ఫాజుల్ నగర్ లో పూడ్చిపెట్టిన చిన్నారి డెడ్‌‌‌‌ బాడీకి పోస్టుమార్టం

 ఫాజుల్ నగర్ లో  పూడ్చిపెట్టిన చిన్నారి డెడ్‌‌‌‌ బాడీకి పోస్టుమార్టం

వేములవాడ రూరల్, వెలుగు: తమ చిన్నారి మృతికి రెండు ఆస్పత్రుల వైద్య సిబ్బందినే కారణమని బాధిత దంపతుల ఫిర్యాదుతో డెడ్ బాడీని బయటకు తీసి పోస్టుమార్టం చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ కు చెందిన గండి రాజశేఖర్, గీతాంజలి దంపతులకు గత నెల18న కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మగబిడ్డ జన్మించాడు. శిశువు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వెంటనే మరో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స​చేయించారు. అక్కడ కూడా చిన్నారి పరిస్థితి సీరియస్ గా ఉండడంతో హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ గంటల వ్యవధిలోనే చిన్నారి చనిపోయాడు. 

దీంతో బాధిత దంపతులు ఇంటికి తీసుకెళ్లి పూడ్చిపెట్టారు. అనంతరం తమ చిన్నారి మృతికి కరీంనగర్ లోని రెండు ప్రైవేటు ఆస్పత్రుల వైద్య సిబ్బందినే కారణమని ఆరోపిస్తూ చిన్నారి తండ్రి రాజశేఖర్ కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.  బుధవారం టూటౌన్ ఎస్ఐలు చంద్రశేఖర్, దీపక్ కుమార్ సమక్షంలో చిన్నారిని పూడ్చిపెట్టిన చోట తవ్వి డెడ్ బాడీని బయటకు తీసి పంచనామా చేశారు. అనంతరం వేములవాడ రూరల్ తహసీల్దార్ అబుబాకర్ సమక్షంలో చిన్నారి డెడ్ బాడీకి ఏరియా ఆస్పత్రి డాక్టర్ ప్రణతి రెడ్డి పోస్టుమార్టం చేశారు. మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.