కొత్తకొండ గ్రామంలో ఘనంగా వీరభద్రుడికి త్రిశూల స్నానం

  •     నేడు అగ్ని గుండాల నిర్వహణ

భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ  జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామివారికి అష్టభైరవార్చన, నిత్యౌపాసన, రుద్రహోమం, శక్తి హోమం, మహా పూర్ణాహుతి నిర్వహించారు. మహా కుంభాభిషేకం, వీరభద్ర స్వామి పళ్లెరం నిర్వహించి మేళ తాళాల నడుమ భక్తుల కోలాహలం మధ్య పవిత్ర పుష్కరిణి చేరుకున్నారు. అర్చన, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు.

త్రిశూలేశ్వరుని సహితంగా పవిత్ర స్నానాలు ఆచరించి, స్వామివారి దివ్య మంగళ ఆశీస్సులు పొందారు. అనంతరం శాంతి మంత్రపూర్వకంగా త్రిశూల స్నానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి కుటుంబ సమేతంగా వీరభద్రుడిని దర్శించుకున్నారు. శనివారం ఆలయ ఆవరణలో భంగీమఠం పరమేశ్వరయ్య నేతృత్వంలో అగ్నిగుండాల ఏర్పాటు చేస్తున్నట్లు  ఆలయ చైర్మన్‌ కొమురవెళ్లి చంద్రశేఖర్​ గుప్తా తెలిపారు. కార్యక్రమంలో ఈవో కిషన్​రావు, డైరెక్టర్లు విక్రం, సమ్మయ్య, మంజుల పాల్గొన్నారు.