- పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం దంపతులు
- భారీగా హాజరైన భక్తులు
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని భద్రకాళీ సమేత వీరభద్రుడి కల్యాణం బుధవారం రాత్రి అంగరంగవైభవంగా జరిగింది. కల్యాణానికి ముందు సుంకు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజస్తంభంపై నందీశ్వరుడి చిత్రపటాన్ని ఎగురవేశారు. తర్వాత భంగిమఠం పరమేశ్వర్ నేతృత్వంలో అంకురార్పణ, భేరి పూజ నిర్వహించారు.
కల్యాణానికి ముందు రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు అందజేశారు. అనంతరం భద్రకాళీ, వీరభద్రుడి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాల నడుమ కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. అనంతరం ఆగమ పండితుల ఆధ్వర్యంలో కల్యాణాన్ని నిర్వహించారు. స్వామివారి కల్యాణానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంపీపీ అనిత, సర్పంచ్ ప్రమీల, ఎంపీటీసీ రాజమణి, నాయకులు జెన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
భీమదేవరపల్లి, వెలుగు