
- హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్
- కరీంనగర్ ఎంపీ బండి సంజయ్
కొహెడ, వెలుగు: సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని సముద్రాల గ్రామంలో ఆదివారం వీరభద్రస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి వారికి కర్ణకంటి మంజుల రెడ్డి పట్టు వస్త్రాలను తీసుకురాగా, కరీంనగర్‌కు చెందిన గౌరిశెట్టి సత్యనారయణ పుస్తె, మట్టెలను తీసుకు వచ్చారు. అనంతరం పండితులు ముత్యాల తలంబ్రాలు, వేద మంత్రాల మధ్య వీరభద్రస్వామి కల్యాణం నిర్వహించారు.
ఆలయంలో వాహన పూజ, బండ్లు తిరుగుట, ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కల్యాణ మహోత్సవానికి రాష్ర్ట బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్హాజరై ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి కృప రాష్ర్ట ప్రజలపై ఉండాలన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అకాంక్షించారు. కల్యాణానికి వచ్చిన మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
మంత్రిని సన్మానించి స్వామి వారి చిత్ర పటాన్ని అందజేశారు. అలాగే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ గోపురం నిర్మాణం కోసం ఎంపీ రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించారు. గతంలో ఆలయ అభివృద్ధికి రూ.2 లక్షల నిధులను ఇచ్చారు. కార్యక్రమంలో అర్చకులు శాంతయ్య స్వామి, ప్రవీణ్, రాజేందర్, ప్రశాంత్, వీరస్వామి, ఆలయ కమిటీ చైర్మన్ పర్శరాములు నాయకులు పాల్గొన్నారు.