ఇవాల్టి నుంచి ప్రకాశ్​ నగర్​ బ్రిడ్జిపై రాకపోకల పునరుద్ధరణ

ఇవాల్టి నుంచి ప్రకాశ్​ నగర్​ బ్రిడ్జిపై రాకపోకల పునరుద్ధరణ
  • వంతెనను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

 ఖమ్మం, వెలుగు : గతేడాది భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రకాశ్​ నగర్​ వంతెన రిపేర్లు పూర్తయ్యాయి. గత సెప్టెంబర్​ 1న వచ్చిన భారీ వరదలతో మున్నేరుపై ఉన్న ప్రకాశ్​ నగర్​ హైలెవల్ బ్రిడ్జికి ఉన్న 24 స్పాన్​ లకు గాను 9 స్పాన్​ లు పక్కకు జరిగాయి. దీంతో గత ఆరు నెలల నుంచి బ్రిడ్జిపై నుంచి రాకపోకలను నిలిపివేశారు. పక్కనే గతంలో ఉన్న కాజ్​ వేను మళ్లీ రూ.90 లక్షలతో పునరుద్ధరించారు. దానిపై నుంచి ఇన్ని రోజులుగా వాహనాల రాకపోకలు నడుస్తున్నాయి. ఇప్పుడు రూ.1.50 కోట్లతో చేపట్టిన ప్రకాశ్​ నగర్​ బ్రిడ్జి రిపేర్లు కూడా పూర్తి కావడంతో బుధవారం నుంచి దానిపైకి వాహనాలను అనుమతించనున్నారు. 

మంగళవారం బ్రిడ్జిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వచ్చిన వరద వల్లనే బ్రిడ్జి దెబ్బతిన్నదని చెప్పారు. ఆధునిక టెక్నాలజీతో ఆర్ అండ్ బీ అధికారుల ఆధ్వర్యంలో డిస్ ప్లేస్ అయిన స్పాన్స్ ను యథాతథ స్థితిలో ఉంచారన్నారు. కోదాడ వైపు నుంచి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు వచ్చే రైతులకు ప్రకాశ్ నగర్ బ్రిడ్జి కీలకంగా ఉందని చెప్పారు. మంత్రి వెంట రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్​ చైర్మన్​ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్​, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్లు కమర్తపు మురళి, నేతలు సాదు రమేశ్​రెడ్డి, రావూరి సైదిబాబు తదితరులున్నారు.