చేయడం పారిశుద్ధ్య కార్మికులకు ఇబ్బంది ఉంటోందని తెలిపారు. అవసరమైనచోట వాటర్​ట్యాంకులు, వాటర్​క్యాంపులు పెడుతున్నామన్నారు.