ముషీరాబాద్, వెలుగు: తెలంగాణలోని వీరశైవ లింగాయత్, లింగ బలిజలను ఓబీసీ జాబితాలో చేర్చాలని వీరశైవ లింగాయత్, లింగ బలిజ సంఘం కోరింది. రాష్ట్రంలోని వీరశైవ లింగాయత్‌లను 2009లో బీసీల్లో కలిపినా.. 14 ఏళ్లు అయినా ఇప్పటికీ ఓబీసీ జాబితాలో కేంద్ర ప్రభుత్వం చేర్చకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం న్యూఢిల్లీలో కేంద్ర సామాజిక, న్యాయ సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్, కేంద్ర పర్యాకట శాఖమంత్రి కిషన్ రెడ్డితో సంఘం నేతలు సమావేశమై వినతిపత్రం అందించారు.
అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వీరశైవ లింగాయత్‌లు ఇప్పటికీ 90 శాతం మంది వెనకబడి ఉన్నారని, విద్య, ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారని, కేంద్ర పథకాలు పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. నేషనల్ ఓబీసీ కమిషన్ నుంచి రికమండేషన్ ప్రపోజల్స్ తెప్పించుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తానని మంత్రులు హామీ ఇచ్చారని వారు తెలిపారు. మంత్రులను కలిసిన వారిలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పట్లోళ్ల సంగమేశ్వర్, రాష్ట్ర అధ్యక్షుడు వెన్న ఈశ్వరప్ప, కేంద్ర కమిటీ సభ్యుడు కె. శివప్ప, ఆవిటి మధుసూదన్, గణపతి చించోలే ఉన్నారు.