వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయ అవరణలోని దర్గా మెయింటనెన్స్విషయంలో రెండు ముస్లిం వర్గాల మధ్య గురువారం గొడవ జరిగింది. ఈ దర్గాను తరతరాలుగా రెండు వర్గాలు ప్రతి యేడాది శివరాత్రికి ఒక వర్గం చొప్పున మెయింటెయిన్ చేస్తున్నారు. కానీ, రెండు మూడేండ్లుగా దర్గాపై పూర్తిస్థాయి హక్కులు తమకే ఉన్నాయని అక్బర్ హుస్సేన్ వారసులు ఇఫ్తేకార్ హుస్సేన్ వర్గం, అది కరెక్ట్ కాదని తాతల కాలం నుంచి ఇద్దరికీ హక్కులున్నాయని అష్రఫ్అలీ ఇబ్రహీం వారసులు నసీర్వర్గం గొడవ పడుతున్నారు.
దీని గురించి ఇఫ్తేకార్హుస్సేన్వర్గం కోర్టుకు వెళ్లింది. గురువారం వక్ప్ బోర్డు ఇచ్చిన ఓ కాపీతో దర్గా వద్దకు వెళ్లారు. అప్పటికే దర్గాలో ఉన్న ససీర్ వర్గం దర్గాపై తమకూ హక్కులు ఉన్నాయని చెప్పడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వచ్చి ఇరువర్గాలను బయటకు పంపి దర్గాకు తాళం వేశారు. శివరాత్రి వరకు ఒక వర్గానికి అవకాశం ఉండగా అక్రమంగా వెళ్లి గొడవ చేసిన ఇఫ్తేకార్ హుస్సేన్, రెహన్, జుల్ఫికర్లపై కేసు నమోదు చేశామని సీఐ కరుణాకర్ తెలిపారు.