ఫెంగల్ తుఫాన్ తీరం దాటింది.. ఈ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్ఛేరి, ఏపీలోని కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తుఫాన్ తీరం దాటిన తమిళనాడు రాష్ట్రంలో అయితే వర్ష బీభత్సం అలా ఇలా లేదు. కుండపోత వర్షాలతో రోడ్లు అన్నీ నదుల్లా మారాయి. ఏ రకంగా అంటే.. పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోతున్నాయి. వాహనాలు సురక్షితంగా ఉంటాయని భావించి.. జాతీయ రహదారులపై నిలిపిన కార్లు, బస్సులు, లారీలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. ఇప్పుడు ఆ విజువల్స్ ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. బంగాళఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ తమిళనాడుపై విరుచుకుపడింది. ఈ తుఫాన్ ప్రభావంతో దాదాపు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు తమిళనాడును ముంచెత్తాయి.
నగరంలోని పలు ప్రాంతాలు జలమయమై నదులను తలపించాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో జనజీవనం స్తంభించిపోయింది. కాలువులు, చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లడంతో జనాలు ఇంట్లో నుండి కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఫెంగల్ తుఫాన్ ప్రభావం ముఖ్యంగా తమిళనాడులోని విల్లుపురం, తిరువన్నామలై, ధర్మపురి జిల్లాలపై చూపించింది. ఫెంగల్ విజృంభణతో ఈ మూడు జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. కుండ పోత వర్షం ఈ మూడు జిల్లాల్లో జలప్రళయం సృష్టించింది.
ALSO READ | నవంబర్ నెలంతా డేంజర్లోనే ఢిల్లీ.. 2023 కన్నా ఈయేడు అధ్వానం
వరద నీరు రోడ్లపై నుండే ప్రవహిస్తుండటంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మూడు జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందంటే.. రోడ్డుపై నిలిపిన వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఇంటి బయట పార్క్ చేసిన కార్లు, టూ వీలర్స్ వరద ప్రహానికి కొట్టుకుపోతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తమిళనాడుపై ఫెంగల్ తుఫాన్ ఏ రేంజ్లో ప్రతాపం చూపించిందనేది. కార్లు, టూ వీలర్స్ వరదలో కొట్టుకుపోతున్న వీడియోలను చూసి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘జల ప్రళయం అంటే ఇదే’’ అని కొందరు.. భారీ వర్షాల ధాటికి నష్టపోయిన వారిని ఆదుకోవాలని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
తలకోన జలపాతం వద్ద ఆంక్షలు:
ఫెంగల్ తుఫాన్ తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ పైన ప్రభావం చూపించింది. ఈ తుఫాన్ ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలంలోని తలకోన జలపాతం వద్ద అధికారులు ఆంక్షలు విధించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో తలకోన జలపాతానికి నీటి ప్రవాహం పెరిగింది. వరద ఉధృతి పెరగడంతో జలపాతం వద్ద వారం పాటు ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముందస్తు చర్యలో భాగంగా ఆంక్షలు విధించినట్లు ఫారెస్ట్ అధికారులు చెప్పారు.
జల ప్రళయం అంటే ఇదీ: తమిళనాడులో బస్సులు కొట్టుపోతున్నాయి.. pic.twitter.com/9gVV7lf8bO
— DJ MANI VELALA (@MaNi_ChiNna_) December 2, 2024