ఎక్కడ కాల్చాలే పూడ్చాలే.. కొండపోచమ్మ, మల్లన్నసాగర్‌‌‌‌ నిర్వాసితుల కాలనీల్లో.. కనిపించని శ్మశానవాటికలు

ఎక్కడ కాల్చాలే పూడ్చాలే.. కొండపోచమ్మ, మల్లన్నసాగర్‌‌‌‌ నిర్వాసితుల కాలనీల్లో.. కనిపించని శ్మశానవాటికలు
  • తాత్కాలిక స్థలాల్లో దహన సంస్కారాలు.. అభ్యంతరం చెబుతున్న స్థానికులు
  • డెడ్‌‌‌‌బాడీల పూడ్చివేతకు కనిపించని స్థలం
  • లీడర్లు, ఆఫీసర్ల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం

సిద్దిపేట, వెలుగు: కుటుంబ సభ్యులెవరైనా చనిపోతే అంత్యక్రియలు ఎక్కడ చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు మల్లన్నసాగర్‌‌‌‌, కొండపోచమ్మ సాగర్‌‌‌‌ నిర్వాసితులు. ప్రాజెక్టుల కోసం సర్వం ఇచ్చిన వీరి కోసం ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ కాలనీలను నిర్మించిన గత ప్రభుత్వం కనీస వసతులు కల్పించడాన్ని మాత్రం విస్మరించింది. వందలాది మంది ఉంటున్న ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ కాలనీల కోసం శ్మశానవాటికలు ఏర్పాటు చేయకపోవడంతో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేసందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని కనిపించిన ప్రతీ ఆఫీసర్‌‌‌‌ను అడుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.

అంత్యక్రియలకు అరిగోస
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మల్లన్నసాగర్‌‌‌‌తో వేములఘాట్‌‌‌‌, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, పల్లెపహాడ్, బంజేరుపల్లి, ఎర్రవల్లి, సింగారంతో పాటు వాటి మధిర గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దీంతో ముట్రాజ్‌‌‌‌పల్లి వద్ద ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ కాలనీని నిర్మించగా, ఇక్కడ సుమారు 5300 ఫ్యామిలీలు నివాసం ఉంటున్నాయి. అలాగే ములుగు మండలంలో కొండ పోచమ్మ సాగర్‌‌‌‌ నిర్మాణంతో బైలంపూర్, తానేదార్‌‌‌‌పల్లి, మామిడ్యాల, తండా గ్రామాలు ముంపునకు గురికాగా వీరి కోసం తునికి బొల్లారంలో ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ కాలనీని నిర్మించారు. ఇక్కడ 1,350 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇండ్ల నిర్మాణంతో పాటు రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌‌‌‌ సౌకర్యం కల్పించిన ఆఫీసర్లు శ్మశానవాటిక ఏర్పాటును మాత్రం పట్టించుకోలేదు. దీంతో కాలనీల్లో ఉంటున్న వారు ఎవరైనా చనిపోతే అందుబాటులో ఉన్న స్థలాల్లోనే దహన కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. 

అందుబాటులోని స్థలాల్లో అంత్యక్రియలు.. అభ్యంతరం చెబుతున్న స్థానికులు
ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ కాలనీల్లో ప్రత్యేకంగా శ్మశానవాటికలు లేకపోవడంతో అందుబాటులో ఉన్న స్థలాల్లోనే అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు. మల్లన్నసాగర్‌‌‌‌ నిర్వాసితులు ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ కాలనీ పక్కన డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూం ఇండ్ల సమీపంలోని ఖాళీ స్థలంలో దహన సంస్కారాలు చేస్తుండగా, కొండ పోచమ్మ సాగర్‌‌‌‌ నిర్వాసితులు కాలనీ సమీపంలోని వంటిమామిడి నుంచి తునికి బొల్లారం రోడ్డులోని ప్రభుత్వ స్థలంలో కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. అయితే స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తుండడంతో ఎప్పటికప్పుడు నచ్చజెప్పుకుంటూ కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు. 

పూడ్చడానికి తప్పని తిప్పలు
తాత్కాలిక స్థలాల్లో ఎలాగోలా దహన కార్యక్రమాలు పూర్తి చేస్తున్నా... సంప్రదాయం ప్రకారం పూడ్చివేతకు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హిందువుల్లోని కొన్ని వర్గాలతో పాటు ముస్లిం, క్రిస్టియన్లు డెడ్‌‌‌‌బాడీని పూడ్చి పెట్టేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ముట్రాజ్‌‌‌‌పల్లి వద్ద గల మల్లన్నసాగర్‌‌‌‌ ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ కాలనీకి చెందిన మైనార్టీలు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఇప్పటికి పలుమార్లు ఇలాంటి సమస్యలు ఏర్పడడంతో స్థానికులను బతిమాలి సంగాపూర్, గజ్వేల్‌‌‌‌ పట్టణాల శ్మశానవాటికల్లో డెడ్‌‌‌‌బాడీలను పూడ్చివేశారు.

ఇటీవల ఇదే సమస్య ఏర్పడడంతో డెడ్‌‌‌‌బాడీతో ఆర్డీవో కార్యాలం వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు. కొండ పోచమ్మ సాగర్‌‌‌‌ ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ కాలనీలో ఇటీవల ఓ బాలుడు చనిపోగా ఖననం చేసే విషయంలో పెద్ద గొడవ జరిగింది. తాత్కాలికంగా దహన సంస్కారాలు చేస్తున్న ప్రదేశంలో శవాన్ని పూడ్చి పెట్టే ప్రయత్నం చేయడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

పట్టించుకోని లీడర్లు
నిర్వాసితుల కోసం ఎక్కడా లేని విధంగా ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ కాలనీని నిర్మించామని గొప్పలు చెప్పిన గత ప్రభుత్వ నేతలు శ్మశానవాటిక సమస్యను మాత్రం పట్టించుకోలేదు. ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ కాలనీల్లో ప్రజలు నాలుగేండ్లుగా నివాసం ఉంటున్నా ఇప్పటివరకు కూడా ప్రత్యేకంగా శ్మశానవాటికలు ఏర్పాటు కాలేదు. నిర్వాసితుల సమస్యలపై రివ్యూలు నిర్వహిస్తున్న ఆఫీసర్లు పరిష్కారం మాత్రం చూపడం లేదు. శ్మశానవాటిక కోసం స్థలం కేటాయించాలని ఆఫీసర్లు, లీడర్ల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.