వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న ఆలయం సోమవారం శివనామస్మరణతో మారుమ్రోగింది. శ్రావణమాసం, సోమవారం కావడంతో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ నుంచి వేలాది మంది తరలివచ్చారు. తలనీలాల సమర్పించిన అనంతరం ధర్మగుండంలో పుణ్యస్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతరం పలువురు భక్తులు కోడె మొక్కులు చెల్లించారు. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. రద్దీ కారణంగా స్వామి వారి దర్శనానికి 5 గంటలు పట్టిందని భక్తులు తెలిపారు. మరో వైపు అర్చకులు ఉదయం స్వామి వారికి వేదమంత్రోచ్ఛరణల మధ్య మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. బాలత్రిపురాదేవి అమ్మవారి వద్ద కుంకుమ పూజ నిర్వహించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ సోమవారం స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు.