‘మిథ్యా వలయం’లో కేసీఆర్​!

‘మిథ్యా వలయం’లో కేసీఆర్​!

కేసీఆర్‌‌‌‌కు జాతకాలు, యజ్ఞాలు, యాగాలు అంటే విపరీతమైన పిచ్చి. ఆయనకు గ్రహాలు అక్టోబర్ నుంచి అనుకూలంగా మారతాయని బీఆర్ఎస్ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది.  కేసీఆర్‌‌‌‌ ప్రస్తుత దుస్థితికి తానే కారణం తప్ప జాతకాలు,  గ్రహాలూ కాదన్న వాస్తవాన్ని ఒప్పుకోవడానికి ఆయన సిద్ధంగా లేరు. అధికారంలో ఉన్నకాలంలో అలవికాని విధంగా రాజరికంగా ప్రవర్తించిన కేసీఆర్‌‌‌‌ కుటుంబంపై తెలంగాణలో సానుభూతి చూపించేవారు లేరు. అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల ఫలితాలు కేసీఆర్‌‌‌‌ కుటుంబ ఆధిపత్యానికి ప్రతిఘటనగా భావించడానికి బీఆర్ఎస్ నాయకత్వం ఎప్పుడూ సిద్ధంగా లేదు.

కోల్పోయిన ప్రజాభిమానాన్ని తిరిగి పొందడం ఎలా? అనే అంశంపై దృష్టిపెట్టకుండా ‘కాంగ్రెస్‌‌‌‌‌‌ ప్రభుత్వాన్ని పడగొట్టడం ఎలా’ అన్న  ఆలోచనలతో  కేసీఆర్  సతమతమవుతుండడం ఆశ్చర్యాన్ని  కలిగిస్తుంది. అధికారం కోల్పోయిన పార్టీలు తిరిగి బట్టకట్టడం చాలా కష్టం. ఏపీ సీఎం  చంద్రబాబు ఇటువంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. పార్టీని ఎట్లా కాపాడుకోవాలన్న అంశంతోనే ఆయన ఒక యంత్రం వలె  అహర్నిశలు పనిచేశారు.2004 నుంచి 2014, 2019 నుంచి 2024 వరకు పదిహేనేండ్లు  అధికారానికి దూరమయినా మళ్ళీ ‘ప్రజాభిమానం’ కూడగట్టుకొని అధికారంలోకి వచ్చారు.

కార్యకర్తలను ఏనాడూ విశ్వాసంలోకి తీసుకోలే
కార్యకర్తలను నిర్లక్ష్యం చేసిన పార్టీలు కాలగర్భంలో కలిసిపోక తప్పదని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఒకసారి ఒక ప్రతిష్టను సంపాదించుకున్న అనంతరం దాన్ని అలాగే నిలుపుకోవడం కోసం చాలా పరిశ్రమ చెయ్యాలి. అంతే తప్ప ‘ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు నమ్మి తమను దూరం చేసుకున్నారని, అందుకు వారు అనుభవిస్తున్నార’ని కేసీఆర్, ఆయన బృందం మాట్లాడుతున్నారంటే ‘ప్రజలదే తప్పు’ అని నిజనిర్ధారణ చేస్తున్నట్టు లెక్క.  అధికారం తమకు శాశ్వతమని ‘రాజు, యువరాజు’లా వ్యవహరించిన ‘తండ్రీ,-కొడుకు’ అనుకున్నందుకే  తప్పు ప్రజల మీదకు నెట్టివేస్తున్నారు.

పొగరు ఫలితం!
‘విజయగర్వంతో తలకెక్కే పొగరు’  కేసీఆర్,  ఆయన కుటుంబసభ్యుల్లో టన్నుల కొద్దీ ఉన్నది. 2014 తర్వాతే ఈ జాడ్యం ఆ కుటుంబంలో, ఆ సామాజికవర్గంలో విస్తరించింది. ప్రత్యర్థులను దూషించడం, అవమానించడం ఈ పొగరు లక్షణమే.  ‘విజయానికి సంబంధించిన మిథ్య మనుషుల మనసును ఆక్రమిస్తుంది. అప్పుడు వాళ్ళు హద్దూ, పద్దూ లేకుండా ప్రవర్తిస్తారు. ఇంకా మెరుగైన ఫలితం అందుకుంటామన్న అపోహతో అసలు ఉన్న అధికారాన్ని పోగొట్టుకుంటారు’ అని సుప్రసిద్ధ తత్వవేత్త నికోలో మాకియవెలి (1469–-1527)  అన్నాడు.  తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వాటా తప్ప, మరెవరి వాటా లేదనుకోవడం, టీఆర్ఎస్ ఒక్కటే తెలంగాణ ఇంటిపార్టీ అనుకోవడం, తనకు మద్దతివ్వని వాళ్ళంతా తెలంగాణ ద్రోహులంటూ ముద్రవేయడం..
కేసీఆర్​కు తలకెక్కిన పొగరు ఫలితమే.

ఆత్మవిమర్శలేదు
కాంగ్రెస్​ను విమర్శించిన సందర్భాలలో ‘దద్దమ్మలు,చేతగానివాళ్ళు, తెలివి తక్కువ వ్యక్తులు’ అని కేసీఆర్ అన్నారు. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు,  వైఎస్.రాజశేఖరరెడ్డి,  జగన్ సహా ఎవరికీ లేనంత జ్ఞానం తనకుందని ఆయన నమ్మకం. ఇక రేవంత్ రెడ్డిని అసలు లెక్కలోకి తీసుకోదలచుకోలేదన్న ధోరణి కూడా కేసీఆర్​లో కనబడుతుంది.

కేసీఆర్ను మర్చిపోయే అవకాశాలు
తనకంటే ‘రణతంత్రపుటెత్తుగడల్లో’ రేవంత్ రెడ్డి చాలా ముందున్నట్టు పసిగట్టిన తర్వాతైనా ఆయనలో మార్పు వచ్చిందో, రాలేదో తెలియదు.  కేసీఆర్.. కొండా లక్ష్మణ్ బాపూజీ, చాకలి ఐలమ్మ వంటి త్యాగధనులను ఉద్దేశపూర్వకంగా విస్మరించినట్టు భావించాలి. మరి రేవంత్ రెడ్డి అలాంటివారికి  పట్టం గట్టి తెలంగాణ ప్రజల్లో ‘కొత్త ఆశ’ను చిగురింపజేశారు. దీంతో తెలంగాణ వాదుల్లో కేసీఆర్ ‘నామస్మరణ’ క్రమంగా సన్నగిల్లుతున్నది.   పరిస్థితులు, పరిణామాలు ఇలాగే కొనసాగితే  కేసీఆర్​ను ప్రజలు మరిచిపోయే అవకాశాలు ఎక్కువ.

స్కిల్ వర్సిటీ వంటి వాటితో రేవంత్​ గ్రాఫ్​ 

‘హైడ్రా’ వంటి సంస్థను ఏర్పాటు చేసి ధ్వంసమైన తెలంగాణ ప్రకృతి, జల వనరులను రక్షించాలన్న ఆలోచన కేసీఆర్​కు ఎందుకు రాలేదు? తెలంగాణ నిరుద్యోగ యువత కోసం ‘స్కిల్ యూనివర్సిటీ’ ఏర్పాటు చేయడానికి ఎందుకు సంకల్పించలేదు?  సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలన్నీ తెలంగాణవాదులు సొంతం చేసుకునేలా ఉన్నవి. దీంతో  తెలంగాణ ప్రజానీకంలో ‘రేవంత్ గ్రాఫ్’ ఇంకా పెరిగినట్టు ఒక అంచనా

తమను తాము మోసగించుకోవడమే!
చంద్రబాబు స్కూల్ నుంచే వచ్చినా కేసీఆర్‘స్టైల్​’ వేరు. ఆయన తనను తాను మభ్య పెట్టుకుంటారు. సూటిగా చెప్పాలంటే తనను తాను ‘మోసగించుకుంటారు’. ప్రజలు తనను ఎందుకు తిరస్కరించారో గుర్తించడానికి పది నెలల తర్వాత కూడా కేసీఆర్‌‌‌‌‌‌‌‌ సిద్ధంగా లేరు. ప్రజలు తన పాలన రావాలని కోరుకుంటున్నట్టు కేసీఆర్, ఆయన ‘చిడతల బ్యాచ్’ భావిస్తున్నారు.

నైతిక హక్కు ఎక్కడిది? 
ఓపార్టీ తరఫున గెలిచి మరోపార్టీలో చేరినోళ్లను‘చీరి చింతకు కట్టాల’ని నిప్పులు చెరిగిన కేసీఆర్ 2014 తర్వాత ఫిరాయింపులకు తెరలేపి ‘కళంకితుడు’గా మారారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను ‘అనర్హులు’గా ప్రకటించాలని ఇటు శాసనసభ స్పీకర్ దగ్గర, న్యాయస్థానాల్లో గగ్గోలు పెట్టే నైతిక హక్కు కేసీఆర్ పార్టీకి ఎక్కడిది?  ఇకనైనా కేసీఆర్​ తనను తాను ప్రశ్నించుకుని ప్రజాతీర్పును  గౌరవించాలి.

ఫాల్స్​ ప్రెస్టేజ్​లో కేసీఆర్
‘రెండు నెలల తర్వాత అధికారంలోకి వస్తాం. ముఖ్యమంత్రి పదవిపై నాకెలాంటి ఆశ లేదు. ఎవరో ఒకరవుతారు. నేను మార్గదర్శిగా ఉంటా.  రేవంత్‌‌‌‌ రెడ్డి ప్రభుత్వం ఉండదు. కాంగ్రెస్‌‌‌‌ ఎమ్మెల్యేలు మనతో టచ్‌‌‌‌లో ఉన్నారు. బీజేపీ కీలక నాయకులతో టచ్‌‌‌‌లో ఉన్నాం’! అని మాజీ సీఎం కేసీఆర్ ఖమ్మం, వరంగల్, నల్లగొండ బీఆర్ఎస్ నాయకులతో అన్నారు. ‘ఇంతకంటే ఎక్కువ చెప్పను. రహస్యాలు లీక్ అవుతాయి’ అని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా ఒక ఆడియో సంభాషణను కేసీఆర్ తమ పార్టీ నాయకులకు వినిపించారు. అందులో ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌ రెడ్డిని కించపరిచేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు మాట్లాడిన విషయాలు ఆ సంభాషణల్లో ఉన్నవి. ఆ టేపుల ‘కాలమానం’ మాత్రం కేసీఆర్ చెప్పలేదు. తెలంగాణలో కట్టుకథలు, పిట్టకథలతో కాలక్షేపం చేయడం కేసీఆర్​కు వెన్నతో పెట్టిన విద్య.  కేసీఆర్​కు ‘ఫాల్స్ ప్రెస్టేజ్’ ఎక్కువ.  పదవీవి యోగంతో ఆయన స్థిమితంగా కూర్చోలేకపోతున్నారు. నిలబడలేకపోతున్నారు. రేవంత్ ప్రభుత్వం ఇప్పటికయితే ‘దుర్భేద్యం’గా ఉన్నది.  పార్టీ లోపల, వెలుపలా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంటున్నారు.

ఎత్తుకు పై ఎత్తులో రేవంత్​
కాంగ్రెస్‌‌‌‌ అధికారంలో ఉండగా ఆ పార్టీ నుంచి వలసలను ఆశించడం కేసీఆర్ కల. మంత్రులు, శాసనసభ్యులు ఆ పార్టీ నుంచి వెలుపలికి వెడితే ఆత్మహత్యాసదృశ్యం అని వారికి తెలుసు. బీఆర్ఎస్ పార్టీ పనయిపోయిందనుకుంటున్న వారు ఆ పార్టీలోనే  కనిపిస్తున్నారు. అధికారం కోల్పోయినా ఆ పార్టీ ఇంకా కేసీఆర్, కేటీఆర్ నియంత్రణలో ఉండడం నష్టం కలిగిస్తోందని కొందరు అంటున్నారు.  కేసీఆర్ ఎత్తులకు పైఎత్తులు వేసే నాయకత్వం కాంగ్రెస్​కు ఇంతకాలానికి లభించిందని పార్టీ శ్రేణులు భావిస్తున్నవి. పార్టీ హైకమాండ్ కూడా సంతృప్తికరంగా ఉంది. పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ కు ‘డిస్టింక్షన్’ మార్కులు వచ్చాయి. పాలనలో పాస్ మార్కులు ఎప్పుడో వచ్చేశాయి. ఇదిలా ఉండగా సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి ఇక పాలన మీద మరింత దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు కనబడుతున్నది. ‘ఫ్యూచర్ సిటీ’, మూసీ సుందరీకరణ వంటి కార్యక్రమాలతో హైదరాబాద్ మహానగర ప్రజల్ని ఆకట్టుకునే పనిలో ఉన్నారు.

ఎస్.కే.జకీర్, సీనియర్​ జర్నలిస్ట్