- టూవీలర్లు 1.08 కోట్లు.. కార్లు 18.5 లక్షలు
- సగటున ఇద్దరికో వాహనం
- పబ్లిక్ ట్రాన్స్ పోర్టు కన్నా వ్యక్తిగత వాహనాలకే మొగ్గు చూపుతున్న జనం
- ‘గ్రేటర్’లో బండ్ల స్పీడ్ 50కి మించొద్దు
- డివైడర్ లేని రోడ్లలో 40 దాటొద్దు
- కాలనీల్లో స్పీడ్ 30 కి.మీ.లోపే ఉండాలె
- రవాణా శాఖ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బండ్లు భారీగా పెరిగిపోతున్నాయి. ఏటా లక్షలాది కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. రవాణా శాఖ లెక్కల ప్రకారం తెలంగాణ వచ్చినప్పుడు 84 లక్షల బండ్లు మాత్రమే ఉండగా, ఈ ఎనిమిదేండ్లలో దాదాపు డబుల్ అయ్యాయి. ఈ నెల 9 వరకు రాష్ట్రంలో 1,46,62,604 వాహనాలు ఉన్నాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 71,15,111 వెహికల్స్ ఉండగా, జిల్లాల్లో 75,47,493 ఉన్నాయి. మొత్తం వాహనాల్లో 1.08 కోట్ల టూవీలర్లు ఉండగా, 18.5 లక్షల కార్లు ఉన్నాయి. ఇంటికి రెండు, మూడు బండ్లు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల మంది జనాభా ఉండగా, బండ్ల సంఖ్య 1.46 కోట్లకు చేరిందంటే... సగటున ప్రతి ఇద్దరికో వాహనం ఉన్నట్టు లెక్క. పబ్లిక్ ట్రాన్స్ పోర్టు భారంగా మారడం, ఇతర కారణాలతో వ్యక్తిగత వాహనాలు కొనేందుకే జనం మొగ్గు చూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
పోయినేడు 4 కోట్ల ఆదాయం...
2020–21లో రాష్ట్రంలో 9 లక్షల వాహనాలు అమ్ముడవ్వగా, బండ్ల సంఖ్య 1.28 కోట్లకు చేరింది. 2021–22లో సేల్స్ దాదాపు డబుల్ అయ్యాయి. పోయినేడాదితో పాటు ఇప్పటివరకు ఏకంగా 18 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. దీంతో మొత్తం వాహనాల సంఖ్య 1.46 కోట్లకు చేరింది. వాహనాల అమ్మకాలు పెరుగుతున్నకొద్దీ సర్కారుకు ఆదాయం కూడా భారీగానే సమకూరుతోంది. లైఫ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు, సెకండ్ రిజిస్ట్రేషన్, క్వార్టర్లీ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, ఫిట్‌నెస్, సర్వీసు చార్జీలు తదితర ట్యాక్స్‌ల పేరుతో మస్తు ఆమ్దానీ వస్తోంది. 2020–-21 ఆర్థిక సంవత్సరంలో రూ.3,228 కోట్ల ఆదాయం రాగా, 2021–-22 ఆర్థిక సంవత్సరంలో రూ.3,971 కోట్ల ఆదాయం సమకూరింది. అంటే ఒక్క ఏడాదిలోనే రూ.743 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది. ఇక తాజాగా పెంచిన రేట్లతో ఆదాయం మరింత పెరగనుంది.
పొల్యుషన్, ట్రాఫిక్‌తో ఆందోళన..
బండ్లు పెరిగిపోతుండటంతో పొల్యుషన్, ట్రాఫిక్ కూడా పెరిగిపోతోంది. ఇది ఆందోళన కలిగించే విషయం. రోజు లక్షల బండ్లు నడుస్తుండటంతో గాలి, శబ్ద కాలుష్యం అధికమవుతోంది. ఇప్పటికే హైదరాబాద్ పొల్యూషన్‌తో అతలాకుతలమవుతోంది. గతంలో ఫ్యామిలీ ఉంటేనే కారు బయటకు తీయగా, ఇప్పుడు ఒక్కరున్నా కారులోనే వెళ్తున్నారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇట్లనే ఉంటే భవిష్యత్‌లో నగరం ఢిల్లీలా మారే ప్రమాదం లేకపోలేదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బండ్లు పెరగడానికి కారణాలేంటి?
రాష్ట్రంలో వాహనాల సంఖ్య పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ రోజురోజుకు విస్తరిస్తోంది. ఐటీతో పాటు అనేక కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో ఉద్యోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఐటీ బూమ్‌తో జీతాలు పెరగడంతో మిడిల్ క్లాస్ రేంజ్ కార్లను అధికంగా కొంటున్నారు. చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరూ జాబ్ చేస్తుండడంతో స్తోమత పెరిగింది. ఇక కరోనా సమయంలోని ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్టు భారంగా మారడంతో పాటు సొంత బండి ఉంటే బాగుంటుందనే భావనతో చాలామంది వాహనాలు కొంటున్నారు. వివిధ కంపెనీలు ఈజీగా లోన్లు ఇస్తుండటంతో చిరు ఉద్యోగులు కూడా బైకులు, కార్లు కొనేస్తున్నారు. ఇంకొందరు లగ్జరీ, ప్రెస్టేజ్కోసం ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని బండ్లు కొంటున్నారు. ఫుడ్ డెలివరీ, బైక్, క్యాబ్ సర్వీసులు పెరగడంతోనూ బండ్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇక సెకండ్ హ్యాండ్‌లో కూడా తక్కువ రేటుతో మంచి బండ్లు దొరుకుతున్నాయి.
‘గ్రేటర్’లో బండ్ల స్పీడ్ 50కి మించొద్దు
గ్రేటర్ హైదరాబాద్‌లో రోడ్లు, ప్రాంతాలను బట్టి వాహనాల స్పీడ్ లిమిట్‌ను ఫిక్స్ చేస్తూ బుధవారం రవాణా శాఖ సెక్రటరీ శ్రీనివాస రాజు జీవో రిలీజ్ చేశారు. ప్రజల సేఫ్టీ దృష్ట్యా స్పీడ్ లిమిట్ విధిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. డివైడర్ ఉన్న రోడ్లపై కార్లు గరిష్టంగా గంటకు 60 కి.మీ. స్పీడ్ మించొద్దని జీవోలో స్పష్టం చేశారు. గూడ్స్ వెహికల్స్, బస్సులు, త్రీ వీలర్స్, టూ వీలర్లకు మ్యాగ్జిమం స్పీడ్ ను 50 కి.మీ.గా నిర్ణయించారు. డివైడర్ లేని రోడ్లపై కార్లకు మ్యాగ్జిమం స్పీడ్ 50 కి.మీ., ఇతర వాహనాలకు 40 కి.మీ. దాటరాదని పేర్కొన్నారు. ఇక కాలనీల్లోని రోడ్లపై వెహికల్స్ గంటకు 30 కి.మీ.కి మించి వేగంగా వెళ్లొద్దని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
‘గూగుల్ ఇమేజెస్’ ను తలదన్నేలా ‘ఇమేజెన్’
కేటీఆర్ ఆర్డరేసినా నెమ్మదిగానే అభివృద్ధి పనులు
అప్పుల కోసం ఢిల్లీలో అధికారుల చక్కర్లు
బీటెక్ వాళ్లు కూడా సోషల్ సైన్స్ చదవొచ్చు