ఏడాదిలో లిఫ్ట్‌ పూర్తి చేయకుంటే రాజకీయాల్లో ఉండను : వేముల వీరేశం

నకిరేకల్, వెలుగు: నకిరేకల్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే  అయిటి పాముల లిఫ్ట్‌‌ను ఏడాదిలో  పూర్తి చేయిస్తానని, లేదంటే  రాజకీయాల్లో ఉండనని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రకటించారు. బుధవారం మండలంలోని కడపర్తి గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయిటి పాముల లిఫ్టును తానే మంజూరు చేయించి పనులు ప్రారంభించానని గుర్తుచేశారు.

 అది  పూర్తికాకుండానే  ఎన్నికల్లో లబ్ధి కోసం  పనులు పూర్తయ్యాయని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి హంగామా చేశారని విమర్శించారు. అసలు కాల్వ పనులు పూర్తి కాలేదని, ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే వాళ్లు చెప్పుమన్నట్టే చెప్పామని ఒప్పుకున్నారన్నారు. గత ఎమ్మెల్యే తానే మంజూరు చేసినట్లు గొప్పలు చెప్పారని దమ్ముంటే  ఆధారాలతో సహా నకిరేకల్‌‌ సెంటర్‌‌‌‌కు రావాలని సవాల్ చేశారు. ఇందుకు 10 రోజుల సమయం ఇస్తున్నానని,  లేదంటే తాను మంజూరు చేయించినట్లు ఆధారాలు చూపిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ  శ్రీదేవి గంగాధర్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.