కరీంనగర్ క్రైం, వెలుగు: ఎన్నికల కోడ్ నేపథ్యంలో గురువారం కరీంనగర్‌లో పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. సరైన ఆధారాల్లేని సుమారు రూ. 12.56లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వన్ టౌన్ పరిధిలో కరీంనగర్ లోని రాజీవ్ చౌక్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో అశోక్ నగర్‌కు చెందిన నార్ల నరేశ్‌కుమార్ వద్ద రూ.1.60 లక్షలు, వీబీఎన్ వద్ద కమాన్ రోడ్డుకు చెందిన విజయ రాఘవన్ రూ.2.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
త్రీ టౌన్ పరిధిలోని కాపువాడ చౌరస్తా వద్ద నిర్వహించిన తనిఖీల్లో బహదూర్ ఖాన్ పేటకు చెందిన టి.సంజీవ్ వద్ద రూ.3.76లక్షలు స్వాధీనం చేసుకోగా, నాఖా చౌరస్తా వద్ద కిసాన్ నగర్ కు చెందిన జె.రమేశ్ వద్ద రూ. 2.05 లక్షలు, కోర్టు చౌరస్తా వద్ద విద్యానగర్ కు చెందిన పౌలోజు నందం వద్ద రూ. 1.75 లక్షలు, వావిలాలపల్లికి చెందిన శ్రీనివాస్ వద్ద రూ.1 లక్ష స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో సీఐలు జె.సరిలాల్, జాన్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
4 కేజీల వెండి బహుమతులు పట్టివేత
కరీంనగర్ క్రైమ్, వెలుగు: కరీంనగర్ టూ టౌన్ పీఎస్ పరిధిలో గురువారం తెల్లవారుజామున కోర్టు చౌరస్తాలో వాహన తనిఖీల్లో ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెంఇన నల్లబోతుల గొప్పరాజు నుంచి 4 కేజీల సిల్వర్ బహుమతులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. దీంతోపాటు గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామానికి చెందిన కట్ట శ్రీనివాసచారి నుంచి సరైన ఆధారాల్లేని రూ.4.36 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు.