- ఏ రకమైనా కిలో రూ.50 -100
- అత్యధికంగా పచ్చి మిర్చి, బిన్నీస్ కిలో రూ.120
- ఎండలకు దెబ్బతిన్న పంటలు.. తగ్గిన దిగుమతులు
- ఉదయం10 దాటితే రైతుబజార్లలో ఆకుకూరలు దొరకట్లే
హైదరాబాద్, వెలుగు: కూరగాయల రేట్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎండల కారణంగా జిల్లాల నుంచి గ్రేటర్ మార్కెట్లకు దిగుమతులు తగ్గాయి. దీంతో ధరలు అమాంతం పెరిగాయి. రేటు ఎక్కువైనా సరే కొందామని ఉదయం 10 గంటల తర్వాత రైతుబజార్లు, మార్కెట్లకు పోతే దొరకడం లేదు. ఆకుకూరలదీ అదే పరిస్థితి. రైతుబజార్లకు, బయటి మార్కెట్లకు రేట్లలో పొంతన ఉండటం లేదు. షార్టేజ్ ను క్యాష్చేసుకునేందుకు వ్యాపారులు డబుల్ రేట్లకు అమ్ముతున్నారు. మొన్నటి దాకా కిలో టమాటా రూ.10 నుంచి 20 ఉండగా, ప్రస్తుతం రూ.50కు చేరింది. అత్యధికంగా పచ్చిమిర్చి, బిన్నీస్, చిక్కుడుకాయలు కిలో రూ.120 పలుకుతున్నాయి. సరిపడా నీళ్లు లేక కూరగాయలు, ఆకుకూరల సాగు తగ్గిందని సిటీ మార్కెట్లకు వస్తున్న రైతులు చెబుతున్నారు.
300 టన్నుల షార్టేజ్
ఆర్కేపురం, ఫలక్నుమా, అల్వాల్, ఎల్లమ్మబండ, మెహిదీపట్నం, వనస్థలిపురం, కూకట్పల్లి, సరూర్నగర్, ఎర్రగడ్డలో రైతుబజార్లు ఉన్నాయి. వీటికి ఎక్కువగా రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సిద్దిపేట జిల్లాలలోని గ్రామీణ ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతాయి. కొన్ని రకాలు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తుంటాయి. అయితే అన్నిచోట్ల ఎండల ప్రభావంతో పంటలు తగ్గాయి. మొత్తంగా సిటీకి డైలీ 600 నుంచి 800 టన్నుల కూరగాయలు అవసరం ఉండగా, ప్రస్తుతం 500 టన్నుల వరకు దిగుమతి అవుతున్నాయి. ఆకుకూరలు అయితే 50 శాతానికి పడిపోయాయి.
ఆకుకూరలు రావట్లే
కూరగాయలు ధరలు పెరగడంతో ఆకుకూరలకు డిమాండ్ఎక్కువైంది. ఆకుకూరల దిగుమతులు కూడా తగ్గడంతో చిన్న కట్ట రూ.10 నుంచి 20 పలుకుతోంది. పాలకూర, తోటకూర, గోంగూర, పొన్నగంటికూర, బచ్చల కూర, మెంతికూర, కొత్తిమీర, బచ్చల్ కూర, గంగవెల్లికూరల ధరలు మామూలు రోజుల్లో కంటే డబుల్ అయ్యాయి. కొత్తిమీర, పుదీనా ధరలు కూడా అంతే ఉన్నాయి. నెలరోజుల కిందట ఏ ఆకుకూరైనా రూ.10కి ఐదారు కట్టలు వచ్చేవి. ఇప్పుడు ఒకటి, రెండుకు మించి రావడం లేదు.
సిటీలో డైలీ 150 టన్నుల ఆకుకూరల డిమాండ్ ఉండగా, ప్రస్తుతం 80 టన్నులు వస్తున్నాయని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. అత్యధికంగా మాదన్నపేట మార్కెట్ కు నెల రోజుల కిందట డైలీ 35 నుంచి 40 టన్నుల ఆకుకూరలు వచ్చేవి ఇప్పుడు 20 నుంచి 25 టన్నులు మాత్రమే వస్తున్నాయి. గుడిమల్కాపూర్ కు అంతకు ముందు 10 టన్నులు వస్తుండగా ప్రస్తుతం 6 టన్నులకు మించి రావడం లేదు. శంషాబాద్, ఎల్బీనగర్ మార్కెట్లకు ఇదే పరిస్థితి ఉంది. దిగుమతులు సగానికి తగ్గాయని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు.