రూల్స్ ఫాలో కాకపోతే ఫైన్ కట్టాల్సిందే.. వెహికల్ స్క్రాప్ పాలసీ కొత్త నిబంధనలు ఇవే

రూల్స్ ఫాలో కాకపోతే ఫైన్ కట్టాల్సిందే.. వెహికల్ స్క్రాప్ పాలసీ కొత్త నిబంధనలు ఇవే

న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వెహికల్ స్క్రాప్ పాలసీ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2025, ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ విధానం అమల్లోకి రానుంది. వెహికల్ స్క్రాప్ పాలసీ విధానం కింద 15  సంవత్సరాలు దాటిన వ్యక్తిగత, ఎనిమిదేళ్లు దాటిన వాణిజ్య వాహనాలను తుక్కుగా పరిగణిస్తారు. అయితే వీటిలో ఫిట్‌నెస్ బాగున్న వెహికల్స్‌కు ఐదేళ్ల పాటు మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కానీ ఆ వెహికల్స్ రవాణా శాఖ ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో పాస్ అయితేనే ఈ మినహాయింపు వర్తిస్తుంది.  ఫిట్‎నెస్ టెస్ట్‎లో పాస్ అయితే ఆ వాహనాన్ని మరో ఐదేళ్ల పాటు నడుపుకోవచ్చు.. ఒకవేళ టెస్ట్‌లో ఫెయిల్‌ అయితే మాత్రం ఇంకా ఆ వాహనాలు తుక్కుకు వెళ్లాల్సిందే. 

రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో వెహికల్ స్క్రాప్ పాలసీ విధానాన్ని సీరియస్‎గా ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగానే.. రూల్స్ పాటించని వారి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. స్క్రాప్ పాలసీకి  విరుద్ధంగా కాల పరిమితి దాటిన వాహనాలను నడిపే వారిపై పర్యావరణ పరిహారం విధించాలని నిర్ణయించింది. మొదట మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాహన యాజమానులు తమ వెహికల్ కండీషన్ పరీక్షలు చేయించాలి. 

ALSO READ | 800 బిలియన్ డాలర్లకు ఎగుమతులు: గోయెల్‌‌

ఇందులో వెహికల్ ఫిట్ నెస్ సాధించకపోతే.. వాటిని స్క్రాప్ దుకాణాలకు తరలించాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్క్రాప్ గోడౌన్‎లో ఆ వాహనాలను అప్పగించాలి. కాల పరిమితి అయిపోయిన వాహనాలను స్క్రాప్‎కు తరలించి కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం రాయితీ ఇవ్వనుంది. అలా కాకుండా ఆ వాహనాలు నడిపితే.. వారిపై ఎన్విరాన్మెంట్ ఫైన్ విధిస్తారు. సెంట్రల్ బోర్డ్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఆ వాహనం వల్ల పర్యావరణానికి కలిగిన నష్టానికి సమానంగా జరిమానా విధించనున్నారు. రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ ప్రకారం స్టేట్ బోర్డు ఈ ఫైన్ విధిస్తోంది. 

ఫైన్ విధించిన అనంతరం సదరు వ్యక్తి ఒక సంవత్సరంలోపు స్క్రాప్ పాలసీ రూల్స్ ఫాలో అయితే విధించిన జరిమానాలో అతడికి 75 శాతం తిరిగి చెల్లిస్తారు. రెండు సంవత్సరాలలో అయితే 60 శాతం, మూడు సంవత్సరాలలో అయితే 40 శాతం జరిమానా తిరిగి చెల్లిస్తారు. పర్యావరణ పరిహారం కింది సేకరించిన ఈ నష్టపరిహారాన్ని సెంట్రల్ బోర్డ్ లేదా స్టేట్ బోర్డు ప్రత్యేక ఖాతాలో ఉండనుంది. ఈ డబ్బును పర్యావరణాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది.