వెయ్యి మాటల కన్నా ఒక్క ఫొటో ప్రత్యేకం : గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ

వెయ్యి మాటల కన్నా ఒక్క ఫొటో ప్రత్యేకం : గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ
  • ‘వెలుగు’ ఫొటోగ్రాఫర్స్‌‌కు అవార్డులు

బషీర్‌‌బాగ్‌‌, వెలుగు : వెయ్యి మాటల కన్నా ఒక్క ఫొటో ఎంతో గొప్పదని, పత్రికల్లో ఎన్నో వార్తలు ప్రచురితమైనా పాఠకుల దృష్టిని ఆకర్షించేది మాత్రం ఫోటోలేనని గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ అన్నారు. ఫొటోగ్రఫీలో తెలంగాణ, త్రిపుర రాష్ట్రాలకు గొప్ప చరిత్ర ఉందని, దేశంలో మొదటగా కెమెరాలు కొనుగోలు చేసి ఫొటోగ్రఫీని అభివృద్ధి చేసిన ఘనత హైదరాబాద్, త్రిపుర సంస్థానాలకే దక్కిందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్ట్స్‌‌ అసోసియేషన్‌‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌ బషీర్‌‌బాగ్‌‌ ప్రెస్‌‌క్లబ్‌‌లో సోమవారం ఉత్తమ ఫొటో జర్నలిస్టులకు అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ వార్త, తెలంగాణ పండుగలు, సాంస్కృతిక విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలైన వారికి అవార్డులను అందజేశారు.

అనంతరం గవర్నర్‌‌ మాట్లాడుతూ ప్రస్తుతం సోషల్‌‌ మీడియా ప్రభావంతో పత్రికలకు ఆదరణ తగ్గుతుందన్న చర్చ జరుగుతోందని, కానీ ఇది తాత్కాలికమేనని, పత్రికలకే భవిష్యత్‌‌ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఐజేయూ స్టీరిం కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్‌‌ పటేల్‌‌ రమేశ్‌‌రెడ్డి, రైస్‌‌ మిల్లర్స్‌‌ అసోసియేషన్‌‌ అధ్యక్షుడు తూడి దేవేందర్‌‌రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్‌‌అలీ, ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, ఫొటో జర్నలిస్ట్స్‌‌ అసోసియేషన్‌‌ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి గంగాధర్, కేఎన్‌‌.హరి పాల్గొన్నారు.

‘వెలుగు’ ఫొటోగ్రాఫర్లకు అవార్డులు

ఫొటో జర్నలిస్ట్స్‌‌ అసోసియేషన్‌‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో ‘వెలుగు’ ఫొటోగ్రాఫర్లకు అవార్డులు దక్కాయి. సిద్దిపేట జిల్లా స్టాఫ్‌‌ ఫొటోగ్రాఫర్‌‌ మహిమల భాస్కర్‌‌రెడ్డికి రాష్ట్రంలోనే ఉత్తమ ఫొటో జర్నలిస్ట్‌‌ అవార్డు దక్కింది. అలాగే ‘వెలుగు’ నల్గొండ జిల్లా స్టాఫ్‌‌ ఫొటోగ్రాఫర్‌‌ కొల్లోజు భవానీప్రసాద్‌‌ కన్సోలేషన్‌‌ అవార్డు దక్కించుకున్నాడు.