ఇంట్లోనే కూరగాయలు పండించుకోండి.. ఎలాగంటే..

ఇంట్లోనే కూరగాయలు పండించుకోండి.. ఎలాగంటే..

వర్షాకాలం వచ్చింది.. కూరగాయల రేట్లు తగ్గుతాయనుకుంటే.. మార్కెట్​ వెళ్లాలంటేనే భయపడుతున్నారు జనాలు.  కూరలు కొనలేక... పిల్లలకు పచ్చడి మెతుకులు పెట్టలేక సామాన్య మధ్యతరగతి ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.  ఇప్పుడు వానాకాలం వచ్చింది.  దేవుడి దయ వలన వర్షాలు కూడా బాగానే పడుతున్నాయి.  ఇంట్లో ఏదో మూల చిన్న పాదులు పెట్టుకుంటే మీరే కాదు.. చుట్టుపక్కల వారికి కూడా కూరగాయాలు ఇవ్వవచ్చు.  పల్లెల్లోనే కాదు పట్టణాల్లో కూడా చాలా తేలికగా కూరగాయలు పండించవచ్చు.  వాసకాలంలో ఇంట్లోనే ఈజీగా పెరిగే కొన్ని కాయగూరలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.  

కాయగూరల రేట్లు చూస్తే కూర కూడ వండుకునే పరిస్థితి లేదు.  వంటిట్లో కూరల బుట్ట ఖాళీ.. ఫ్రిజ్​ లో పాలు.. పెరుగు తప్ప ఏకూర కనపడం లేదు. జిహ్వ చాపల్యానికి తాళం వేసి మరీ వారంలో ఎక్కువ సార్లు ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, కోడిగుడ్డుతో అడ్జెస్ట్ అయితున్నారు. ఎండాకాలం ఇండ్లలో కాయగూరలు పెంచుకోవడం  ఎట్లాగు కుదరదు.   కానీ, ఇప్పుడు వానాకాలం వచ్చింది. ఇంటి దగ్గర ఏదో కొద్దిగా మూలలో ఏదో  విత్తనం నాటితే  కాస్తంతా పొట్టనిండా కూడు తినొచ్చు.  ఫస్ట్​  వాన పడగానే పల్లెల్లో  రైతులు పొలాల్లో విత్తనాలు వేస్తారు. ఇక ఇంటిదగ్గర  పెరట్లో కట్టె పుల్లతో ఇట్లా అని చిక్కుడు, తోటకూర, బచ్చలి  ఇలా ఓపికను బట్టి రకరకాల విత్తనాలు  పెడ్తారు. కొన్ని మొక్కలు  ఇంటి చుట్టూ తీగలా వచ్చి .. వినాయకచవితి నుంచి  దీపావళి, సంక్రాంతి వరకు కూరగాయల మార్కెట్ కు వెళ్లే అవసరం లేకుండా చేస్తాయి. 

 టౌన్ లు, సిటీల్లో  ఉన్నవాళ్లు కూడా ఈ కూరగాయలను పండించుకోవచ్చు. . గ్రౌండ్ ఫ్లోర్ లో కాకుండా ఫస్ట్​ఫ్లోర్​, సెకండ్​ ఫ్లోర్​ ఇలా నివసించేవారు  టెర్రస్ మీద, బాల్కనిలో తొట్టిలు, బ్యాగులు పెట్టి పెంచుకునే కాయగూర మొక్కలు కూడా ఉన్నాయి.  వీటికి ఎరువులు అక్కర్లేదు. పురుగుల మందు అవసరం రానే రాదు. వానదేవుడు  మోహం చాటేసినప్పుడు  కొన్ని నీళ్లుపోస్తే చాలు.. ఎంచక్కా.. ఇంట్లోనే పండిన కూరలను ఆస్వాదించవచ్చు.

దోసకాయ: వానాకాలంలో మంచిగ పండే కాయగూరల్లో దోసకాయ ఒకటి. దోసకాయ విత్తు వేసిన చోట మంచి మట్టి ఉండేటట్టు చూసుకోవాలి. ఎండ బాగ తగిలే ప్లేస్ పెట్టి.. రోజూ కొన్నినీళ్లు పోస్తే చాలు. వీటిని తొట్టెల్లో  కూడా పెంచొచ్చు. దోసకాయ ఇత్తులు మార్కెట్ లో తక్కువ ధరకే దొరుకుతాయి. దోసకాయను ఎండబెట్టి...ఈజీగా ఇంట్లోనే విత్తనాలను చేసుకోవచ్చు.

బెండకాయ: మనదేశంలో ఎక్కువ మంది ఇష్టపడే కాయగూరల్లో మొదటిస్థానం బెండకాయదే! అయితే, బెండకాయ పొలాల్లో మాత్రమే పండే కాయగూర అనుకుంటారు చాలామంది. ఈ మాట కేవలం ఎండాకాలానికే సరిపోతుంది. వాసకాలంలో బెండకాయ ఇంటి దగ్గరే హాయిగా పండించుకోవచ్చు. బాల్కనీలో తొట్టెలు పెట్టి అప్పుడప్పుడు నీళ్లు పోస్తే చాలు! గోడ దగ్గరపెడితే ఈ చెట్లు చూసేవాళ్లకు అందంగా కనిపిస్తాయి.

టొమాటో: మన దగ్గర ఎనభై శాతం కూరల్లో కచ్చితంగా టొమాటో ఉండాల్సిందే! వాస్తవానికి ఇది టొమాటోపండు. దీంట్లో సి -విటమిన్ పుష్కలం. మురిగిపోయిన టొమాటోలు పెరట్లో ఏదో ఒక మూలకు పారేస్తేనే.. ఒక్కవాన పడగానే నారు పెరుగుతది. ఈ వానాకాలంలో అన్నింటికన్నా.. ఈజీగా పెరిగే వాటిలో టొమాటోనే నంబర్ వన్. వీటిని కూడా తొట్టిల్లో పెంచుకోవచ్చు. టొమాటో విత్తనాలు కూడా టొమాటోల్ని ఎండబెట్టి చేసుకోవచ్చు.

ముల్లంగి : ముల్లంగి అంటే తెల్వనోళ్లు చాలామంది ఉంటారు. ఇక, దాన్ని కొత్తగా చూసినవాళ్లు ఇది ఎక్కడ పండిస్తారోనని డౌట్ పడ్తారు. ముల్లంగితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సలాడ్,సాంబార్లో వేస్తే.. లొట్టలేసుకుని తింటరు. ఇంకా ఎన్నో కూరల్లో  ముల్లంగి స్పెషల్​ గా వాడతారు. వానాకాలంలో ముల్లంగి ప్రయోగాన్ని ఇంటిపట్టునే చేయొచ్చు. ముల్లంగి విత్తనాలు మార్కెట్ లో దొరుకుతాయి.

తీగలు: ఇంట్లో ఇంచు స్థలం ఉన్న చాలు అక్కడో విత్తనం పడేస్తే.. అవి ఇంటిమీదికి తీగ పారి గంపెడు కాయగూరల్ని ఇస్తాయి.. మీకే కాదు మీరు తిన్నంక మిగిలిన వాటిని  పక్కింటోళ్లకు ఇవ్వవచ్చు. అలాంటి వాటిలో బీరకాయ, పొట్లకాయ, ఆనపకాయ, గుమ్మడికాయ, కాకరకాయ చిక్కుడు కాయ ముందు వరసలో ఉంటాయి.
 టైంకి వాసలు పడకుంటే.. రోజుకోసారి వాటి మొదళ్ల తడిపితే చాలు! ఇవి ఏ మట్టిలోనైనా పెరుగుతయి. ఎలాంటి ఎరువులూ, కెమికల్స్ వీటికి అవసరం లేదు. వీటిని తొట్టిలో పెట్టికూడా తీగలు ఇంటిపైకి తీగలు పారించుకోవచ్చు.