హైదరాబాద్, చౌటుప్పల్, వెలుగు: లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్‌లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. శనివారం టమాటా కిలో రూ.8 ఉంటే సోమవారం రోజున కిలో రూ.120 పలికింది. రూ.40లకు కిలో ఉన్న పచ్చిమిర్చి రూ.200కు అమ్మారు. కిలో రూ.25 నుంచి రూ.30 పలికిన బెండక, దొండకాయ కూడా కిలో వంద దాటాయి. ఆదివారం దేశవ్యాప్తంగా కర్ఫ్యూతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన కూరగాయాలు మార్కెట్‌లకు చేరలేదు. బోయిన్‌పల్లి మార్కెట్‌కు రోజువారీగా 17వేల క్వింటాళ్లు రావాల్సి ఉండగా 7 వేల క్వింటాళ్ల కూరగాయలు మాత్రమే వచ్చాయి. రోజూ రెండు మూడు వేల క్వింటాళ్లు రావాల్సిన టమాటా 700 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. దీంతో మార్కెట్‌లో కూరగాయల కొరత ఏర్పడింది. వారం వరకు కూరగాయలు దొరుకుతాయో దొరకవోనని పెద్దఎత్తున జనాలు కొనడానికి రావడంతో వ్యాపారులు ఇదే అదనుగా ధరలు నాలుగైదు రెట్లు పెంచి అమ్మారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో చిన్న మార్కెట్ల నుంచి రైతు బజార్ల వరకు అన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. అధిక ధరలకు అమ్ముతుండడంతో వ్యాపారులపై కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 31 వరకు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినా ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. అయితే అధిక ధరలను అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూతో కూరగాయల దిగుమతి తక్కువ కావడమే సోమవారం ధరలు భగ్గుమనడానికి కారణమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మార్కెట్లు, రైతుబజార్లతోపాటు కూరగాయలు, నిత్యావసర వస్తువులు విక్రయించే సూపర్ మార్కెట్లు సైతం జనంతో కిక్కిరిసిపోయాయి. చాలామంది ప్రజలు కనీస జాగ్రత్తలు సైతం తీసుకోలేదు.
జిల్లాల్లోనూ అదే పరిస్థితి
హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లోనూ కూరగాయాలు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో కిలో పచ్చిమిర్చి రూ.200 వరకు విక్రయించారు. శనివారం వరకు దీని ధర కిలోకు రూ.18 మాత్రమే ఉంది. టమాటల ధర కిలో రూ.4 ఉండగా సోమవారం రూ.80 లెక్కన, ఆలుగడ్డను కిలో రూ.80 లెక్కన అమ్మారు. ఆదివారం జనతా కర్ఫ్యూ ఉండడంతో శనివారం నుంచే మార్కెట్లకు కూరగాయలు రాలేదు. దీంతో సోమవారం మార్కెట్లలో కూరగాయలకు యమ గిరాకీ నెలకొంది. చౌటుప్పల్ కూరగాయల మార్కెట్లో చిల్లర వ్యాపారులు ధరలు బాగా పెంచి అమ్ముతున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన ఆర్డీవో సూరజ్ కుమార్వచ్చి విచారించారు. హైదరాబాద్‌లోని కూరగాయల మార్కెట్లలో ఆరా తీశారు. కిలో పచ్చిమిర్చి రూ.110లు అని చెప్పడంతో, కిలో రూ.100 లెక్కన అమ్మాలని ఆదేశించారు. మంగళవారం నుంచి కూరగాయల ధరలను తెలుసుకొని ధరల పట్టికను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాందుర్గారెడ్డిని ఆదేశించారు.
రేట్లు ఫిక్స్చేసిన్రు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌లో రెట్టింపు ధరలకు అమ్మారు. టమాట కిలో రూ.50, మిర్చి రూ.120, -వంకాయలు రూ.80కి అమ్మారు. ఆసిఫాబాద్ జిల్లాలో కిలో టమాట రూ.40 వరకు, మిర్చి రూ.200, కొత్తిమీర రూ. 250కి విక్రయించారు. చివరకు గ్రామ పంచాయతీ అధికారులు కల్పించకుని కూరగాయలకు రేట్ఫిక్స్చేశారు. మంచిర్యాలలో సైతం ఉదయం ఎక్కువ ధరలకు అమ్మారు. సమాచారం తెలుసుకున్న టౌన్ సీఐ ముత్తి లింగయ్య, మున్సిపల్, రెవెన్యూ, సివిల్ఆఫీసర్లు మార్కెట్‌ను సందర్శించి ధరలపై ఆరా తీశారు. వ్యాపారులతో సమావేశం నిర్వహించి నిర్ణయించిన ధరలకే కూరగాయలు అమ్మాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ వెంకటేశ్వర్లు హోల్‌సేల్, రిటేల్ ధరలను నిర్ణయించారు. రోజువారీగా ధరల పట్టికను మార్కెట్లో ప్రదర్శిస్తామని, ప్రజలకు తెలిసేలా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తామని సీఐ తెలిపారు. నిర్ణీత ధరల కంటే ఎక్కువ ధరలకు అమ్మిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఎక్కువ రేటు చెప్పిన్రని..
కూరగాయల ధరలు ఎక్కువ చెప్పడంతో ఆగ్రహానికి గురైన ప్రజలు ఎర్రగడ్డ రైతు బజారులో కూరగాయలు ఎత్తుకెళ్లారు. ఎర్రగడ్డ మార్కెట్ లో ఒకేసారి 8 షాప్స్ పై జనం తిరగబడ్డారు. టమాటా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ కూరగాయలు అమ్మే చిరువ్యాపారుల నుంచి లాక్కునేందుకు ప్రయత్నించారు. జనం కూరగాయలు లాక్కొడానికి ప్రయత్నించడంతో వారిపై వ్యాపారి కేసు పెట్టాడు. అడ్డగోలు రేట్లకు సరుకులు అమ్మితే ఎపిడమిక్
డిసీస్ యాక్ట్ కింద కేసులు పెడతామని పోలీసులు చెప్పారు.
For More News..
కాలిఫోర్నియా బీచుల్లో జనం జల్సాలు