![ఎవరీ వీర రాఘవరెడ్డి.. రామరాజ్యం పేరుతో ప్రైవేట్ సైన్యం ఏంటీ..?](https://static.v6velugu.com/uploads/2025/02/veera-raghava-reddy-history-who-attacked-the--of-chilukuri-balaji-temple-priest_d32XyC80Hw.jpg)
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై దాడి కలకలం రేపుతోంది. దాదాపు 20 మందికి పైగా రంగరాజన్ పై అటాక్ చేశారు. రంగరాజన్ అతని కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ల కోసం గాలిస్తున్నారు. అసలు రంగరాజన్ దాడి చేసిన వీర రాఘవ రెడ్డి ఎవరు? అతను ఏం చేస్తాడు.. ఎందుకు దాడి చేశాడో తెలుసుకుందాం.
వీర రాఘవ రెడ్డి ఎవరు..సైన్యం ఏంటి?
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన కొవ్వూరి వీర రాఘవరెడ్డి రామరాజ్యం పేరుతో ప్రైవేట్ సైన్యం నడిపిస్తున్నాడు. దేశంలో రామరాజ్యం ఏర్పాటు కావాలని.. ప్రచారం చేస్తుంటాడు. పదో తరగతి పాసైన లేదా ఫెయిల్ అయిన యువకులను తన సైన్యంలో రిక్రూట్ చేస్తూ వస్తున్నాడు. 5 కిలో మీటర్లు నడిచే సామర్థ్యం, రెండు కిలో మీటర్లు పరిగెత్తే సామర్థం ఉండాలి. వయసు 20 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఒక్కొక్కరికి రూ.20వేల జీతం .
యువతను తన సైన్యం చేర్చుకుంటూ వాళ్లతో ఇలాంటి దౌర్జన్యాలు చేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చిలుకూరు బాలాజీ అర్చకుడిని తన రామరాజ్యం సైన్యంలో చేరాలంటూ ఒత్తిడి చేశాడు.. చేరను అన్నందుకు ఇంటిపై దాడి చేశాడు వీర రాఘవ రెడ్డి. అతని కుమారుడిని తన ప్రైవేట్ సైన్యంతో కొట్టించాడు. గతంలో హైదరాబాద్ అబిడ్స్ లో కూడా వీర రాఘవరెడ్డిపై దాడి కేసు నమోదు అయ్యింది.
అసలేం జరిగిందంటే.?
ఫిబ్రవరి 7 శుక్రవారం ఉదయం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గుంపుగా రంగరాజన్ ఇంటికి వెళ్లి రామరాజ్యం స్థాపనకు మద్దతు ఇవ్వాలని, తమ గ్రూప్ కు ఆర్థిక సాయం చేయాలని, చిలుకూరు ఆలయ బాధ్యతలు తమకు అప్పగించాలని కోరారు. దానికి రంగరాజన్ నిరాకరించడంతో దాడికి దిగారు. దాడిని అడ్డుకోబోయిన రంగరాజన్ కుమారుడిని కూడా కొట్టారు. తాము ఇక్ష్వాకు వంశస్థులమని, ఆలయ పరిధిలో ఈ గోత్రం ఉన్నవారిని, శాస్త్రం నేర్చేవారిని ఎందుకు గుర్తించడం లేదని రంగరాజన్‌ను ప్రశ్నించారు. ఊరికే కోర్టులో కేసులు వేస్తే ఏం లాభమని, తాము చెప్పినట్టు వినాలన్నారు. ఉగాది వరకు టైం ఇస్తున్నామని, రామరాజ్య స్థాపనకు సహకరించకపోతే తాము రామని, వచ్చేవారు వచ్చి పనిచేసుకుని వెళ్తారని హెచ్చరించారు.
ఈ ఘటనపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారితో పాటు సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ స్పందిస్తూ.. తనపై 20 మంది దాడి చేశారని, పోలీసులకు కంప్లయింట్ చేశానని చెప్పారు. దీంతో ప్రధాన నిందితుడు వీరరాఘవ రెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు. వీరందరూ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు చెందినవారు అయ్యుండొచ్చని తెలుస్తున్నది.