షాద్ నగర్, వెలుగు: ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే.. ఓట్లు అడగడానికి మళ్లీ వస్తున్న సీఎం కేసీఆర్ ను నియోజకవర్గ ప్రజలు నమ్మరని షాద్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ అన్నారు. లక్ష్మిదేవిపల్లి ప్రాజెక్ట్ చూపించి ఓట్లు అడిగారని, కుర్చి వేసుకుని ప్రాజెక్టు కట్టిస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్కు ఐదేళ్ల నుంచి కుర్చీ దొరకలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడే కేసీఆర్ రెండుసార్లు నమ్మించి ఓట్లు దండుకొని మరోసారి ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
షాద్ నగర్ సాక్షిగా 12% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని వాగ్దానం చేసి ఏం చేశారని ప్రశ్నించారు. లక్ష్మిదేవి పల్లి ప్రాజెక్టు కట్టకపోతే ప్రజలను ఓట్లు అడగమని ఎమ్మెల్యే అంజయ్య, మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి చెప్పి చేతకాని దద్దమ్మలుగా మిగిలారని మండిపడ్డారు. ఇప్పటికైనా షాద్ నగర్ ప్రజలు వాస్తవాలను గ్రహించాలని సూచించారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, ఫరుక్ నగర్ జెడ్పీటీసీ పి. వెంకటరామిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, రఘు, ఎండీ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.