డైరెక్టర్​ పోస్ట్​ ఇవ్వలేదని తాతను హత్య చేసిండు

డైరెక్టర్​ పోస్ట్​ ఇవ్వలేదని తాతను హత్య చేసిండు

 

  •     మరో మనుమడికి అప్పజెప్పడంతో పగ
  •     డ్రగ్స్​కు బానిస కావడంతో నిందితుడికి పదవి అప్పజెప్పని జనార్దన్​రావు 
  •     బదులుగా రూ.4 కోట్ల షేర్ల బదలాయింపు 
  •     తల్లిపైనా విచక్షణారహితంగా దాడి.. చావుబతుకుల్లో బాధితురాలు
  •     పారిశ్రామికవేత్త హత్య కేసులో వాస్తవాలు వెలుగులోకి

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఆస్తి తగాదాల నేపథ్యం, తనను మరో మనుమడితో సమానంగా చూడడం లేదనే కోపంతో ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్‌‌  గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దనరావును ఆయన మనుమడు కీర్తి తేజ హత్య చేశాడు. తాత జనార్దన్​ రావు కంపెనీలో తనకు డైరెక్టర్​ పోస్టు​ ఇవ్వకపోవడంతో కోపం పెంచుకున్న కీర్తి తేజ​ఈ హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. శుక్రవారం రాత్రి సోమాజిగూడలో జనార్దనరావును ఆయన కూతురి కొడుకైన కీర్తి తేజ పలుమార్లు కత్తితో పొడిచి దారుణంగా చంపాడు. ఈ క్రమంలో అడ్డువచ్చిన తల్లి సరోజను కూడా అతను వదల్లేదు. ఆమెను కూడా విచక్షణారహితంగా పొడిచాడు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య ఉంది. 

ఈ కేసులో నిందితుడిని అరెస్ట్​ చేసిన పంజాగుట్ట పోలీసులు ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేశారు. కీర్తి తేజ అమెరికాలో ఉండేవాడు. ఎంఎస్ చేసి 2018లో హైదరాబాద్ కు వచ్చాడు. అమెరికాలో ఉండగానే డ్రగ్స్​కు అలవాటు పడ్డాడు. దీంతో అతడిని అక్కడి నుంచి తీసుకువచ్చిన తల్లి.. కొడుకును డ్రగ్స్​ అడిక్షన్ ​సెంటర్​లో చేర్పించి ట్రీట్​మెంట్​ ఇప్పించింది. ఇటీవలి కాలంలో అతని తాతకు చెందిన వెల్జాన్‌‌  గ్రూపు సంస్థల్లో డైరెక్టర్​ పోస్ట్ ​వ్యవహారం తెర మీదకు వచ్చింది. ఆ పోస్టు​ తనకు కావాలని కీర్తి తేజ తన తాత జనార్దన్​రావు వెంటపడ్డాడు. కానీ, అతని వ్యవహారం తెలిసిన తాత.. ఆ పోస్టును అతడికి ఇవ్వకుండా పెద్ద బిడ్డ కొడుకైన శ్రీకృష్ణకు అప్పజెప్పారు. కీర్తి తేజకు రూ.4 కోట్ల విలువైన షేర్లను ట్రాన్స్​ఫర్​ చేశారు. దీంతో తేజ.. తాతపై పగ పెంచుకున్నాడు. శుక్రవారం రాత్రి జనార్దన్​ ఇంటికి తల్లితో కలిసి వచ్చిన తేజ.. తాతతో వాగ్వాదానికి దిగాడు. తల్లి వంటింట్లోకి వెళ్లగా... హాల్​లో విశ్రాంతి తీసుకుంటున్న జనార్దన్​రావుపై తేజ కత్తితో పలుమార్లు దాడి చేశాడు. సుమారు 73 సార్లు కత్తితో పొడవడంతో అరుపులు విన్న అతడి తల్లి సరోజా పరిగెత్తుకు వచ్చింది. 

అడ్డుకునేందుకు యత్నించిన ఆమెపైనా తేజ 12 సార్లు పొడిచాడు. తల్లి, తాత అరుపులు విని సెక్యూరిటీతో పాటు చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. వారిని బెదిరించిన తేజ అక్కడి నుంచి పరారయ్యాడు.  పోలీసులకు ఫోన్​ చేయగా, వారు వచ్చేప్పటికి జనార్దన్​రావు చనిపోయాడు.  సరోజ తీవ్రంగా గాయపడగా, ఆమెను దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కీర్తి తేజను పోలీసులు శనివారం ఏలూరులో అరెస్టు చేశారు. అతనికి డ్రగ్స్ అలవాటు ఉందని తెలియడంతో అతని బ్లడ్  శాంపిల్స్  సేకరించారు. రిపోర్ట్  వచ్చాక డ్రగ్స్  తీసుకున్నాడా లేదా అనేదానిపై క్లారిటీ వస్తుందని పోలీసులు తెలిపారు.