కరీంనగర్: కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావేనని, దాంట్లో ఏమాత్రం కన్ఫ్యూజన్ అవసరం లేదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ఇవాళ డీసీసీ ఆఫీసులో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. మంచి రోజు ఉన్నందువల్లే తామంతా కలిసి నిన్న నామినేషన్ వేయించామన్నారు. అభ్యర్థిపై పార్టీ హైకమాండ్ నుంచి అతి త్వరలో ప్రకటన వస్తుందని చెప్పారు. కోడిగుడ్డుపై వెంట్రుకలు పీకవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు.మొదటి దశ ఓటింగ్ తర్వాత మోదీ వెన్నులో వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు. ‘మీ ఐపీఎల్ టీమ్ లో మీకు మోదీ ఒక్కడే లీడర్. మా టీమ్ ఇండియా కూటమి. మాకు పెద్ద టీం ఉంది’ అని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతుందన్న మోడీ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకోవాలన్నారు. పాంచ్ న్యాయ్, కులగణన వంటివి బీజేపీకి రుచించడం లేదని మండిపడ్డారు. బీజేపీ లీడర్లది ఫ్యూడల్ మెంటాలిటీ అని మండిపడ్డారు. దేవుని ఫొటోలు తప్ప.. మోడీ ఫొటోలతో బీజేపీ ప్రచారంచేయడం లేదన్నారు. మోడీ మతతత్వవాది అని, రాహుల్ గాంధీ మానవతా వాది అని అన్నారు.
ఉపాధి హామీ నిధులు కూడా తానే తెచ్చినట్లు బండి సంజయ్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. బండి సంజయ్ ఇంటర్మీడియట్, డిగ్రీ ఎక్కడ చదివారో చెప్పాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిని ఆస్పత్రి మీదుగా అలైన్ మెంట్ మార్చుకున్నారని వినోద్ కుమార్ పై ధ్వజమెత్తారు ఆయనతో సంజయ్ కుమ్ముక్కయ్యాడని ఆరోపించారు. కరీంనగర్ సీటును గెలువబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.