వనపర్తి, వెలుగు : గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు ప్రాజెక్టులకు కేసీఆర్ అన్యాయం చేశారని, ఆయనకు పాలమూరు పై మాట్లాడే నైతిక అర్హత లేదని కిసాన్ సెల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. సోమవారం రైతులతో కలిసి జూరాల ప్రాజెక్టు వద్ద మాజీ సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. గత పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వ పాలనలో దక్షిణ తెలంగాణ సాగు నీటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.
కృష్ణానది వరద గత పదేళ్ల నుంచి పోతిరెడ్డిపాడు కు వెళ్తున్నా.. పట్టించుకోలేదని విమర్శించారు. 13న నల్గొండలో కేసీఆర్ కృష్ణ బేసిన్ రైతుల సభ ఏర్పాటు చేయటం విచిత్రంగా ఉందన్నారు. దీనిని రైతులు వ్యతిరేకించాలని కోరారు. కార్యక్రమంలో అమచింత మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కేజీ మహేందర్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి పాండురంగమ్ యాదవ్, అమరచింత కిసాన్ అధ్యక్షుడు లక్ష్మీకాంతరెడ్డి పాల్గొన్నారు.