- సుమారు 400 ఎకరాల నుంచి 2వేల ఎకరాలకు..
- డిమాండ్ ఉండడంతో రైతులను ప్రోత్సహిస్తున్న అధికారులు
- కూరగాయల సాగులో శిక్షణ, అవగాహన కార్యక్రమాల నిర్వహణ దళారుల జోక్యం
- లేకపోవడంతో లాభాలు వస్తున్నాయంటున్న రైతులు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో కూరగాయల సాగు క్రమంగా పెరుగుతోంది. రెండేండ్లలో కూరగాయల సాగు నాలుగింతలైంది. సుమారు 400 ఎకరాల నుంచి 2వేల ఎకరాల వరకు పెరిగింది. జిల్లాలో డిమాండ్ పెరగడంతో రైతులు కూరగాయల సాగు వైపు మళ్లుతున్నారు. వ్యవసాయాధికారులు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు ఏర్పాటుచేసి రైతులను ప్రోత్సహిస్తున్నారు. పెరిగిన కూరగాయల ఉత్పత్తులను రైతులు సొంత గ్రామాలు, సమీప పట్టణాల్లో ఏర్పాటు చేసిన వార సంతల్లో అమ్ముకుంటున్నారు.
దళారుల బెడద లేకపోవడంతో లాభాలు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. గతంలో ఇతర జిల్లాలు, ఆంధ్రా నుంచి జిల్లాకు కూరగాయలు దిగుమతి అయ్యేవి. అక్కడి కూరగాయలు ఇక్కడికి రావాలంటే కొన్ని రోజులు పట్టేవి.. దీనివల్ల తాజాగా ఉండేవి కావు. ఇప్పుడు స్థానికంగానే పండిస్తుండడంతో ఫ్రెష్‌గా ఉంటున్నాయని వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
డిమాండ్‌కు అనుగుణంగా..
కూరగాయల వినియోగం నాలుగేళ్లుగా భారీగా పెరిగిపోయింది. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని నీరు సమృద్ధిగా ఉండే గ్రామాల రైతులు కూరగాయల సాగు వైపు దృష్టి పెట్టారు. గతంలో వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న... తదితర పండించే రైతులు సైతం డిమాండ్ మేరకు కూరగాయల సాగు వైపు మళ్లుతున్నారు. జిల్లాలో పెద్దపల్లి, జూలపల్లి, కమాన్‌పూర్, కాల్వశ్రీరాంపూర్, ధర్మారం, ముత్తారం మండలాల్లో కూరగాయల సాగు అధికంగా ఉంది.
ఈ కూరగాయలను పెద్దపల్లి, గోదావరిఖని, సుల్తానాబాద్, మంథని పట్టణాల్లోని మార్కెట్లకు తరలించి అమ్ముకుంటున్నారు. పట్టణాలకు దూరంగా ఉన్న గ్రామాల రైతులు ఆయా మండలాల్లో నిర్వహించే వార సంతల్లో అమ్ముకుంటున్నారు. రైతులు ఏ రోజుకారోజు కూరగాయలను కోసి సంతలను చేర్చుతున్నారు. సమీప పట్టణాలు, వార సంతల్లోనే అమ్ముకుంటుండడంతో ట్రాన్స్‌పోర్ట్ చార్జీలు కూడా తగ్గిపోవడంతో ఆదాయం కూడా పెరిగిందని రైతులు చెబుతున్నారు.
రెండేళ్లలో పెరిగిన సాగు
రెండేళ్ల కింద జిల్లాలో 200 మంది రైతులు, సుమారు 400 ఎకరాల్లో కూరగాయలు పండించేవారు. ప్రస్తుతం సుమారు 800 మంది రైతులు 2 వేల ఎకరాల్లో సాగుచేస్తున్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. కూరగాయలు సాగు చేస్తున్న ప్రతీ గ్రామంలో దాదాపు 10 మంది రైతులు 20 ఎకరాలదాకా సాగుచేస్తున్నారు. టమాట, బెండకాయ, వంకాయ, క్యాప్సికం, అల్చంత, కాకర, మిర్చి, కొత్తిమీర, ఆనపుకాయ, మెంతి, పాలకూర, పూదీన, బీరకాయ, చిక్కుడు, బఠాణీ లాంటి పంటలు సాగు చేస్తున్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కూరగాయలను పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. మరోవైపు దళారుల బెడద లేకపోవడంతో అటు రైతులు, ఇటు వినియోగదారులకు మేలు జరుగుతోంది.