నకిరేకల్, వెలుగు: నకిరేకల్ నియోజకవర్గంలో ఒక్క ఎకరాకైనా నీళ్లిచ్చినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి రాజీనామా చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సవాల్ విసిరారు.
శనివారం పట్టణంలోని తన క్యాంపు ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జగదీశ్ రెడ్డి ధర్మారెడ్డి పిల్లాయిపల్లి కాలువల నిర్మాణ పనుల కాంట్రాక్టు తన అనుచరులకు ఇప్పించుకొని, ఈ ప్రాంత ప్రజలకు మోసం చేసిన 420 అని విమర్శించారు. తీరు మార్చుకోకపోతే బండారాలన్నీ ఒక్కొక్కటిగా బయటపెడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కాకముందే కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజల దీవెనతో ఏర్పడ్డ ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు వారిని లేదన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు హామీలను అమలు చేశామని స్పష్టం చేశారు. అనంతరం 12వ వార్డు కౌన్సిలర్ బానోతు వెంకన్న, 14వ వార్డు కౌన్సిలర్ గడ్డం స్వామి బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి ఎమ్మెల్యే సమక్ష్యంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సమావేశంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శంబయ్య, కాంగ్రెస్ నాయకులు చామల శ్రీనివాస్, దైద రవీందర్ పాల్గొన్నారు.