అభివృద్ధికి నోచని నాంపల్లి గుట్ట

  •     గుట్టపైనున్నలక్ష్మీనరసింహస్వామి  ఆలయంపై నిర్లక్ష్యం
  •      బ్రోచర్లకే  పరిమితమైన రూ.30కోట్ల ప్రణాళికలు
  •     ఆలయంపై తాగునీరు, టాయిలెట్స్​ లేవ్​
  •     ఇబ్బందులు పడుతున్న భక్తులు

వేములవాడ, వెలుగు : ఆధ్యాత్మికత, ప్రకృతి అందాలకు నిలయమైన వేములవాడ నాంపల్లి గుట్ట అభివృద్ధికి నోచుకోవడం లేదు. గుట్టపైనున్న శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ అభివృద్ధి బ్రోచర్లకే పరిమితమైంది. రూ.30 కోట్లతో చేసిన ప్రణాళికలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. గుట్టపై కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.  

తాగేందుకు నీరు ఉండవు.. నిలువ నీడ ఉండదు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని నాంపల్లి శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయం 600 ఏండ్ల కింద వెలసినట్లు చరిత్ర చెబుతోంది. నాంపల్లి గుట్ట విస్తీర్ణం 112 ఎకరాల్లో ఉండగా, చుట్టూ పచ్చని పొలాలతో ఆహ్లాదంగా ఉంటుంది. భక్తులు వేములవాడ రాజన్నను దర్శించుకున్న అనంతరం నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది.  ఏటా శివరాత్రి ఉత్సవాలు, లక్ష్మీనరసింహస్వామి దివ్య కల్యాణంతోపాటు శ్రావణ, కార్తీక మాసాలలో అధికంగా భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.

నానాటికీ నాంపల్లి శ్రీలక్ష్మీనరసింహ ఆలయానికి భక్తుల తాకిడి పెరుగుతోంది. కానీ గుట్టపై ఎలాంటి మౌలిక వసతులు కల్పించడం లేదు.  గుట్టపై ఉన్న ధర్మగుండం కాస్త మురికిగా మారినా పట్టించుకునే వారే కరువయ్యారు. గుట్టపైన భక్తులకు కనీసం తాగుదామంటే నీరు దొరకదు. పిల్లాపాపలతో దర్శనం కోసం వస్తున్న భక్తులు సేద తీరేందుకు సరిపడా చలువ పందిళ్లు లేవు. టాయిలెట్స్‌‌‌‌‌‌‌‌, బాత్​ రూమ్స్​ లేక ఇబ్బందులు పడుతున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సీఎం హామీలు నెరవేరలే..

గతంలో సీఎం కేసీఆర్​గుట్టను సందర్శించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను అదేశించారు. గుట్టపై ధ్యాన మందిరం, ఘాట్ రోడ్డు నిర్మాణం, ప్లానెటోరియం, పనోరమ వ్యూ , రోప్ వే , ధర్మగుండం ఆధునీకీకరణ, భక్తుల వసతి కోసం కాటేజీలు నిర్మించేందుకు సుమారు రూ.30కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. కానీ  ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.  మరోవైపు గుట్టపైకి వెళ్లేందుకు ఘాట్​రోడ్డు ప్రమాదకరంగా ఉంది. రోడ్డుకిరువైపులా గ్రిల్స్ వంటి రక్షణ నిర్మాణాలు చేపట్టాల్సి  ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. 

భక్తులకు సౌకర్యాలు పెంచుతాం..

నాంపలి గుట్టపై భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం. అలాగే నాంపల్లి గుట్ట వీటీడీఏ పరిధిలో ఉండడంతో చిన్న చిన్న  పనులు మాత్రమే ఆలయ పరిధిలో చేస్తున్నాం.  ఘాట్​రోడ్డుపై సేఫ్టీ గార్డ్స్​ ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్​అధికారులను ఆదేశించాం.  భక్తులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటాం.  

- ఈవో, కృష్ణ ప్రసాద్​