
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014లోనే ఏపీ తన దోపిడీకి తెరదీసింది. కృష్ణా నీళ్లను ఏపీ అడ్డంగా దోచుకుపోతున్నది. 11 ఏండ్లలో కరువు సంవత్సరాలు సహా ఏటా కోటాకు మించి నీటిని తోడేసుకున్నది. తెలంగాణకు మాత్రం ఏ ఒక్క సంవత్సరంలో కూడా కేటాయించిన కోటా దక్కలేదు. ఇందుకు సంబంధించి పక్కా ఆధారాలను రాష్ట్ర అధికారులు సేకరించారు. ఏ ఏడాది.. ఎవరెవరు, ఎంతెంత కృష్ణా జలాలు వాడుకున్నారో లెక్కలు తీశారు. 2014 నుంచి ఇప్పటి వరకు 11 ఏండ్లలో ఏపీ జలదోపిడీ ఏ స్థాయిలో జరిగిందో చెప్పేలా ఈ గణాంకాలు ఉన్నాయి.
వాస్తవానికి ఏపీ కోటా ప్రకారం 512 టీఎంసీల నీళ్లే వాడుకోవాల్సి ఉన్నా.. తొలి ఏడాదిలో ఆ రాష్ట్రం 529.33 టీఎంసీలను తోడుకున్నది. అంటే అదనంగా 17 టీఎంసీలను తీసుకెళ్లింది. అదే తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులున్నా.. వచ్చిన నీళ్లు మాత్రం 227.74 టీఎంసీలే. అంటే 71 టీఎంసీలు తక్కువగానే తెలంగాణ వాడుకున్నది. అయితే, 2015 నుంచి 2018 వరకు కృష్ణా నదికి సరైన వరదలు లేకపోవడం, నీటి లభ్యత తక్కువగా ఉన్న కారణాలతో నీటి కేటాయింపులను తగ్గించినా.. ఆ కేటాయించిన నీటికి మించి ఏపీ వాడుకుంది.
2015, 2016 సంవత్సరాలకుగానూ 63 శాతం నీళ్లను ఏపీకి కేటాయించగా.. వరుసగా 64 శాతం, 65 శాతం చొప్పున దండుకపోయింది. 2017, 2018 సంవత్సరాలకుగానూ 66 శాతం ఆ రాష్ట్రానికి కేటాయిస్తే.. 2017లో కోటా వరకే తీసుకున్నా, 2018లో మాత్రం 67.3 శాతం తోడేసింది. 2019, 2020, 2021, 2022, 2024లో మాత్రం దొరికిందే తడువుగా ఏపీ నీళ్లను తోడుకున్నది. ఆయా సంవత్సరాల్లో ఏపీ వాడుకున్న నీళ్ల వాటా 600 టీఎంసీలు దాటిపోవడం గమనార్హం.
2022లో అత్యధికంగా 681 టీఎంసీలను ఏపీ తరలించుకెళ్లింది. ఆ ఏడాది తెలంగాణ వాడుకున్నది 277 టీఎంసీలే. మొత్తంగా ఆ ఏడాది గంపగుత్తగా కేటాయించిన 811 టీఎంసీలకు మించి 959 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. ఏపీ తనకు కేటాయించిన 512 టీఎంసీల కన్నా అదనంగా 2019లో 141 టీఎంసీలు (70%), 2020లో 117 (72%), 2021లో 110 (70%), 2022లో 169 టీఎంసీల (71%) చొప్పున ఎక్కువ నీటిని మళ్లించుకున్నది. ఈ ఏడాది ఇప్పటివరకు 134 టీఎంసీలను దోచేసింది.