బండ్ల అమ్మకాలు డౌన్‌‌‌.. ఫిబ్రవరిలో పడిన కార్లు, టూవీలర్లు, ట్రాక్టర్లు, కమర్షియల్ వెహికల్స్‌‌‌‌ సేల్స్‌‌‌‌

బండ్ల అమ్మకాలు డౌన్‌‌‌.. ఫిబ్రవరిలో పడిన కార్లు, టూవీలర్లు, ట్రాక్టర్లు, కమర్షియల్ వెహికల్స్‌‌‌‌ సేల్స్‌‌‌‌
  • అమ్ముడైన మొత్తం బండ్లు 18,99,196.. ఏడాది లెక్కన 7 శాతం తక్కువ 
  • డిమాండ్ పడిపోయిందంటున్న డీలర్లు.. 
  • అయినా కంపెనీలు భారీగా స్టాక్‌‌‌‌ పంపుతున్నాయని వెల్లడి 

న్యూఢిల్లీ: డిమాండ్ పడిపోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో బండ్ల అమ్మకాలు తగ్గాయి. కార్లు, టూవీలర్లు, త్రీవీలర్లు..ఇలా అన్ని రకాల బండ్ల సేల్స్‌‌‌‌  ఏడాది లెక్కన 7 శాతం వరకు పడ్డాయని ఫెడరేషన్  ఆఫ్ ఆటోమొబైల్‌‌‌‌ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) ప్రకటించింది. కిందటి నెలలో  18,99,196 బండ్లు అమ్ముడయ్యాయి. కిందటేడాది ఫిబ్రవరిలో అమ్ముడైన 20,46,328 బండ్లతో పోలిస్తే 7 శాతం తగ్గాయి.  తమ అనుమతి లేకుండానే  కంపెనీలు స్టాక్‌‌‌‌ పంపుతున్నాయని డీలర్లు  ఆరోపిస్తున్నారు. 

కిందటి నెలలో 3,03,398  ప్యాసింజర్ బండ్ల (కార్లు, వ్యాన్‌‌‌‌లు వంటివి) అమ్మకాలు జరిగాయి. కిందటేడాది ఫిబ్రవరితో పోలిస్తే 10 శాతం తగ్గాయి. ‘మార్కెట్‌‌‌‌లో డిమాండ్ లేదని డీలర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్‌‌‌‌ బండ్లకు గిరాకీ లేదని తెలిపారు.  టార్గెట్లను చేరుకోలేక  వీరు ఒత్తిడికి గురవుతున్నారు.  డీలర్లకు భారీగా నిల్వలను పంపి వారిని మరింత ఒత్తిడికి కంపెనీలు గురి చేయకూడదు. అదే జరిగితే స్టాక్‌‌‌‌ను సరిగ్గా మేనేజ్ చేయలేరు’ అని ఫాడా ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొన్నారు. డీలర్ల దగ్గర సగటున 50 నుంచి  52 రోజులకు సరిపడా స్టాక్ ఉందని తెలిపారు.

గ్రామాల్లో కంటే పట్టణాల్లో సేల్స్ తక్కువ

ఫాడా డేటా ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరిలో 13,53,280 టూవీలర్లు అమ్ముడయ్యాయి. కిందటేడాది ఫిబ్రవరిలో అమ్ముడైన 14,44,674 బండ్లతో పోలిస్తే  ఇది 6 శాతం తక్కువ.  ఇన్వెంటరీ సరిగ్గా మేనేజ్ చేయలేకపోవడం, వినియోగం పడిపోవడం, ఎంక్వైరీలు కూడా తగ్గడం, ధరలను ఎడాపెడా మారుస్తుండడం వంటి కారణాలతో టూవీలర్ల సేల్స్ తగ్గాయని డీలర్లు చెబుతున్నారు. దీంతోపాటు లిక్విడిటీ, ఇన్‌‌‌‌ఫ్లేషన్ వంటి  సమస్యలు కూడా డీలర్లను వెంటాడుతున్నాయి. రూరల్‌‌‌‌ మార్కెట్లతో పోలిస్తే పట్టణాల్లో బండ్ల సేల్స్ ఎక్కువగా పడ్డాయి. 

కిందటేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో కమర్షియల్ వెహికల్ అమ్మకాలు 9  శాతం పడి 82,763 యూనిట్లకు దిగొచ్చాయి. ట్రాన్స్‌‌‌‌పోర్టేషన్ సెక్టార్ బలహీనంగా ఉండడం, వెహికల్ ఫైనాన్సింగ్ రూల్స్ కఠినంగా మారడం,  బండ్ల ధరలు మారడంతో కమర్షియల్ బండ్ల సేల్స్ పడిపోయాయి. ముఖ్యంగా బల్క్‌‌‌‌ ఆర్డర్లు తగ్గాయి. మరోవైపు ట్రాక్టర్ సేల్స్ అయితే ఏడాది లెక్కన 14.5 శాతం తగ్గి 65,574 యూనిట్లుగా రికార్డయ్యాయి.   

మార్చిలో బండ్ల అమ్మకాలు  ఊపందుకుంటున్నాయని ఫాడా అంచనా వేస్తోంది. హోలీ, గుడి పడ్వా  వంటి పండుగలు ఉండడంతో పాటు కంపెనీలు వివిధ ఆఫర్లను ప్రకటిస్తుండడంతో సేల్స్  పెరుగుతాయని తెలిపింది.  అయినప్పటికీ సమస్యలు లేకపోలేదు.  ప్రజలు డిస్క్రిషనరీ (అత్యవసరం కాని) ఖర్చులను తగ్గించుకోవడం  ఎక్కువైంది. దీంతో  బండ్లను కొనడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు.