- వెజ్ మార్కెట్ స్థలం ఆక్రమించి షట్టర్ల నిర్మాణం
- రూ.20 కోట్ల ప్రాపర్టీ కోసం.. ఐదేళ్లుగా పోరాటం
- 17 మంది అఖిలపక్షం నాయకులపై కేసులు
- లీగల్ ఫైట్ చేయాలని ఎమ్మెల్యే ఆదేశం
మోత్కూరు, వెలుగు : మోత్కూరు మున్సిపాలిటీని కూరగాయల మార్కెట్ స్థల వివాదం వీడటం లేదు. రూ.2 కోట్ల విలువైన554 గజాల కూరగాయల మార్కెట్ స్థలాన్ని కొందరు ఆక్రమించి షెట్టర్లు నిర్మించడంతో వివాదం మొదలైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారులు సహకరించడంతోనే కొందరు ఆ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని అఖిలపక్షం నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ స్థలం తాము కొనుక్కుని నిర్మాణాలు చేపట్టామని సదరు వ్యక్తులు చెప్పడంతో ఈ పంచాయితీ ఐదేళ్లుగా నడుస్తోంది. ఆ స్థలంపై ఇరుపక్షాలు హైకోర్టుకు వెళ్లడం, ఆ స్థల పరిరక్షణ కోసం ఫైట్ చేస్తున్న అఖిలపక్షం నాయకులపై కేసులు పెట్టారు. ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్ తోపాటు అక్రమ షట్టర్ల నిర్మాణంపై మళ్లీ హైకోర్టుకు వెళ్లేందుకు అఖిలపక్ష నాయకులు సిద్ధమయ్యారు.
2014లో మొదలైన వివాదం..
మోత్కూరు గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో సుమారు 60 ఏళ్ల క్రితం అప్పటి సర్పంచ్ మద్ది రంగారెడ్డి హయాంలో కూరగాయల మార్కెట్ కోసం పరిమళ రామచంద్రు నుంచి 431 సర్వే నంబర్ లో పాత బస్టాండ్ సమీపంలో 554 గజాల స్థలం కొనుగోలు చేశారు. ఆ స్థలాన్ని గ్రామ పంచాయతీ రికార్డుల్లో నమోదు చేసి ఏడు షాపులుగా నంబరింగ్ఇచ్చారు.
2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం, మోత్కూరు మున్సిపాలిటీగా ఏర్పడటంతో ఆ స్థలంపై వివాదం మొదలైంది. అప్పటి పంచాయతీ కార్యదర్శి లింగారెడ్డి, 2018 ఆగస్టులో ఇన్ చార్జి కమిషనర్ గా పని చేసిన సత్యనారాయణ ముగ్గురు ఆక్రమణదారులతో చేతులు కలిపి ఆ స్థలంలో నిర్మాణాలకు సహకరించారని అఖిలపక్షం నాయకులు ఆరోపించారు. అఖిలపక్షం నాయకులు సమాచార హక్కు చట్టం ద్వారా ఆధారాలు సేకరించి బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గడ్డం నర్సింహ 2019లో హైకోర్టులో కేసు వేశారు. ఆ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వ్యక్తులు అది మాదేనంటూ కోర్టుకు వెళ్లారు.
మున్సిపల్ స్థలంగా రిప్లయ్..
అప్పటి గ్రామ పంచాయతీ, ప్రస్తుత మున్సిపాలిటీ రికార్డుల్లోనూ ఆ స్థలం ప్రభుత్వ భూమిగానే ఉంది. అప్పటి మున్సిపాలిటీ ఇన్చార్జి కమిషనర్ గా సత్యనారాయణ పనిచేసిన సమయంలోనే ఆ వివాదం మరింత ముదరడంతో అఖిలపక్షం నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆ స్థలానికి సంబంధించిన రికార్డులు చూపించేందుకు ఇన్చార్జి కమిషనర్ అంగీకరించకపోవడంతో అఖిలపక్షం నాయకులు ఐదారు గంటలపాటు మున్సిపాలిటీ ఎదుట బైఠాయించారు. అనంతరం ఆ రికార్డులు చూపించగా గ్రామపంచాయతీ స్థలంగా ఉంది.
17 మంది అఖిలపక్షం నాయకులపై కేసులు..
మున్సిపాలిటీ స్థలం కోసం ఫైట్ చేస్తున్న 17 మంది అఖిలపక్షం నాయకులు అవిశెట్టి అవిలిమల్లు, గడ్డం నర్సింహ, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, గుండగోని శ్రీరామచంద్రు, బయ్యని రాజు, మరాటి అంజయ్య, అన్నెపు వెంకట్, బొల్లు యాదగిరి, పుల్కరం మల్లేశ్, సజ్జనం మనోహర్, గడ్డం లక్ష్మణ్, బోడ శ్రీను, సోలిపురం లక్ష్మీ నర్సింహారెడ్డి, బయ్యని చంద్రశేఖర్ తదితరులపై కేసులు నమోదయ్యాయి. ఆ స్థలం పరిరక్షణ కోసం పోరాడుతున్న తమపై అప్పటి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ లీడర్లు అక్రమ కేసులు పెట్టించారని అఖిలపక్షం లీడర్లు ఆరోపిస్తున్నారు.
అధికారుల మెడకు చుట్టుకుంటున్న వైనం..
ఇటీవల సేకరించిన పూర్తి సమాచారంతో తాజాగా అఖిలపక్షం లీడర్లు మళ్లీ హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతుండటంతో అధికారులకు చిక్కులు తప్పేలా లేవు. అప్పటి పంచాయతీ కార్యదర్శి లింగారెడ్డి, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్లు సత్యనారాయణ, శ్రీకాంత్ ఇందులో కీలకంగా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ కూడా ఆ స్థలం ఆక్రమణపై సీరియస్ గా ఉన్నారు. మున్సిపల్ శాఖ స్టేట్ స్టాండింగ్ కౌన్సిల్ కు వెళ్లి నిర్మాణాలను కూల్చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను ఎమ్మెల్యే ఆదేశించారు. దీంతో ఇంతకాలం సైలెంట్ గా ఉన్న ఆఫీసర్లు ప్రస్తుత పరిస్థితులతో ఆందోళన చెందుతున్నారు.
హైకోర్టులో మళ్లీ కేసు వేస్తున్నాం ..
మున్సిపల్ స్థలం ఆక్రమణపై మళ్లీ హైకోర్టుకు వెళ్తున్నాం. మామూళ్ల మత్తులో కొందరు ఆఫీసర్లు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారు. ఆఫీసర్లు వాస్తవ రికార్డులను కోర్టుకు ఇస్తే ఆ స్థలం మున్సిపాలిటీకి దక్కుతుంది. ఆక్రమణదారుల నుంచి ఆస్థలాన్ని కాపాడే వరకు లీగల్ గా ఫైట్ చేస్తాం.
గడ్డం నర్సింహా, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు
ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి..
రూ.2 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి. 60 ఏళ్ల కింద గ్రామ పంచాయతీ వెజ్ మార్కెట్ కోసం కొన్న స్థలాన్ని కొందరు బీఆర్ఎస్ లీడర్లు ఆక్రమించి షట్టర్లు నిర్మించారు. ఆ స్థలాన్ని కాపాడటానికి ఫైట్ చేస్తున్న మాపై అప్పటి ఎమ్మెల్యే అక్రమ కేసులు పెట్టించారు.
అవిశెట్టి అవిలిమల్లు,
కాంగ్రెస్ జిల్లా నాయకులు