నారాయణపేట, వెలుగు; జిల్లాలో కూరగాయలు, ఫ్రూట్స్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందుకుగాను అనువైన స్థలాన్ని గుర్తించాలని ఆఫీసర్లను కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ఉద్యాన, నాబార్డ్ , రెవెన్యూ ఆఫీసర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే తొలిసారిగా నారాయణపేట జిల్లాలో కూరగాయల, పండ్ల ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు గాను పది ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించాలని సూచించారు. అంతకుముందు ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా మాట్లాడుతూ రైతులు బృందంగా ఏర్పడి కూరగాయలు, పండ్ల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు.
ఉమ్మడి జిల్లాలోని కొల్లాపూర్ మామిడి పండ్లకు విదేశాల్లో భారీగా డిమాండ్ ఉందని, నారాయణపేట జిల్లాలో కూరగాయల , పండ్ల ప్రాసెసింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తే విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. దామరగిద్ద, మాగనూరు మండలాల పరిధిలో ప్రభుత్వం స్థలాన్ని సేకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, నాబార్డ్ అధికారి నిఖిల్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు..