వేములవాడ/వేముల వాడ రూరల్, వెలుగు : మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్వాసితుల త్యాగ ఫలితంగానే రైతులకు నీరందుతోందని, ఆలస్యమైనా నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. ఆదివారం వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచలో 36 మంది మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్వాసితులకు ఎమ్మెల్యే రూ. 4 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాసిత యువత కోసం ప్రత్యేకంగా పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
దళితుల అభివృద్ధికి కృషి
ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చేస్తోందని ఎమ్మెల్యే రమేశ్‌బాబు అన్నారు. వేములవాడ రూరల్ మండలం పోచెట్టిపల్లి గ్రామంలో సువర్ణ టెంట్ హౌస్ యూనిట్ ను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత కుటుంబాలలో పేదరికాన్ని తొలగించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునివ్వడమే దళితబంధు ఉద్ధేశ్యమన్నారు.