‘గుడిసెల వెంకటస్వామి’ అలియాస్ కాకా తెలుగు ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. చిన్న వయసులోనే భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న మహానాయకుల మాటలు వింటూ అనేక ఉద్యమాల్లో పాల్గొన్న నిస్వార్థ నేత. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాల్లోనూ నిర్విరామంగా తన తుది శ్వాస వరకు ఉద్యమాలే ఊపిరిగా పోరాడిన యోధుడు. నిజాం నియంత పాలనలో, భూస్వాముల, జమీందారుల, రజాకార్ల అణచివేతలను ధిక్కరించిన ధైర్యశాలి. నిరుపేదల పక్షాన నిలిచి కార్మిక, శ్రామిక, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అనుక్షణం పోరాడిన నాయకుడు. అన్యాయం ఎక్కడున్నా వ్యతిరేకించాడు, అణచివేతలకు ఎదురుతిరిగాడు. ప్రజా ఉద్యమాలలో, రాజకీయ ఉద్యమాలలో తనదైన పద్ధతిలో తన ధిక్కారపు స్వరాన్ని వినిపిస్తూ పోరాటం చేశాడు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అలుపెరుగని నిస్వార్థ రాజకీయ నాయకుడిగా చట్టసభల్లోనూ గరిబోళ్ళ గాథలను గళమెత్తి నినదించిన మహానేత. జీవితమంతా ప్రజా స్వామ్యవాదిగా ఉన్నాడు. గూడు లేని పేదల గోడు వింటూ నీడలేని బీదలకు తోడుగా పోరు దండును నడిపిన పోరాటాల పొత్తిలి, నిరుపేదల నిస్వార్థ నాయకుడు కాకా.
ఆర్య సమాజ్ పాఠశాలలో విద్యాభ్యాసం
కాకా 1929 అక్టోబర్ 5న నాటి నిజాం సంస్థానంలోని హైదరాబాద్ నగరంలో ఉన్న తోపుఖాన ప్రాంతంలో పుట్టారు. కాకా తండ్రి నిజాం సైన్యంలో జవానుగా పనిచేసేవాడు. పేరుకు నిజాం దగ్గర కొలువు చేసినప్పటికీ జీతం చాలా తక్కువగా వచ్చేది. దాంతో కుటుంబ పోషణ కోసం తల్లి కూడా కూలి పనులు చేస్తుండేది. ఆది హిందూ పోరాట చైతన్యానికి కారణమైన దక్కన్ వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ. మేము పంచములం కాదు ఆది హిందువులమంటూ అంబేద్కర్ కంటే ముందే దళితుల కోసం పోరాడిన మహానుభావుడు. చదువుకుంటే సామాజిక హోదా దక్కుతుందన్న ఆయన మాటల్ని నమ్మిన కాకా తండ్రి పిల్లలను చదివించాలనుకున్నాడు. హైదరాబాద్ సంస్థానంలో అధికార భాష ఉర్దూ కావడంతో సర్కార్ బడుల్లో సైతం ఉర్దూ మీడియంలోనే చదువు చెప్పేవారు. ఆర్య సమాజ్ మాత్రం తెలుగు మీడియం పాఠశాలలను ప్రారంభించింది. దాంతో కాకాను మొదట ఆర్య సమాజ్ పాఠశాలకు పంపించాడు. అక్కడే ఐదో తరగతి వరకు చదివాడు. అక్కడ పాఠాలతో పాటు జాతీయ భావాలు, స్వాతంత్ర్య ఉద్యమం పాఠాలు కూడా చెప్పేవాళ్ళు. దాంతో కాకాలో జాతీయవాదంతోపాటు సామాజిక అవగాహనకు బీజం పడింది.
అసమాన గుండె ధైర్యం
1946 మొదట్లో హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ప్లేగు వ్యాధి వ్యాపించింది. అనేకమంది అనారోగ్యం పాలయ్యారు. కాకా తండ్రి మల్లయ్యకు కూడా ప్లేగు వ్యాధి సోకడంతో కోలుకోలేక చనిపోయాడు. దాంతో కాకా తనకున్న పెద్ద ధైర్యాన్ని కోల్పోయాడు. తండ్రి లేకపోవడంతో కుటుంబ బాధ్యతలను కాకా మోయక తప్పలేదు. అలా పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరం అవ్వాల్సి వచ్చింది. నిజాం సైన్యంలో పనిచేస్తూ తెరమీదికి వచ్చిన ఖాశిం రజ్వీ విముక్తి పోరాటాన్ని అణచివేసే బాధ్యత తీసుకొన్నాడు. ఓ ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసి దానికి ‘రజాకార్’ అని పేరు పెట్టాడు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆత్మరక్షణ కోసం ఆయుధాలు కావాలని నిర్ణయించుకున్నారు. అహింసా మార్గంలో పోరాడుతున్న కాంగ్రెస్ ముఖ్య నాయకులకు తెలియకుండా విజయవాడ నుంచి ఆయుధాలను తెప్పించి గడ్డిమల్లారంలో దాచి పెట్టారు. అయితే, అప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలపై నిజాం పోలీసులు, రజాకార్లు నిఘా పెట్టడంతో దాచిన ఆయుధాలను తెచ్చి కార్యకర్తలకు పంచే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు. కాకా మాత్రం ప్రాణాలకు తెగించి పోలీసులు, రజాకార్ల కండ్లుకప్పి ఆయుధాలను తీసుకొచ్చాడు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయుధాలను పంచి పెట్టాడు. అప్పటికే కాకాను చంపాలని కక్షగట్టిన కొంతమంది రెడ్లు రజాకార్లతో కలిసి అదును కోసం ఎదురుచూస్తూ ఓ రాత్రి చంపాలని పన్నాగం పన్నారు. తన చుట్టూ ఎప్పుడూ అనుచరులు ఉండడంతో సమాచారం అందుకున్న కాకా కుటుంబ సభ్యులతో కలిసి జాగ్రత్త పడటంతో ప్రాణ గండం తప్పింది.
జైల్లో కాకా..స్వాతంత్ర్య ప్రకటన
1947 ఆగస్టు ప్రారంభంలో సుల్తాన్ బజార్లో సత్యాగ్రహ దీక్ష చేస్తున్న కాకా, కాంగ్రెస్ నాయకులపై పోలీసులు దాడి చేసి విపరీతంగా లాఠీలతో కొట్టారు. వారిని అరెస్టు చేసి చంచల్ గూడ జైల్లో పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రామానంద తీర్థతో పాటు మరికొంత మందినీ అదే జైల్లో ఉంచారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ, హైదరాబాద్ సంస్థానంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. హైదరాబాద్ ను పాకిస్తాన్ లో కలపాలనుకున్నట్టు కొంతమంది చెప్పారు. కానీ, నిజాం రాజు ఎప్పుడూ అలా అనుకోలేదని స్వతంత్ర దేశంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నాడని కాకా రాసిన ‘మేరా సఫర్’ బుక్ లో తెలిపారు. నిజాం ఆలోచనలు ఇలా ఉండగా వల్లభాయ్ పటేల్ మరో తీరుగా ఆలోచించి హైదరాబాద్ లో ఉద్యమాన్ని స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తీవ్రం చేశారు. భారత్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సత్యాగ్రహాలు, దీక్షలు, నిరసనలు చేస్తుండగా నిజాం సంస్థానంలో రజాకార్లు రెచ్చిపోవడంతో పల్లెల్లో సాయుధ పోరు, హైదరాబాద్‌లో విముక్తి పోరు జరిగాయి. 1948 లో తెలంగాణ పల్లెలతో పాటు హైదరాబాద్ పరిస్థితులు తీవ్రంగా మారినాయి. 1948 సెప్టెంబర్ 13న పోలీస్ యాక్షన్ మొదలైంది. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది.
పేదలపై భూస్వాముల దౌర్జన్యం
హైదరాబాద్‌లో పోలీస్ యాక్షన్ తరువాత భూముల విలువ బాగా పెరగడంతో అమ్మకాలు కూడా పెరిగాయి. దాంతో పేదలు గుడిసెలు వేసుకున్న స్థలాలను భూస్వాములు దౌర్జన్యంగా ఖాళీ చేయించడం ప్రారంభించారు. అప్పుడు గుడిసెల వాసులకు, భూస్వాములకు మధ్య గొడవలు మొదలయ్యాయి. వాళ్లంతా హిమాయత్ నగర్లో ఉన్న ఖాళీ స్థలాల్లో గుడిసెలు వేసుకున్నారు. అవి భూస్వాములవి. వాటిని ఖాళీ చేయించడం కోసం గూండాలను పంపించి దౌర్జన్యం చేయిస్తూ రక్తాలు వచ్చేలా కొట్టించారు. ఇంట్లోని వస్తువులను బయటకు విసిరేసి గుడిసెలు కూల్చేశారు. ఆ దారుణాన్ని పోలీసులు, అధికారులు ఎవరూ కూడా పట్టించుకునేవారు కాదు. అప్పటికే కాంగ్రెస్ నాయకుడిగా హైదరాబాద్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కాకా వద్దకు పేదలు వచ్చి మాకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డారు. కాకా వాళ్ళను తీసుకొని వారి గుడిసెలు ఉన్న హిమాయత్ నగర్ కు వెళ్లి చూడగా కట్టుబట్టలు తప్ప అన్నీ నాశనం. అర్ధాంతరంగా నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలను, గుక్కపెట్టి ఏడుస్తున్న పసిపిల్లలను చూసి చలించిపోయిన కాకా ‘వాళ్ళు మిమ్మల్ని కొడుతుంటే మీరేం చేస్తున్నారు. మీకు ధైర్యం లేదా? బానిసలుగా తల దించుకుని బతికినంత కాలం, తన్నులు తినటానికి పుట్టినట్టు., ఎదురు తిరుగలేక భరించినంత కాలం బలమున్నొడు పేదవాడిని కొడుతూనే ఉంటాడు’ అని ఎదురు తిరగాలని ధైర్యం చెప్పి అండగా నిలబడ్డాడు. దాంతో పేదలు తమపై దాడిచేసినవారిపై ఎదురు దాడికి దిగి దొరికినవాడిని దొరికినట్టు తరిమి కొట్టారు. అప్పట్లో ఆ తిరుగుబాటు పెను సంచలనం సృష్టించింది. వాళ్లకు అండగా ఉన్న కాకాను డబ్బు ఆశతో లొంగదీసుకోవాలని ప్రయత్నం చేసినా నిస్వార్థంగా తిరస్కరించాడు. భూస్వాములు తమ వందల ఎకరాల భూములు కోల్పోతామనే భయంతో కాకా వద్దకు రావడంతో మొత్తం భూమిలో సగం భూమిని పేదల గుడిసెల కోసం ఇస్తున్నట్లు పత్రం రాపించి పేదలకిచ్చాడు.
లంబాడోళ్లకు అండగా కాకా
నేడు బడా బాబులున్న బంజారాహిల్స్ నాడు బంజారా బిడ్డలు (లంబాడోళ్లు) ఉన్న తండా. భూమి విలువ పెరగడంతో ప్రభుత్వం వాళ్లను అక్కడి నుంచి ఖాళీ చేయించాలని ప్రయత్నం చేసింది. అది తెలుసుకున్న కాకా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశాడు. కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడంతో ప్రభుత్వం చర్చలకు దిగివచ్చింది. ప్రత్యామ్నాయం చూపించాలని కాకా అధికారులను నిలదీయడంతో కొందరికి కేబీఆర్ పార్క్ దగ్గర, కొందరికి చిరాన్ ప్యాలెస్ దగ్గర స్థలం కేటాయించారు. నారాయణ గూడలో దీపక్ థియేటర్ ఎదురుగా అప్పట్లో చాలామంది గుడిసెలు వేసుకొని 25 సంవత్సరాలుగా అక్కడే ఉండేవారు. ఆ స్థలం పెద్ద భూస్వామిది. అక్కడున్న గుడిసెలోళ్లను ఖాళీ చేయించాలని ప్రయత్నం చేయడంతో తెలుసుకున్న కాకా ఆ భూస్వామి దగ్గరకు వెళ్ళి మాట్లాడి ఖాళీ చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశాడు. కాకాను చంపేయాలని పదిమంది గూండాలతో అవకాశం కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలుసుకున్న ఆ గుడిసెల వాసులు కాకా వెంటే ఉంటూ అయ్యా మీరు ఒంటరిగా ఎక్కడికి వెళ్లొద్దు అని కన్నీళ్లు పెట్టుకున్నారు. భయం అంటే తెలియకుండా దేన్నీ లెక్కచేయకుండా మొండిధైర్యంతో ముందుకు సాగిన కాకా మడమ తిప్పలేదు. గగన్ మహల్ దగ్గర గుడిసెల ప్రజలకు కూడా కాకా అండగా నిలబడ్డాడు. దీంతో కమ్యునిస్ట్ నేత రాజ్ బహదూర్ గౌడ్ మధ్యవర్తిగా సగం భూమిని పేదలకు మిగతా భూమి భూస్వామికి చెందేటట్లు ఒప్పుకోవడంతో ఆ గొడవలు ఆగిపోయాయి.
తూటాలకు భయపడలే
తెలంగాణ ఆంధ్రా విలీనమైన మొదట్లో బషీర్ బాగ్ లో జరిగిన పోరాటం హైదరాబాద్ చరిత్రలో కీలకం. అక్కడ వంద ఎకరాల భూమిలో కూలీలు గుడిసెలు వేసుకున్నారు. అది వనపర్తి సంస్థానానికి చెందిన రాజా రామేశ్వర్ రావుకు చెందిన భూమి. ఆయన పోలీసులు, మున్సిపల్ అధికారులతో వచ్చి దౌర్జన్యం చేసేందుకు పూనుకున్నారు. అది తెలుసుకున్న కాకా బషీర్ బాగ్ వచ్చి ముందు నిలబడ్డాడు. ఒకవేళ కాల్పులు జరిపితే ముందు నా గుండెల్లో తూటాలు దించమని పోలీసులకు సవాల్ విసిరాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. గవర్నర్ కాల్పులు జరపొద్దని ఆదేశించడం, అక్కడి ప్రజలకు మూడు రోజులు గడువు ఇవ్వమని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దాంతో గుడిసెల కూల్చివేత తాత్కాలికంగా వాయిదా పడింది. హైదరాబాద్ లో ఉన్న గుడిసెల వాసులను కూడగట్టిన కాకా మూడు లక్షల మందితో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో కాకా కు ఉన్న పలుకుబడిని చూసి సీఎం సంజీవరెడ్డి ఆశ్చర్యపోయారు. కాచిగూడలో గుడిసెల పోరాటంలో కాకాపై కత్తితో దాడి చేయగా వేరే వ్యక్తి అడ్డు రావడంతో కత్తి పోటు అతడికి దిగింది. ప్రజలు ఆ గూండాలను తరిమి కొట్టారు. కాచిగూడలో కాకా పేదలకు రెండువేల గుడిసెలు వేయించాడు. చిక్కడపల్లిలో ఓ పెద్ద హోటల్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కొంతమంది గుడిసెలు వేసుకొని ఉన్నారు. వారికి, హోటల్ యజమాని అచ్చయ్య సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని కొని పేదలకు ఇప్పించడంతో ఆ కాలనీకి అచ్చయ్యనగర్ అని పేరు పెట్టించాడు. ఇలా మలక్ పేట, చాదర్ ఘాట్, సరూర్ నగర్, అడిక్ మెట్లాంటి ప్రాంతంలో జీవిస్తున్న పేద ప్రజలకు తోడుగా నీడగా నిలబడి వాళ్లకు గుడిసెలు ఇప్పించాడు.
కాకాపై గాంధీ ప్రభావం
నీతి, నిజాయితీ, నిస్వార్థ రాజకీయాలకు నిలువుటద్దంగా చెప్పదగిన రామానంద తీర్థ 1938లో నిజాం సంస్థానంలో కాంగ్రెస్ విభాగాన్ని స్థాపించాడు. దీంతో కాకా లాంటి ఎంతోమంది ఆనాటి యువకులకు ఆదర్శమయ్యాడు. నిజాం పాలనలో రాజకీయ వేదికలకు చోటు లేకపోవడంతో స్టేట్ కాంగ్రెస్‌పై నిజాం సర్కార్ నిషేధం విధించింది. దాంతో దేశమంతా పర్యటిస్తూ స్వాతంత్ర్య సమరానికి ప్రజలను సిద్ధం చేస్తున్న గాంధీకి హైదరాబాద్ పర్యటన కష్టమైంది. అయినా హైదరాబాద్‌లో ఉన్న పాఠశాలలను చూపిస్తామని నిజాం సర్కార్‌కు అబద్ధం చెప్పి కాంగ్రెస్ లీడర్లు 1941లో కోఠి సమీపంలోని పుత్లిబౌలిలో ఉన్న వివేకవర్ధిని పాఠశాలకు తీసుకువచ్చారు. కాకా పాఠశాల నుంచి నడుచుకుంటూ అక్కడికి వెళ్ళారు. రాజకీయం అంటే ఏంటో తెలియని కాకా ఆ తరువాత కాంగ్రెస్‌వాదిగా మారాడు. అందుకు కారణం అతి దగ్గరగా గాంధీని చూడటమే.
కాకా మనసులో స్వాతంత్ర్య కాంక్ష
మెట్రిక్ పూర్తిచేసిన కాకా పదిహేనవ ఏట 1944 నవంబర్ 1న కళావతిని పెండ్లి చేసుకున్నాడు. రోజు రోజుకూ హైదరాబాద్‌లో నిజాంపై వ్యతిరేక ఉద్యమ నినాదాలు ఉధృతమవుతుండడంతో ఆ నినాదాలు వీధుల్లో మారుమోగేవి. ఆ నినాదాలను, గీతాలను విన్న కాకా మనసులో స్వాతంత్ర్య కాంక్ష రగిలింది. రహస్యంగా నిర్వహించే యూత్ కాంగ్రెస్ సమావేశాలకు కాకా వెళ్ళేవాడు. ఆ సమావేశాలు కూడా నిజాంకు వ్యతిరేకంగా జనాన్ని సమీకరించడం కోసమే నిర్వహించేవారు. 1945లో స్టేట్ కాంగ్రెస్‌పై నిజాం సర్కార్ నిషేధం తొలగించింది. దాంతో కాకా అధికారికంగా యూత్ కాంగ్రెస్‌లో చేరాడు. కాకా కాంగ్రెస్ ముఖ్య సభ్యులతో కలిసి సత్యాగ్రహంలో పాల్గొని అరెస్ట్ అయ్యాడు. 1946లో జయప్రకాశ్ నారాయణ్ రెండు లక్షలమందితో సికింద్రాబాద్‌లో నిర్వహించిన సభను విజయవంతం చేయడానికి యూత్ కాంగ్రెస్ సభ్యుడిగా కాకా తనవంతు పాత్రను క్రియాశీలకంగా వ్యవహరించాడు. కాకా తెగింపు, ధైర్యం వల్ల యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీగా నియమించబడ్డారు.
తెలంగాణ కోసం పార్లమెంటులో గళమెత్తిన కాకా
నిత్యం ప్రజల కోసం పరితపించిన కాకా1957లో మొట్ట మొదటిసారి సిర్పూర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాడు. 1967లో సిద్దిపేట నుంచి తొలిసారి ఎంపీగా పోటీచేసి గెలుపొందాడు. 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో తనదైన పద్ధతిలో పోరాడుతూ 1969 ఆగస్టు 18న పార్లమెంటులో తెలంగాణ ఇవ్వాలంటూ ఆందోళన చేశాడు. 1971 పార్లమెంట్ ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా గెలుపొందిన కాకా 1973లో కేంద్ర కార్మికశాఖ, పునరావాస, పౌర సరఫరాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు. 1977లో మళ్లీ సిద్దిపేట నుంచి మూడోసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. తరువాత 1978లో మర్రి చెన్నారెడ్డి కేబినెట్లో కార్మిక శాఖ, పౌర సరఫరాల మంత్రిగా పనిచేశాడు. 1982 నవంబర్ 16న పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యాడు. 1984లో పెద్దపల్లి నుంచి లోక్ సభ ఎన్నికల్లో నాలుగోసారి ఎంపీగా పోటీ చేసి గెలుపొందాడు. ఇలా 1991,1996, 2004లో కూడా వరుసగా పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించాడు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, కార్మిక శాఖ మంత్రి పదవులను చేపట్టిన కాకా ప్రపంచంలోనే తొలిసారిగా ప్రైవేట్ కార్మికుల కోసం పెన్షన్ పథకం అమలు చేయించాడు. ఏఐసీసీలో ఎస్సీ, ఎస్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. కాకా తన 85 ఏండ్ల జీవితకాలంలో దాదాపు 65 ఏండ్లు సామాజిక, ప్రజా, రాజకీయ ఉద్యమాలలో క్రియాశీలకంగా పనిచేసి జీవితాన్ని ప్రజలకు అంకితమిచ్చాడు. తన కుమారులైన గడ్డం వివేక్, గడ్డం వినోద్లకు ఆయన అనుసరించిన ప్రజా రాజకీయ ఉద్యమ మార్గాన్ని అందించిన కాకా మార్గదర్శిగా నిలిచాడు.
సాయుధ పోరాటంలో కాకా
హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలతో కలిసి విముక్తి పోరాటాన్ని కొనసాగిస్తూ వాడవాడల్లో జాతీయ జెండాలను ఎగురవేస్తూ, సత్యాగ్రహాలు చేస్తూ కాకా కూడా అరెస్టు అయ్యాడు. తరువాత హైదరాబాద్‌లో చేపట్టిన కార్యక్రమాలకు మంచి స్పందన లభించింది. ఒకవైపు కాంగ్రెస్ ఉద్యమాన్ని తీవ్రం చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ సంఘటితం చేస్తున్నారు. ఉద్యమ కాలంలో కాకా, రామ్మూర్తినాయుడు, సత్యనారాయణ రెడ్డిలతో కలిసి మొదటిసారి బాంబు తయారు చేయాలని ప్రయత్నించిన విషయం నిజాం పోలీసులకు తెలిసి చుట్టుముట్టారు. తప్పించుకునే క్రమంలో అడ్డుగా ఉన్న పోలీసులపై దాడిచేసి రాంనగర్ హరిజనవాడలో తలదాచుకున్నారు. ఆ తరువాత కొంతకాలానికి ఉద్యమ సహచరులతో కలిసి షోలాపూర్ చేరుకున్న కాకా.. కొండా లక్ష్మణ్ బాపూజీనీ కలిసి హైదరాబాద్‌లో జరుగుతున్న నిజాం వ్యతిరేక పోరాటం గురించి వివరించారు. ఉద్యమంలో అనుసరించాల్సిన వ్యూహంపై సలహాలు తీసుకున్నారు.
ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటు
పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఉన్నతమైన చదువులు చదివి గౌరవప్రదంగా జీవించేలా నాణ్యమైన చదువును వారికి అందించాలని కాకా ఎంతో తపించాడు. ఎట్లాంటి డొనేషన్లు, అధిక ఫీజులు లేకుండా 1973లో డా. బిఆర్ అంబేద్కర్ పేరుతో హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లిలో ఒక కాలేజి ఏర్పాటు చేశాడు. నాటి రాష్ట్రపతి వీవీ గిరి చేతుల మీదుగా ప్రారంభింపజేశాడు. దాన్ని శాఖోపశాఖలుగా విస్తరింపచేసి అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీగా వృద్ధి చేశాడు. కేజీ టూ పీజీతో పాటు లా కాలేజీ కూడా ఏర్పాటు చేశాడు. ఈ పోటీ ప్రపంచంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో కొత్త భవనాన్ని నిర్మించారు. ఇలా ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు ఏర్పాటు చేసి పేద పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలనే ఆశయంతో పరితపించిన కాకా 2014 డిసెంబర్ 22న తుది శ్వాస విడిచారు. ఇంతటి మహా నాయకుడి జీవిత పోరాటం నేటి యువ తరానికి ఆదర్శప్రాయం.
- ఎనుపోతుల వెంకటేష్
తెలుగు శాఖ, డా. బి.ఆర్ అంబేద్కర్ కళాశాల