రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో BRS పార్టీలో రాజకీయాలు హీటెక్కాయి. అక్కడ తాజా ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు... బీఆర్ఎస్ నాయకులు చల్మెడ లక్ష్మీ నరసింహరావు మధ్య పొలిటికల్ వార్ నడుస్తుంది. ఇప్పటికే వేములవాడ బీఆర్ఎస్ రెండు వర్గాలుగా విడిపోగా...తాజాగా వేములవాడ పట్టణంలో చల్మెడ లక్ష్మీ నరసింహరావు సొంతంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం చర్చనీయాంశమైంది.
వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ నాయకుడు చల్మెడ లక్ష్మీ నరసింహ రావు సొంతంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభాకర్ రావు, కొనరావుపేట, సనుగుల సింగిల్ విండో చైర్మన్లు బండ నర్సయ్య యాదవ్, జలగం కిషన్ రావు, మాజీ జడ్పీ చైర్ పర్సన్ తీగల రవీందర్ గౌడ్, కౌన్సిలర్ నిమ్మ శెట్టి విజయ్, సేస్ మాజీ డైరెక్టర్ గజనంద రావు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు హాజరయ్యారు.
వేములవాడ ప్రజలకు సేవ చేస్తా..
వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం అనేది వ్యక్తిగతం అని చల్మెడ లక్ష్మీనరసింహరావు అన్నారు. ఈ కార్యక్రమానికి అనేక మంది బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు అభిమానంతో హాజరయ్యారని చెప్పారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తప్పకుండా వేములవాడ ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు. ఇప్పటికే వేములవాడ నియోజకవర్గంలో చాలా సేవా కార్యక్రమాలు చేపట్టానని..తాను వేములవాడ నియోజకవర్గానికే చెందినవాడినంటూ చెప్పుకొచ్చారు.
టికెట్ వివాదం..
కొద్ది కాలంగా వేములవాడలో చల్మెడ లక్ష్మీ నరసింహరావు , ఎమ్మెల్యే రమేష్ బాబు మధ్య ఎమ్మెల్యే టికెట్ కోసం వివాదం కొనసాగుతోంది. ఇద్దరు కూడా ఎవరికి వారే తనదే టికెట్ అంటూ అనుచరుల దగ్గర చెప్పుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎవరికి వారే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఇరువురు అనుచరులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ నేపథ్యంలో చల్మెడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం మరింత హాట్ టాపిక్ గా మారింది. వేములవాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.